క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభం

credai-property-show-starts-in-hyderabad

క్రెడాయ్‌ ప్రాపర్టీ షో 2020 ప్రారంభమైంది. మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షోకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి షోను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. నిర్మాణ రంగంలో పలు రాష్ట్రాల నుంచి చాలా మంది వలస వచ్చి కూలీలుగా జీవనం సాగిస్తున్నారని, మన ప్రజలు మాత్రం గల్ఫ్‌ దేశాల్లో తక్కువ జీతాలతో పడరానిపాట్లు పడుతున్నారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి గల్ఫ్‌ దేశాల్లో పర్యటిస్తారని, అక్కడ పని చేసే తెలంగాణ కార్మికులను తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. స్థిరాస్తి వ్యాపారుల సమస్యలను పరిష్కరించామని అన్నారు. స్థిరాస్తి వ్యాపారులు నూతన సాంకేతికతను వినియోగించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో అమలు చేసిన టీఎస్‌ ఐపాస్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. హైదరాబాద్‌ మీదనే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టిసారించామన్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాలనపైనే దృష్టి పెడతామన్నారు. నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌ మీదే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించాలని సూచించారు. పట్టణాలకు పురపాలక శాఖ నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, మౌలిక వసతులు కల్పించడం ద్వారా అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ప్రపంచంలో అత్యధిక రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచిందని చెబుతూ.. భవిష్యత్‌లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


                    Advertise with us !!!