రివ్యూ : అందరిని అలరించే 'అల వైకుంఠపురం లో'

Ala Vaikuntapuramlo Movie Review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5

బ్యానెర్లు: హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంయుక్తంగా
నటి నటులు : అల్లుఅర్జున్, పూజ హెగ్డే, టబు,  జయరాం,  సుశాంత్, నవదీప్,  నివేత  పెత్తురాజ్,  సముద్ర ఖని,  రాజేంద్ర  ప్రసాద్,   మురళి  శర్మ,  గోవింద్  పద్మసూర్య,  రోహిణి,  సునీల్,  రాహుల్  రామకృష్ణ, వెన్నెల  కిశోర్,  బ్రహ్మాజీ,  బ్రహ్మానందం  గెస్ట్,  అజయ్,  తనికెళ్ళ  భరణి,  సచిన్  ఖేడేకర్,  హర్ష  వర్ధన్,  చమ్మక్ చంద్ర తడి తరులు నటించారు.
సంగీతం : థమన్,
సినిమాటోగ్రఫీ : ఫి యస్ వినోద్,
ఎడిటర్ : నవీన్ నూలి,
పాటలు : సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ, రామ జోగయ్య శాస్ట్రీ, కృష్ణ చైతన్య, కాసర్ల శ్యామ్,కల్యాణ చక్రవర్తి,
సమర్పణ : శ్రీమతి మమత,
నిర్మాతలు : అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు)
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్,
విడుదల తేదీ : 12.01.2020

జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, చిత్రాల తరువాత  స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో  తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథనాయికగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్ర టీజర్‌ హిట్‌.. ట్రైలర్‌ సూపర్‌ హిట్‌.. పాటలు సూపర్‌ డూపర్‌ హిట్టవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫలితం తర్వాత బన్ని గ్యాప్‌ తీసుకొని చేస్తున్న చిత్రం కావడం.. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైరెక్ట్‌ చేస్తుండటం.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు సూపర్‌ హిట్‌లు పడటంతో కామన్‌గానే ‘అల.. వైకుంఠపురములో’ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా? బన్ని తనదైన స్టైల్‌ నటనతో మెప్పించాడా? త్రివిక్రమ్‌ తన మార్క్‌ సినిమా చూపించాడా? సెన్సేషనల్‌ రికార్డులతో తమన్‌ స్వరపరిచిన పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయా? ఓవరాల్‌గా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ అల్లు హీరో విజయం సాధించాడా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం.

కథ:
బంటు (అల్లు అర్జున్‌), రాజ్‌ మనోహర్‌ (సుశాంత్‌)లు ఒకే ఆసుపత్రిలో ఒకే సమయానికి పుడతారు. అయితే బేసిక్‌గా బంటు ఫ్యామిలీ మిడిల్‌ క్లాస్‌, కాగా రాజ్‌ మనోహర్‌ది బాగా ఉన్నతమైన కుటుంబం. బంటు వాళ్ల నాన్న వాల్మీకి (మురళీ శర్మ) వీఏఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు (జయరామ్‌)  దగ్గర పనిచేస్తుంటాడు. రామచంద్ర రావు, అంజలి (టబు)ల కుమారుడే రాజ్‌ మనోహర్‌. అయితే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కావడం, తండ్రి వాల్మీకి పెట్టే ఓ రకమైన టార్చర్‌తో బంటు ఇబ్బందులు పడతాడు. అయితే ఈ క్రమంలోనే అమూల్య (పూజా హెగ్డే)తో బంటుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కాగా అప్పలనాయడు (సముద్రఖని) తన కొడుకు పైడితల్లి కోసం వీఏఆర్కే కంపెనీలో షేర్స్‌ కావాలని గొడవపెట్టుకుంటాడు. ఈ తరుణంలో రామచంద్ర రావుపై హత్యాయత్నం జరుగుతుంది. అయితే రామచంద్రరావును కాపాడిన బంటుకు ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. దీంతో రామచంద్రరావును కాపాడేందుకు వైకుంఠపురములో అనే బంగ్లాలోకి దిగుతాడు. అయితే చివరకు ఏం జరిగింది? అప్పలనాయుడు కుటుంబం నుంచి వీఆర్కే కంపెనీని, రామచంద్రరావు కుటుంబాన్ని కాపాడాడా? ఈ కథలోకి కాశీ(హర్షవర్దన్‌), సీత (సునీల్‌), పెద్దాయన (సచిన్‌), శేఖర్‌ (నవదీప్‌), ఎస్పీ (రాజేంద్ర ప్రసాద్‌), నివేదా పేతురాజులు ఎందుకు ఎంటరవుతారు? ఆస్పత్రిలో బంటుకు తెలిసిన నిజం ఏమిటి? ఈ సినిమా కథకు ఈశ్వరికి ఉన్న సంబంధంఏమిటి? రామచంద్రరావు అంటే వాల్మీకి ఎందుకు పడదు? బంటు రాజు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అదే అసలు కథ.. ‘అల.. వైకుంఠపురములో’ కథ.

నటీనటుల హావభావాలు:
ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్‌.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ టైమింగ్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచాడు . ముఖ్యంగా స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆఫీస్ సీన్ లో గాని… మరియు లవ్ స్టోరీ స్టార్టింగ్ లో వచ్చే లవ్ సీన్స్ లో అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ గా నవ్వించారు. పైగా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు.

పూర్తి స్వార్థం నిండిన పాత్రలో మురళీశర్మ అద్భుతంగా నటించాడు. తన మాడ్యులేషన్ స్టైల్ ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన తండ్రి గురించి చెబుతూ బన్ని ఎందుకు భావోద్వేగమవుతాడో ఈ సినిమా చివర్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్లతో అర్థమవుతుంది. ఇక ఇప్పటివరకు డ్యాన్స్‌ల్లో తన మార్క్‌ స్టైల్‌ చూపెట్టిన అల్లు అర్జున్‌.. ఈ సినిమాలో కొత్తగా, వైవిధ్యంగా, స్టైల్‌గా ఫైట్‌ చేశాడు. కొన్ని ఫైట్‌ సీన్లయితే వావ్‌ అనిపించేలా ఉన్నాయి. అల్లు అర్జున్ తో సెకండ్ టైం నటించిన   పూజా హెగ్డే  అమూల్య పాత్రలో  చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే మరో మాజీ హీరోయిన్ టబు, జైరాం తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. ఇంకా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు సనీల్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. 

సాంకేతిక వర్గం పనితీరు :
ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బన్నీ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ గుర్తుపెట్టుకునే మంచి కామెడీతో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. ఇక గుడ్ థీమ్ తో త్రివిక్రమ్ రాసిన ట్రీట్మెంట్ అండ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మరో ప్రధాన బలం. త్రివిక్రమ్ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా మంచి ఫన్ తో నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు.పలు హీరోల హిట్‌ పాటలతో అల్లు అర్జున్‌ చేసే ఇమిటేషన్‌ స్టెప్పులు నవ్వులు తెప్పిస్తాయి. విలనిజం తక్కువైనా ఎమోషన్‌ సీన్స్‌ బాగున్నాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, హీరో ఎలివేషన్‌ సీన్స్‌, పలు సన్నివేశాలకు తమన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ భలే ఆకట్టుకుంటుంది. అలా కంపోజ్‌ చేశారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌. ఇక క్లైమాక్స్‌లో శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ సాంగ్‌ సూపర్బ్‌గా ఉంటుంది.  ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాను చాలా రిచ్‌గా, హీరోహీరోయిన్లను అందంగా చూపించారు సినిమాటోగ్రఫర్‌ వినోద్‌. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ హిట్‌ పాటలు సినిమాలో ఇరికిచ్చినట్లు ఉంటాయని అందరూ భయపడినప్పటికీ అవి సందర్బానుసారంగా వస్తాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట సరైన సమయంలో పడుతుంది. ఇక త్రివిక్రమ్‌ సినిమాల్లోని పాటల్లో సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటల రచయితలు తమ సాహిత్యంతో సినిమా స్థాయిని మరింత పెంచారు. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సిలంది.  నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

 

విశ్లేషణ:
హిట్ అండ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్లీన్ ఎంటర్టైనర్ మంచి పాయింట్ తో గుడ్ ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లేతో బలమైన పాత్రలు మరియు భారీ తారాగణంతో అలాగే డీసెంట్ కామెడీతో బాగా అకట్టుకుంది. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, లవ్ సీన్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. కానీ బన్నీ తన నటనతో తన డాన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం అల్లు అర్జున్ అభిమానులతో పాటు మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సంక్రాంతి తెలుగువారికి రుచికరమైన వినోదం.

ప్లస్‌ పాయింట్స్‌:
అల్లు అర్జున్‌ అద్భుత  నటన
పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌
యాక్షన్‌ సీన్స్‌
సెంటిమెంట్ సీన్స్

మైనస్‌ పాయింట్స్‌:
సినిమా నిడివి
కథలో కొత్తదనం లేకపోవడం(గతం లో వచ్చిన కధే)


                    Advertise with us !!!