Six months of YS Jagan Mohan Reddy as AP CM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎపి రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని చెబుతున్నారు. ఆయన పాలనా బాధ్యతలు చేపట్టి ఆరునెలలు పూర్తయింది. ఈ ఆరునెలల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన కార్యక్రమాలు, నిర్ణయాలు ఆయనకు మంచి ఇమేజ్‌నే తీసుకువచ్చాయి. దానికి తోడు పాలనలో ఆయన తీసుకువస్తున్న సంస్కరణలు అందరినీ ఆకర్షించాయి. కేబినెట్‌ కూర్పు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష రివర్స్‌ టెండరింగ్‌ వంటివి సంచలనాన్ని సృష్టించాయి.

కొన్ని పాజిటివ్‌ నిర్ణయాలతోపాటు జగన్‌ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అందులో ప్రజావేదికను కూల్చివేయడం, ఆగిన ఇసుక రవాణా, ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టి ఆర్నెల్లు పూర్తయింది. ఈ ఏడాది మే 30న ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హమీలు, ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. తన నిర్ణయాలతో ఈ ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని నవశకం వైపు పయనించేలా చేశారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ఆయన దష్టికి వచ్చిన సమస్యల పరిష్కారమే కాకుండా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ నవశకం పేరిట ఇంటింట సర్వేలు జరిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేందుకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

'ఆరు నెలల్లోగా మీ అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా' అని ప్రమాణస్వీకార వేదికపై నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా, అగమ్యగోచరంగా ఉన్నా, జగన్‌ తన సంక్షేమబాట నుంచి వెనుదిరగలేదు. తొలి అడుగే సంక్షేమ సంతకంపై పెట్టిన జగన్‌ నాటి నుంచి వరుసగా సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా అనేక కొత్త పథకాలను ఆయన అమలుచేసి తన సత్తా ఏమిటో చూపించారు. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించే 'స్పందన' కార్యక్రమం ఎంతో పాపులర్‌ అయింది. ప్రభుత్వం ఏర్పడి కొద్దికాలంలోనే కొత్తగా 1.40 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలలో పని మొదలయ్యింది. పెరిగిన వేతనాలు వంటివి అనేక రంగాలలో కొత్త ఉత్తేజానికి దారితీశాయి.

మద్యనిషేధం దశలు మొదలుకావడం మహిళలను ఆనందించేలా చేశాయి.  రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేయడమే కాదు అవినీతికి తావులేని పారదర్శక పాలన చూసి విమర్శకులు సైతం కితాబులిచ్చేలా జగన్‌ ముందుకు సాగుతున్నారు. మౌలిక రంగాలైన విద్య, వైద్యంలో సమూల మార్పులు చేపట్టడం, పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరచేందుకు నిర్ణీత కాలాన్ని, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడం వంటివి సామాజిక మార్పు దిశగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో మెరుగైన స్థానం కల్పించడం ఓ రికార్డు. అంతేకాదు ఈ వర్గాలకు, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ 50శాతం రిజర్వేషన్‌ కల్పించడం సంచలనాన్ని సృష్టించింది.

అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లుగానే ఎంతోమంది వేతనాలను పెంచారు. ఆశా వర్కర్లకు, బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది, .హోం గార్డులు, వీవోఏ(వెలుగు యానిమేటర్లు), 108 పైలెట్‌(డ్రైవర్‌), ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌) వేతనం, 104 వాహన ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా ఎన్నో వర్గాలకు వేతనాలను పెంచి అందరిలోనూ సంతోషాన్ని నింపారు.

జగన్‌ తీసుకున్న సచివాలయాలు-ఉద్యోగాల విప్లవం వల్ల ప్రజల పనులు/సమస్యలు 72 గంటల్లో పరిష్కారమయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు చూస్తాయి. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.75 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ను నియమించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని నామినేటెడ్‌ పదవులు (టీటీడీ మినహా), నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశారు.

వైఎస్సార్‌ నవోదయం పేరుతో లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివద్ధిపై దృష్టి పెట్టారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులు 3.70 లక్షల మందికి తొలి విడతలో రూ.263 కోట్లు పంపిణీ చేశారు. పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్‌ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యంను కల్పించిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే.

ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి వీలుగా ప్రతి సోమవారం 'స్పందన' కార్యక్రమంను ప్రవేశపెట్టి, అందులో భాగంగా ఎప్పటిలోగా సమస్య పరిష్కరిస్తారో సూచిస్తూ ప్రతి అర్జీకి రశీదు తప్పనిసరి ఇచ్చేలా చేశారు. దానికి తోడు ప్రతి వారం 'స్పందన' అమలు తీరుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించడం ఆర్జీదారుల్లో నమ్మకాన్ని నిలిపింది.

వైఎస్సార్‌ నవశకం పేరుతో గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల ఆర్థిక సాయం.. అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

దశల వారీగా మద్యనిషేధంలో భాగంగా రాష్ట్రంలోని 44 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. 4,380 మద్యం షాపుల్లో 880 తగ్గించి 3,500కు కుదించారు. ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వహణను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బార్లలోనూ 40 శాతం తగ్గించాలని నిర్ణయం. మద్యం ధరలు పెంపు, లైసెన్స్‌ ఫీజు భారీగా పెంపు వంటి వాటితో మద్యనిషేధాన్ని దశలవారీగా చేపడుతున్నారు.

మనబడి నాడు-నేడులో భాగంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. అందులో భాగంగా తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివద్ధి చేయనున్నారు. ప్రస్తుతం పాఠశాలల ఫొటోలు తీసి, అభివద్ధి చేశాక ఆ ఫొటోలతో తేడా చూపనున్నారు.

రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు, ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు చేపడుతారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీని జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

రైతుల కోసం

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేశారు. మరో 2.14 లక్షల మంది రైతులకు కూడా ఇవ్వనున్నారు.  మొత్తంగా 48 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో రైతులకు అందు బాటులో నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు. వర్క్‌షాపుల్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాలు, రూ.4 వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రక తి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్‌, ఆయిల్‌పాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు, ఉచిత పంటల, పశు బీమా, గత ప్రభుత్వ ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి రూ. 2 వేల కోట్లు విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ 15 శాతం పెంపు, వ్యవసాయ ల్యాబ్‌లు, ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌, ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌ సరఫరా. శెనగ రైతులకు రూ. 330 కోట్లు, ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణతో సమానంగా ధర చెల్లింపునకు రూ. 85 కోట్లు, పెదవేగి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ యాజమాన్య హక్కులు రైతులకు అప్పగింత. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం, రైతులకు వడ్డీ లేని రుణాలు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు వంటివి రైతుల మేలుకోసం జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.

వైఎస్సార్‌ వాహన మిత్ర

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్‌, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.  ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.236 కోట్లతో 2,36,343 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించారు.   

వైఎస్సార్‌ కంటి వెలుగు 

ఈ పథకం కింద ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స చేయిస్తున్నారు. తొలి విడతగా సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. రెండవ విడతలో వీరిలో అవసరమైన వారికి చికిత్స చేయించి, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలవుతాయి.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే సహాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నారు. తద్వారా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి. అలాగే మర పడవల నిర్వాహకులకు ఇస్తున్న డీజిల్‌ రాయితీ లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంపు. ఇంజను కలిగిన తెప్పలకూ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ. సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. కొత్తగా మూడు ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు. ముమ్మిడివరంలో చమురు నిక్షేపాల అన్వేషణలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం చెల్లింపు వంటివి మత్య్సకారులకోసం జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది.

వైఎస్సార్‌ కాపు నేస్తం

ఈ పథకం కింద తొలి ఏడాది రూ. 1,101 కోట్లు కేటాయించారు. 45 ఏళ్లు దాటిన కాపు మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల సహాయం చేయనున్నారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

ఈ పేరుతో సామాజిక పెన్షన్లు రూ.2,250కి పెంచారు. ఏటా రూ.250 పెంపుతో రూ.3 వేల వరకు పెంచుతారు. వద్ధుల పెన్షన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వికలాంగులకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తున్నారు.

ఆరోగ్యశ్రీ

ఈ పథకం కింద వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం చేస్తారు. డయాలసిస్‌ చేయించుకునే వారు, తలసేమియా, సికిల్‌సెల్‌, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్‌. ప్రమాదాల కారణంగా, పక్షవాతం వల్ల, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోధకాలు, దీరెకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛన్‌. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పింఛన్‌.

కార్పొరేట్‌ ఆసుపత్రులకు 'నాడు - నేడు'

కింద ప్రభుత్వా సుపత్రుల అభివద్ధి, ఇందుకు రూ.1,500 కోట్లు కేటాయింపు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు కేటాయించారు.  సుమారు 3.5 కోట్ల మందికి లబ్ధి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులు. మొత్తంగా 2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులు ఏ చదువు చదివినా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జగనన్న వసతి దీవెన పథకం కింద 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేయనున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలకూ వర్తింపజేయనున్నారు. ఈ పథకాల కింద 11.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, రూ.5668 కోట్లు కేటాయించారు.

రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం చేయనున్నారు. ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్‌ లక్ష్యం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఈ కార్పొరేషన్‌ ద్వారానే వేతనాలను చెల్లిస్తారు.

వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగిస్తూనే ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున అమ్మఒడికింద సాయం అందిస్తారు. దాదాపు 45 లక్షల మంది అమ్మలకు రూ.6,600 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు. 

వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి రోజు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం చేయనున్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు. డ్వాక్రా సంఘాలకు ఎన్నికల నాటికి ఉన్న అప్పుల మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో (రెండవ ఏడాది నుంచి) దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా రూ.75 వేల సాయం చేయనున్నారు.

ఇలా ఎన్నో కార్యక్రమాలతో జగన్‌ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, మరోవైపు ప్రజలందరికి ఉపయోగపడే నిర్ణయాలను తీసుకుంటోంది. తన ఆరునెలల పాలనాకాలంలోనే ఎన్నో నిర్ణయాలను ప్రవేశపెట్టి మంచి ముఖ్యమంత్రిగా జగన్‌ పేరు తెచ్చుకున్నారు.