Bike ambulances grounded in tribal areas of state

గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్‌ (బైక్‌) అంబులెన్స్‌లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్‌ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఎపిడమిక్‌ సీజన్‌లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్‌సీలకు తరలించడానికి ఫీడర్‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. దీంతో బైక్‌ అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.