
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్
అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలోని మార్ల్బరోలో నివసిస్తున్న ఎన్నారై, వైఎస్ఆర్సిపి యుఎస్ఎ కన్వీనర్, కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్‌ను ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన సంగతి తెలిసిందే. కడప రత్నాకర్‌గా అందరికీ తెలిసిన వ్యక్తి. కడప ఇన్నోవేషన్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ జిల్లా, హైదరాబాద్‌లలో అనేక సేవా కార్యక్రమాలను ఆయన చేస్తున్నారు. కడప రత్నాకర్ 20 ఏళ్ళుగా అమెరికాలో నివసిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కడప రత్నాకర్‌ను తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన ముఖ్యాంశాలు.
ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మీ ముందున్న లక్ష్యాలేమిటి?
ఉత్తర అమెరికా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నన్ను నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల డాలస్ పర్యటనలో ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నారైలు తమ గ్రామాల్లోని ఆస్పత్రులు, స్కూళ్ళ పునర్ని ర్మాణంలో, పరిశ్రమల ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. ఆయన సూచనల ప్రకారం గ్రామా ల్లోని ఆస్పత్రులు, స్కూళ్ళ పునర్నిర్మాణంలో ఎన్నారైల సహకారం తీసుకుంటాము.
మీ గురించి చెప్పండి?
నాది కడప జిల్లా. సిద్ధవటంలో పుట్టాను. కడపలో విద్యాభ్యాసం చేశాను. తరువాత మైసూర్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివాను. అమెరికాలో ఉద్యోగ అవకాశం లభించడంతో అమెరికాకు వెళ్ళాను. అక్కడే 20 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. తొలుత ఐటీ ఉద్యోగిగా పనిచేసి నేడు ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్నాను. 2015 నుంచి వైఎస్ఆర్సీపి యుఎస్ఎకి కన్వీనర్‌గా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేస్తున్నాను.
రాష్ట్ర ప్రగతిలో ఎన్నారైలను ఏ విధంగా భాగస్వాములను చేయనున్నారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలో విద్య, వైద్యం ఒకటి. విద్యమూలం ఇదం జగత్ అన్న నానుడిని నేను నమ్ముతాను. ఎన్నారైలు ఆంధ్రరాష్ట్రంలో విద్యాభివృద్ధికి తమవంతు సహాయం అందించేలా చూడటంతోపాటు, దానికి తగ్గట్టుగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నాము. త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణను తెస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాను.