హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో బీసీలు ఎస్సీలు ఎటువైపు?

Huzurnagar Bye Elections in Telangana

అన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల పోరులో గెలుపుకోసం అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ, సత్తా చాటాలని బిజెపి, ఉనికిని నిరూపించుకోవాలని తెలుగుదేశం?పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ?నేపథ్యంలో  ఇక్కడి ఓటర్లను ఎవరికీ వారు ప్రసన్నం?చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ఉపఎన్నికలో బీసీ, ఎస్సీ సామాజికవర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. దాంతో ఈ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు, ముఖ్య నేతలు ఈ వర్గాల ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అక్టోబర్‌ 21న హుజూర్‌నగర్‌ శాసనసభకు ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే బరిలో నిలిచిన కాంగ్రెస్‌, తెరాస అభ్యర్థులు ఉత్తమ్‌ పద్మావతి, శానంపూడి సైదిరెడ్డి రోడ్‌షోలు నిర్వహించడంతో పాటు గడప గడపకు వెళుతూ ఎన్నికల్లో తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ రెండు పార్టీలు బీసీ, ఎస్సీ సామాజికవర్గాల ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుని వారిని కలుస్తూ ఎన్నికల్లో తమను గెలిపిస్తే హుజూర్‌నగర్‌ను అభివద్ధి చేయడంతొపాటు ఆయా సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తామని హామీలిస్తున్నారు.

హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,20,108 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 38.01 శాతం బీసీలుండగా, వీరి సంఖ్యలో 83, 663గా ఉంది. బీసీ సామాజికవర్గంలో గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 16,838 మంది (7.65శాతం) ఉన్నట్టు గణాంకాలనుబట్టి తెలుస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 16,530 (7.15 శాతం), మున్నూరుకాపు 13,273 (6.03 శాతం), ముదిరాజ్‌, ముతరాసి, తెనుగు 13,228 (6.01 శాతం), పెరిక 7,154 (3.25 శాతం), నాయీబ్రాహ్మణ 6,911 (3.14 శాతం), కమ్మరి 5,415 (2.46 శాతం) మంది ఓటర్లున్నారు. బీసీల్లోని ఉప కులాలకు చెందిన ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు ఆయా సామాజికవర్గాలకు చెందిన పార్టీ నేతలను రంగంలోకి దింపి సమావేశాలను నిర్వహిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటికే ఈ సామాజికవర్గాలకు చెంది న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులను రంగంలోకి దింపి వారిచేత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇప్పటికే ఆయా సామాజికవర్గాల నేతలను ఎంపికచేసి నియోజ కవర్గంలో ప్రచారాన్ని నిర్వహించేలా వ్యూహం రచించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఓట్ల బదిలీని పటిష్టంగా జరిపించేందుకు ఆయా పార్టీల ముఖ్యులు ప్రణాళికలు వేస్తున్నారు.  బీసీ సామాజికవర్గానికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ఎన్నికలలో బీసీలకు పెద్దపీట వేసిన విషయాన్ని తెరాస నేతలు గుర్తుచేస్తూ ఉపఎన్నికల్లో అధినేత కేసీఆర్‌ ఎంపిక చేసిన సైదిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాల, మాదిగ ఓటర్లు ఈ నియోజకవర్గంలో 37,727 మంది ఉన్నా రు. ఇందులో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 21,483 (9.76 శాతం), మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 16,244 (7.38 శాతం) ఉన్నారు. కేసీఆర్‌ తన మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించలేదని ఈ సామాజికవర్గాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గం నేతలు ఈ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను కలుస్తూ ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అకారణంగా తొలగించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి చోటు కల్పించారని, రెండోసారి జరిగిన ఎన్నికల తర్వాత జరిపిన మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి రిక్తహస్తం చూపించారని వారు ఈ సామాజికవర్గ ఓటర్లను చైతన్యపరిచే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ తెరాస నేతలు ఈ సామాజికవర్గ ఓటర్లను కలుస్తూ ఏ, బీ, సీ,డీ వర్గీకరణ విషయంలో కేసీఆర్‌ అసెంబ్లిలో తీర్మానంచేసి కేంద్రానికి పంపినా అక్కడి బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని చెబుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 


                    Advertise with us !!!