ఎపిలో బలం పెంచుకుంటున్న బిజెపి

Bharatiya Janata Party in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో బలం పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాజకీయంగా బలం పెంచుకుంటూనే మరోవైపు అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సమానదూరంలో ఉండాలని పార్టీ భావిస్తోంది. పార్టీని ముందుగా పటిష్టం చేసుకునేదిశగా అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నేతలతో చర్చలు, సంప్రదింపుల కోసం కొందరు ముఖ్యనేతలను ఇప్పటికే రంగంలోకి దించింది. వైపీసీ నుంచి బీజేపీలో చేరే అవకాశాలు ఇప్పడయితే లేవు గానీ, తెలుగుదేశంలో పార్టీలో ఉన్న అసంతప్తులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. తమంతట తాముగా ఆహ్వానించకుండా ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్న నేతల చేరికలను ఇకపై ఆలస్యం చేయకూడదన్న అభిప్రాయంతో పార్టీ ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఒక మాజీ ఎంపి త్వరలోనే తమ పార్టీలో చేరబోతున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు రెండు రోజుల క్రితం అనంతపురంలో ప్రకటించారు. ఆయన ప్రకటనతో తెలుగు దేశలో ఉలికిపాటు మొదలైంది. వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. రాయలసీమకు చెందిన ఆ మాజీ ఎంపీతో సంప్రదింపులు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నాననీ, తాను పార్టీ మారాల్సిన ప్రత్యేక పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆయనతేల్చి చెప్పినట్టు సమాచారం. ఆ మాజీ ఎంపితో పాటు రాయలసీమకు చెందిన మాజీ మంత్రి, గుంటూరుకు చెందిన మరో మాజీ ఎంపిచేరికకు కూడా రంగం సిద్ధమైనట్టు తెలిసింది.

ఇటీవల ఢిల్లి%స% వెళ్ళిన మాజీ మంత్రి బీజేపీ లోని కొందరు ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తన చేరిక తరువాత ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై ఆ యన కొన్ని షరతులు విధించినట్టు సమాచారం. బీజేపీ నుంచి ఎలాంటి హామీలు ఇవ్వలేమనీ, బేష రతుగా పార్టీలో చేరే విషయాన్ని ఆలోచించు కోవాలని తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీజేపీ వైఖరి తో ఒక అడుగు వెనక్కి తగ్గిన ఆ మాజీ మంత్రి 'ఇపుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరటమే క్షేమం' అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి సమాచారం పంపించగా, త్వరలోనే ఆయనకు 'కాషాయ' తీర్థం ఇచ్చేందుకు నిర?యించినట్టు సమాచారం. జీవీఎల్‌ ప్రకటించినట్టు ఒక మాజీ ఎంపి చేరికకు కూడా రంగం సిద్దమైంది. ఈ ఇద్దరి సీనియర్‌ నేతల చేరికతో రాయలసీమలో వలసల పర్వం ఊపందుకునే అవకాశం ఉన్నట్టు బీజేపీ భావి స్తోంది. తెలుగుదేశంలో వారి సొంతవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలంతా బీజేపీలోకి వస్తారని భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మరో మాజీ ఎంపి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుని చేరికకు కూడా రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఆయన చేరికపై కొందరి నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలిసింది.

వీరే కాకుండా తెలుగుదేశంలో ఊగిసలాట ధోరణితో ఉన్న వారితోనూ బీజేపీ సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలతో నూ, మరికొందరు ముఖ్య నేతలతోనూ బీజేపీ మాట్లాడుతున్నట్టు సమాచారం. మాజీ ఎంపి లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు సీనియర్‌ నేతల చేరికను బీజేపీఅధిష్టానమే నేరుగా డీల్‌ చేస్తోంది. వారిపై సమగ్రమైన నివేదికలను తెప్పించుకుంటుంది. సామాజికవర్గాలు, ప్రాంతాలు, వారికున్న బలాన్ని బేరీజు వేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మరణం తరువాత బీజేపీలో అంతర్గత చర్చ జరిగినట్టు తెలిసింది. ఆయన చేరికపై అనవసర జాప్యం చేశామనీ, తొందరగా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీలో చేరేందుకు కోడెల తమను సంప్రదించారని ఆ పార్టీ నాయకుడు పి.రఘురామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలో పటిష్టమైన రాజకీయ పునాదులున్న తెలుగుదేశంకు అన్ని జిల్లాల్లో జనాదరణ ఉన్న నేతలున్నారనీ, వారు గతంలోలాగా ఆ పార్టీలో మమేకం కావటం లేదనీ, రాష్ట్రంలో బలం పెంచుకోవాలని భావిస్తున్న తరుణంలో అందివచ్చిన రాజకీయ అవకాశాలను వెంటనే ఉపయోగించుకోవాలని బీజేపీ నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఆ దిశలోనే వడివడిగా అడుగులు వేస్తోంది.

 


                    Advertise with us !!!