
తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 3.75/5
బ్యానర్ : కొణిదల ప్రొడక్షన్స్
నటి నటులు : ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా మెగా స్టార్ చిరంజీవి, గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్, భార్య సిద్దమ్మ గా నాయన తార, లక్ష్మి గా తమన్నా భాటియా, వీర రెడ్డిగా జగపతి బాబు, అవుకు రాజుగా కిచ సుదీప్, రాజా పండి గా విజయ్ సేతుపతి, ఝాన్సీ లక్ష్మి గా అతిధి పాత్రా లో అనుష్క శెట్టి, కొణిదల నిహారిక, లక్ష్మి గోపాల స్వామి, బ్రహ్మాజీ, రవి కిషన్. రఘు బాబు, డేనియల్ గా మాథ్యూ స్టిర్లింగ్ వంటి విదేశీ నటులు నటించారు.
సినిమాటోగ్రఫీ: ఆర్ .రత్నవేలు
ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్.
సంగీతం : అమిత్ త్రివేది (పాటలు) జూలియస్ ప్యకియం (నేపధ్య సంగీతం)
కధనం : పరుచూరి బ్రదర్స్, మాటలు : సాయి మాధవ్ బుర్ర
సమర్పణ : సురేఖ కొణిదల, నిర్మాత : రాంచరణ్ కొణిదల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేంద్ర రెడ్డి
విడుదల తేదీ :02.10.2019
రేనాటి (కడప, కర్నూల్ జిల్లాలు) వీరుడు.. తొలినాటి స్వతంత్ర సమర యోధుడు.. స్వతంత్ర సమర యోధుల కథలు ఎన్నిసార్లు విన్నా, ఎంత మంది చెప్పినా అందులోని ఎమోషన్ మనల్ని వెంటాడేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మరి మనకు సంబంధించిన ఓ వీరుడి కథే 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని ఓ అచ్చమైన తెలుగువాడి కథని మెగాస్టార్ చిరంజీవి ఎంపిక చేసుకోవడమే విశేషం. సైరా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించడం తో సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కొణిదల ప్రొడక్షన్ పతాకంపై హిందీ, తెలుగు, తమిళ భాషలలో రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైరా అందర్నీ మెప్పించిందా లేదా అన్నది చూద్దాం.
కథ:
స్వాతంత్య్ర సమరోత్సాహానికి తొలి శంఖం పూరించిన ఓ యోధుడి కథ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర కు అంతగా ప్రాచూర్యం లభించకపోవడం. మరో రకంగా చూస్తే సైరా టీమ్‌కు బలం కూడా అదే. ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు కాబట్టి – ఇప్పుడు చెబితే కొత్తగా ఉంటుంది. ఎవ్వరూ చూపించలేదు కాబట్టి, ఇప్పుడు ఏం చూపించినా వర్కవుట్ అయిపోతుంది. ఈ కథని ఎప్పటి నుంచో సినిమాగా తీయాలన్నది చిరు ఆలోచన. పన్నేండుళ్ల క్రితం ఈ కథకు అంకురార్పణ జరిగింది. రెండేళ్ల క్రితం కార్యరూపం దాల్చి ఈ రోజు మనముందుకు వచ్చింది. బ్రిటీష్ వారి దౌర్జన్యాలకు, దుర్మార్గాలకూ భారతీయులు బలైపోతున్న కాలమది. రేనాడు ప్రాంతంలో 61 ప్రాంతాల్ని పాలేగాళ్లు (పాలించే వారు) పరిపాలిస్తుంటారు. కాకపోతే… పెత్తనమంతా బ్రిటీషు దొరలదే. పంట పండడకపోయినా సరే.. ప్రభుత్వానికి శిస్తు కట్టాల్సిందే అని బ్రిటీషు కలెక్టరు హుకూం జారీ చేస్తాడు. అలసిపోయిన ప్రజలకు.. వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకూ బాసటగా నిలుస్తాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ భూమి మాది, పంట మాది, కష్టం మాది.. నీకెందుకు శిస్తు కట్టాలి? అంటూ తొలిసారి బ్రిటీషు దొరలపై యుద్ధం ప్రకటిస్తాడు. కానీ.. తనకంటూ ఓ సైన్యం లేదు. మిగిలిన పాలేగాళ్లను కలుపుకోవాలంటే.. వాళ్లలో ఐకమత్యం ఉండదు. ఈ దశలో రేనాడు సూరీడు సైరా ఎలా ఉద్యమించాడు? ఆ సంగ్రామంలో తనకు బాసటగా నిలిచినవాళ్లెవరు? వెన్నుపోటు పొడిచిన వాళ్లెవరు? దేశం కోసం తానేం చేశాడు? అనేదే… ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ.
నటీనటులు హావా బావాలు:
సైరాలో మెగాస్టార్ చిరంజీవి కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంబీర్యం ఎక్కడా మిస్ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. అయనకున్న వయసులో నడవడమే చాలా కష్టం. కానీ ఈ సినిమాలో చిరంజీవిని 30 ఏళ్ల యువకుడిగా, యాక్షన్ సీన్స్‌లో అయితే మెగాస్టార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే సీన్స్‌లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు.
ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. మరణం కాదు ఇది జననం.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్ప్రైజ్కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా నటనతో, నాట్యంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్, బ్రహ్మాజి, ఝాన్సీ రాణిగా అతిధి పాత్రలో నటించిన అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
టెక్నికల్‌గా బాహుబలి ఓ స్టాండర్డ్ సృష్టించింది. దాన్ని అందుకునే ప్రయత్నం, సాహసం చేసింది `సైరా` టీమ్. విజువల్‌గా `సైరా` ఉన్నతంగా ఉంది. రత్నవేలు కెమెరావర్క్, ఆర్ట్ పనితనం ప్రధమ స్థాయిలో ఉన్నాయి. ప్రతీ సన్నివేశంలోనూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. అందుకోసం టీమ్ ఎంత కష్టపడిందో అర్థం అవుతూనే ఉంటుంది. సినిమాలోని వార్ సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అమిత్ త్రివేద్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జూలియస్ పాకియం అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
ఇక దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ స్కేల్లో సినిమాని భుజాన వేసుకోవడం మామూలు విషయం కాదు. తన పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించాడు. అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్లో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది. ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్ బుర్రా రాశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. అయితే.. ఈ సినిమా టేకాఫ్ దగ్గర కాస్త తడబడ్డాడు. ఎమోషన్ పీక్స్‌లోకి తీసుకెళ్లగలిగే స్థాయి ఉన్న సన్నివేశాల్ని కూడా పైపైన టచ్ చేసి వదిలేశాడు. లేదంటే.. సైరా అంతిమ ఫలితం మరో స్థాయిలో ఉండేది. నిర్మాతగా చరణ్‌కి వందకు వంద మార్కులు పడతాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
విశ్లేషణ:
తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్ చరణ్ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్స్ తో వచ్చిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అయితే కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. కానీ, దర్శకుడు సురేందర్ రెడ్డి సైరాను అద్భుతమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలతో చాల గొప్పగా తెరకెక్కించాడు. అన్నిటికి మించి మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే మిగిలిన భారీ తారాగణం కూడా అద్భుతమైన నటనను కనబర్చారు. ఓవరాల్ గా ‘సైరా’ ప్యాన్ ఇండియా మూవీగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి ప్రేరణ కలిగించే యాక్షన్ అండ్ ఎమోషనల్ విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది.