రివ్యూ : అహో అనిపించని 'సాహో'

saaho movie review

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 2.5/5

బ్యానర్ : యు వి క్రియేషన్స్,
నటీనటులు : ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, ఛంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, లాల్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు.
పాటలకు సంగీతం :తనిష్క్  బాగ్చి, గురు రంధావా, బాద్షా, శంకర్ - ఏషాన్ - లోయ్
నేపధ్య సంగీతం : జిబ్రాన్, సినిమాటోగ్రఫర్ : ఆర్ మధీ
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాత‌లు : ప్రమోద్, వంశీ, విక్ర‌మ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజిత్
విడుదల తేదీ :30.08.2019

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సాధించిన విజయం తో ప్రభాస్‌ హీరోగా అదే స్థాయి హైప్‌ తీసుకువచ్చిన సినిమా సాహో సుజీత్‌ దర్శకత్వంలో  యు వి క్రియేషన్స్దా, టి సిరీస్ సంయుక్తంగా హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలలో  దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, లొకేషన్లు ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం అని చిత్రయూనిట్ నమ్మకంగా చెప్పింది. మరి ప్రభాస్‌.. బాహుబలి తరువాత మరోసారి సాహో ప్రభాస్  అనిపించాడా..? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌ ఇంతటి భారీ చిత్రాన్ని ఎలా డీల్‌ చేశాడు..? మరోసారి సౌత్‌ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటిందా.? సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే అశోక్ (ప్రభాస్) ముంబైలో జరిగిన 2000 కోట్ల భారీ దోపిడీ కేసును ఛేదించే పోలీస్ టీమ్ కీలకంగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అమృత(శ్రద్ధా కపూర్) కూడా ప్రభాస్ తో కలిసి పని చెయ్యాల్సి వస్తుంది. కానీ ఆ తరువాత జరిగిన సంఘటనలతో ఊహించని మలుపులతో సినిమా ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఏమిటి? ఈ భారీ చోరీ నుంచి దీని వైపు కథ ఎందుకు మలుపు తిరిగింది? ఈ పరిస్థితులు మధ్య ప్రభాస్ ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నాడు ?మొత్తానికి ఆ దోపిడీ మరియు బ్లాక్ బాక్స్ వెనుకున్న రహస్యం ఏమిటి ? మరో పక్క వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్‌ స్టర్స్‌ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. రాయ్‌ (జాకీ ష్రాఫ్‌‌) ఓ గ్రూప్‌ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్‌ వరల్డ్‌కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్‌ (చంకీ పాండే), రాయ్‌ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద  ముంబై వచ్చిన రాయ్‌  ప్రమాదంలో చనిపోతాడు. ఇదే అదునుగా భావించిన దేవరాజ్‌ క్రైమ్‌ వరల్డ్‌ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ క్రైమ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడతాడు. పోలీస్ అశోక్ (ప్రభాస్ )కి, అలాగే సాహో (ప్రభాస్)కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ప్రభాస్ ఎవరు ? అతని వెనుక ఉన్న లైఫ్ ఏమిటి? అసలు క్రైమ్‌ సిండికేట్‌ను నడిపే రాయ్‌ ఎలా చనిపోయాడు.? అశోక్‌, అమృత ప్రేమ ఏమైంది..? తెలియాలంటే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

సినిమా అంతా వన్ అండ్ ఓన్లీ గా తన భుజాల మీద మోసిన ప్రభాస్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రెండు వేరియేషన్స్‌లోనూ ప్రభాస్‌ నటన ఆకట్టుకుంటుంది. లుక్స్‌ పరంగానూ ప్రభాస్‌ సూపర్బ్ అనిపించాడు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ చూపించిన ఈజ్‌, పర్ఫెక్షన్‌ వావ్‌ అనిపించేలా ఉంది. రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. పోలీసు అధికారి పాత్రలో శ్రద్ధా కపూర్‌ ఒదిగిపోయింది. యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. విలన్లుగా చాలా మంది నటులు తెర మీద కనిపించినా ఎవరికీ పెద్దగా స్క్రీన్‌ టైం దక్కలేదు. చంకీ పాండే, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌, లాల్‌లు తమ పాత్రల పరిధి మేరకు ఓకె అనిపించగా జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, మహేష్‌ మంజ్రేకర్‌ లాంటి నటులకు సరైన పాత్రలు దక్కలేదు. మరో కీలక పాత్రలో నటించిన మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్‌ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

సాంకేతిక వర్గం పని తీరు :

రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. భారీ తారాగణం, 350  కోట్ల బడ్జెట్‌, జాతీయ స్థాయి సినిమా... ఇంత ప్రెజర్‌ను హ్యాండిల్ చేయటంలో సుజీత్ తడబడ్డాడు. ప్రభాస్‌ను స్టైలిష్‌గా, హాలీవుడ్ స్టార్‌లా చూపింటం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు కథా కథనాల విషయంలో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఒక రొటీన్‌ క్రైమ్‌ ఫార్ములా కథను ఎంచుకున్న సుజీత్‌, ఆ కథను కూడా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. లెక్కలేనని పాత్రలు, ప్రతీ పాత్రకు ఓ సబ్‌ ప్లాట్‌తో కథనం గజిబిజీగా తయారైంది. అయితే డార్లింగ్ అభిమానులను మాత్రం ఖుషీ చేశాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత వెండితెర మీద కనిపించిన ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి చూపించాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా మారినా ద్వితీయార్థం లోనూ తడబాటు కనిపించింది. లవ్‌ స్టోరి కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి.ఇక సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గురు రాంధ్వా, బాద్షా, శంకర్ ఎహసాన్ లాయ్ సమకూర్చిన పాటలు వినడానికి కంటే.. స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ :

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా వచ్చిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో, థ్రిల్ చేసే ట్విస్ట్ లతో, అండ్ వావ్ అనిపించే స్పెషల్ ఎఫెక్ట్స్ తో మరియు బలమైన ప్రభాస్ స్క్రీన్ ప్రేజన్సీతో ఆసక్తికరంగా సాగినప్పటికీ.. స్లోగా సాగే సీన్స్ తో అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ భారీ విజువల్స్ మరియు గ్రేట్ స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ నటన బాగా అలరిస్తాయి. మొత్తానికి ‘సాహో’ కథతో ఆకట్టుకోలేకపోయినా.. ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి విజువల్ ట్రీట్ లా అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై నెలకొన్న భారీ అంచనాల వల్ల థియేటర్లకు జనాలు రావడం వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినా, ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోకపోవచ్చు.

ప్లస్‌ పాయింట్‌ :
యాక్షన్‌ సీన్స్‌
ప్రభాస్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫి
సినిమా గ్రాండియర్ 

మైనస్‌ పాయింట్స్‌ :

కథా కథనాలు
నిడివి
ఎడిటింగ్‌

ముందుగానే అర్ధమయ్యే ట్విస్టులు