22nd TANA National Conference Campaign in Dallas

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభలు వాషింగ్టన్‌ డీసీ నగరంలో జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా డల్లాస్‌లోని తానా నాయకులు, అభిమానులతో అధ్యక్షుడు సతీష్‌ వేమన, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నరేన్‌ కొడాలి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తానా మహాసభలకు చేస్తున్న ఏర్పాట్లు తదితర వివరాలను వారు తెలియజేశారు.

తానా ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కొండ్రకుంట చలపతి ఆధ్వర్యంలో ప్లేనోలో జరిగిన ఈ సమావేశానికి తానా అభిమానులు ఎందరో హాజరయ్యారు. 44ఏళ్లుగా తెలుగు భాషా సంస్కతి సాంప్రదాయలను పరిరక్షించడంతో పాటు వాటి అభ్యున్నతికి విశేష కషి చేస్తున్న తానా డీసీలో జరగబోయే మహాసభల ద్వారా మరో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని   కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు విరివిగా విరాళాలు ప్రకటించారు. సమావేశం

ముగిసే సమయానికి దాదాపు 302,000డాలర్లు ఇస్తామని ఎన్నారైలు ప్రకటించినట్లు  చలపతి పేర్కొన్నారు. తానా సభలకు రికార్డు స్థాయిలో విరాళాలు అందించినవారికి తానా ప్రాంతీయ ప్రతినిధి సుగన్‌ చాగర్లమూడి ధన్యవాదాలు తెలిపారు. ప్రవాసుల ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి తానా ఆకాశం వంటిదని 22వ మహాసభల పట్ల వారికున్న ఆశయాలు అందుకునేలా, నమ్మకాలు అధిగమించేలా ఏర్పాట్లు చేసి డీసీ సభలను దిగ్విజయం చేసేందుకు శాయిశక్తులా కషి చేస్తామని సతీష్‌, నరేన్‌లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండవ శ్రీనివాస్‌, అడుసుమిల్లి రాజేష్‌, కేసీ చేకూరి, వీరపనేని అనిల్‌, పోలవరపు శ్రీకాంత్‌, మురళీ వెన్నం, దొడ్డా సాంబా, కన్నెగంటి చంద్ర, కన్నెగంటి మంజులత, డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి, నాటా తరఫున డా.కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి, టాటా తరఫున విక్రం జనగామ, టాంటెక్స్‌ తరఫున చినసత్యం వీర్నపు తదితరులు పాల్గొన్నారు.