రివ్యూ : మహేష్ మరో సందేశాత్మక చిత్రం 'మహర్షి'

Maharshi Movie Review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి వి పి సినిమా
నటి నటులు : మహేష్, పూజ హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పోసానికృష్ణ మురళి, మీనాక్షి  దీక్షిత్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, తదితరులు నటించారు.

సినిమాటోగ్రఫీ : కె.యు.మోహనన్, కూర్పు: ప్రవీణ్ కె యల్ 
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, మాటలు : వంశీ పైడిపల్లి, హరి,అహిషోర్  సోలమన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి

విడుదల తేదీ : 09.05.2019

మహేష్ బాబు ఇరవై ఐదవ చిత్రంగా వచ్చిన  ‘మహర్షి’ విడుదల కోసం సూపర్ స్టార్  అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. మంచి సందేశాత్మకమైన కథ తో  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్  సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వినీ దత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్  సంయుక్తంగా నిర్మించిన ఈ  భారీ బడ్జెట్ చిత్రం ఈ రోజే  అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుందో  సమీక్షలో తెలుసుకుందాం!

కథ:

రిషి (మహేష్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన తెలివైన యువకుడు. చిన్నప్పటి నుండి తన తండ్రి (ప్రకాష్ రాజ్) ఫెయిల్యూర్స్ ను చూసి..తన జీవితంలో వేగంగా గెలవాలని కసిని పెంచుకుంటాడు. ఎప్పటికైనా తన మేధా సంపత్తితో ప్రపంచాన్ని ఏలాలనుకుంటాడు. అనుకున్నది అంతే వేగంగా విజయం  సాధిస్తాడు. అమెరికా లో పేరొందిన ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కి సి.ఈ.ఓ గా ఉన్నత స్థానాన్ని అధిష్టిస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తన కాలేజ్ రోజుల్లో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. ఆ సంఘటనల కారణంగా తన కాలేజీ ఫ్రెండ్ రవి (అల్లరి నరేష్) తన కోసం చేసిన త్యాగం రిషిని కదిలిస్తోంది.  ఆ విషయాన్ని తెలుసుకున్న రిషి అమెరికా నుండి  రవి వున్నా రామాపురం గ్రామానికి వస్తాడు.  తర్వాత జరిగిన సంఘటనల కారణంగా రిషి ‘సీఈఓ’ స్థాయిలో ఉండి కూడా వ్యవసాయం చేస్తాడు. అసలు రిషి ‘సీఈఓ’ నుండి రైతుగా ఎందుకు మారాల్సి వస్తుంది.? చివరికి రిషి తన ఫ్రెండ్ రవి కోసం ఏం చేశాడు ? అసలు రవి పాత్ర వెనుకున్న ఆ త్యాగం  ఏమిటి?  ఆ అంశం కారణంగా రిషి ‘రిషి నుండి మహర్షి’గా ఎలా ఎదిగాడు ? అన్నదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

ఎన్నో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘మహర్షి’ ఆ అంచనాలను అవలీలగా అందుకున్నాడు రిషిబాబు గా నటించిన  మహేష్. అన్నిటికి మించీ మహేష్  మరోసారి తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. కాలేజీ కుర్రాడిగా, కంపెనీ సీఈఓగా, ఓ రైతుగా ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో.. మూడు డిఫరెంట్ షేడ్స్ తోనూ.. ప్రతి పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేష్  తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తన గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో మహేష్  నటన ఇంకా చాలా బాగుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఆలాగే కీలక పాత్రలో నటించిన కామెడీ హీరో అల్లరి నరేష్, మహేష్ తరువాత సినిమాలో ఓ  హైలెట్ గా నిలిచాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నరేష్ నటన చాలా బాగుంది. అలాగే బిగ్ షాట్  పాత్రలో నటించిన జగపతి బాబు కూడా ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే జయసుధ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్  తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

మహేష్ వంటి  స్టార్ హీరో కు  తగ్గట్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న సబ్జెక్ట్ ‘మహర్షి’ని మరో స్థాయిలో నిలబెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే  ‘మహర్షి’ ఈ నాటి యువతకు, అందరికీ కనెక్ట్ అయ్యే ఒక సందేశాత్మకమైన కథను ఎంపిక చేసుకోవడం లో విజయం సాధించాడు. రచయితగా దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. 178 నిమిషాల నిడివి ఉండడంతో సినిమా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ విషయం లో శ్రద్ధ తీసుకుంటే బాగుండేది.  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.  సినిమాలో పాటల పిక్చరైజేషన్  విజువల్ గా మాత్రం బాగున్నాయి.  నేపధ్య సంగీతం చాలా బాగుంది. అలాగే కేయూ. మోహనన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా  ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. 

విశ్లేషణ:

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు చాలా సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు.. మిగిలిన కొన్ని కొన్ని సన్నివేశాల్లో స్లో గా నడిపించాడు. 'మహర్షి' చూస్తుంటే మహేష్ గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు గుర్తుకు వస్తుంటాయి. గతంలో వచ్చిన మహేష్ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది.  ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ చాలా సింపుల్ గా నడిపారు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు ఒకటి రెండు సన్నివేశాలు బాగానే తీసినా అవి కూడా సహజసిద్ధంగా లేవు. సెకెండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. ఇక హీరో తానూ అనుకున్నది సాధించే క్రమంలో వచ్చే సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ వున్నా లేనట్లే అనిపిస్తుంది. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ‘మాహర్షి’ కొద్దిమందినే  మెప్పిస్తాడు. ఈ చిత్రం లో ఏదైనా హైలెట్ అనిపిస్తే అది మహేష్ నటనే మరోసారి తన నటనతో అబ్బురపరిచారు. మొత్తం మీద ‘మహర్షి’ మహేష్ బాబు అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి.