రివ్యూ : ప్రేమానురాగాల, భావోద్వేగాల ప్రయాణం 'జెర్సీ'

Jersey Movie Review

తెలుగుటైమ్స్ నెట్ రేటింగ్ 3.25/5

బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్ 
నటీనటులు : నాని, శ్రద్ధ శ్రీనాథ్, సత్యరాజ్, రావు రమేష్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ,
సంపత్ రాజ్, ప్రవీణ్,రోనిత్ కమ్ర, ఫిన్  హిల్బెర్ట్, ఆరోన్ బ్లేక్ల్య్  తదితరులు నటించారు 
సంగీతం : అనిరుద్ రవిచందర్, పాటలు : కృష్ణ కాంత్, బ్రోద వి
సినిమాటోగ్రాఫర్ : సను వర్గీస్, ఎడిటర్ : నవిన్ నూలి
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

విడుదల తేదీ:19.04.2019

ఈ సమ్మర్ లో విడుదలవుతున్న చిత్రాల్లో మంచి హైప్ తెచ్చుకున్న సినిమా 'జెర్సీ'. దేవదాస్‌, కృష్ణార్జున యుద్దం లాంటి పక్క కమర్షియల్‌ సినిమాలను చేసి సరైన విజయాన్ని అందుకోలేని నాని.. తిరిగి మంచి కథను నమ్ముకుని  తన పంథాలోకి వచ్చేశాడు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు జెర్సీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా నాని ఆశించిన విజయాన్ని అందించిందా? సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన ఎమోషనల్  జర్నీ ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారా లేదో  సమీక్షలో చూద్దాం..

కథ:

అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌(క్రికెట్‌ లైఫ్‌) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌..  ఓ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్‌ అయి నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ ఉంటాడు అర్జున్‌, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్‌ ఉద్యోగం కూడా పోతుంది. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతిని కూడా కొనివ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది . ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటాడు. అసలు అర్జున్‌  క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ మిగతా కథ.

నటీనటులు హావభావాలు: 

అర్జున్‌ పాత్రలో నో డౌట్  నానిని తప్పా మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేకుండా.. ఆ పాత్రలో జీవించేశాడు. యంగ్,  మిడిల్ ఏజ్డ్ గా సినిమా లో వన్ మ్యాన్ షో చేసాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ, నార్మల్‌ ఫ్యామిలీ పర్సన్‌గానూ టూ షేడ్స్ లో నటించి మెప్పించాడు. రియల్‌ లైఫ్‌లో నాన్నగా  మారినా నాని.. రీల్‌ లైఫ్‌లోనూ ఆ ఫీలింగ్‌ను క్యారీ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో బాగా నటించాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ మంచి మార్కులు కొట్టేసింది. ప్రియురాలుగాను, భార్యగానూ రెండు పాత్రల్లో శ్రద్దా సహజంగా నటించింది. లుక్స్‌పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కోచ్‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

మంచి డ్రామా కు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి సినిమాను అందరు మెచ్చే విధంగా తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అసలు ఈ సినిమా కు నాని ని హీరోగా తీసుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. తన టేకింగ్ కు నాని నటన తోడవడంతో తన రెండవ ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడు గౌతమ్. త్వరలోనే ఈ డైరెక్టర్ ఏస్ మేకర్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక డైరెక్టర్ తరువాత సినిమా కు ప్లస్ అయ్యాడు అనిరుద్ సంగీతం. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. చిన్న చిన్న సన్నివేశాలను కూడా తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా ను కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది రెండు ఘంటల 45నిమిషాల నిడివి ఉండేటప్పటికీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. 

విశ్లేషణ:

మనిషి తన జీవితం లో ఎన్నో  కష్టాలు పడుతూ.. మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్‌ అవ్వడం.. ఈ కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమాలు  వెండితెరకు మామూలే. అయితే స్క్రీన్‌పై ఆ కథలనే ఏవిధంగా ఆవిష్కరించామన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. జెర్సీ లాంటి కథలు మనం ఈపాటికే ఎన్నింటినో చూసి ఉంటాము. కానీ ఈ కథకు క్రికెట్‌ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్‌ తిన్ననూరి తన టాలెంట్‌తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి. నాని పడ్డ  కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా నాని తనను తాను మలచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. గౌతమ్‌ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్‌ కాస్త లెంగ్తీ గానూ, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది. ఇక నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సెకండాఫ్‌లో వేగం పెంచినా..  నాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగగా.. చివర్లో వచ్చే ట్విస్ట్ షాకింగ్‌గా అనిపిస్తుంది.పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగింది. అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఒక మంచి సినిమా అన్నది మాత్రం ఘంటాపధంగా చెప్పొచ్చు. 

 


                    Advertise with us !!!