
తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 2/5
బ్యానర్ : ఆర్ పి ఏ క్రియేషన్స్,
నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని, ప్రభాస్ శ్రీను , విద్యుల్లేక రామన్, కృష్ణ తేజు, ఎన్ టి వి సాయి, తదితరులు.
ఎడిటర్: యస్ బి ఉద్ధవ్, సంగీతం : జేబీ
పాటలు : సిరివెన్నెల, కాసర్ల శ్యామ్, సమర్పణ : అమృతమ్మ
నిర్మాత : ఆర్.సుదర్శన్ రెడ్డి, దర్శకత్వం : హరికిషన్
విడుదల తేదీ : 06.04.2019
సుధీర్ బాబు, నందిత జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ కామెడీ ప్రేమ కథాచిత్రం. తాజాగా ఆ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించారు చిత్రయూనిట్. మొదటి చిత్ర నిర్మాతే ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాణంలో హరి కిషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని లు హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో కామెడీ హారర్ లు టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాగా పేరుతెచ్చుకున్న ఇటీవల కాలంలో ఈ జానర్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ప్రేమ కథా చిత్రమ్ 2 మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? ఈ సినిమా అయినా సుమంత్ అశ్విన్‌కు సక్సెస్ అందించిందా.?
కథ :
డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న సుధీర్ (సుమంత్ అశ్విన్)ను కాలేజ్‌లో పరిచయం అయిన బిందు (సిద్ధి ఇద్నాని) ఇష్టపడుతుంది. కానీ సుధీర్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయటంతో బిందు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెను కాపాడిన సుధీర్, తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాని నచ్చజెప్పి వెళ్లిపోతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సుధీర్ ఓ ఫాం హౌజ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఫాం హౌస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుధీర్‌కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓ అమ్మాయి(నందితా శ్వేత) రాత్రి మాత్రమే కనిపిస్తూ సుధీర్‌ని అతని ఫ్రెండ్ బబ్లూని బయపెడుతుంటుంది. ఇంతకీ సుధీర్ ఆ ఫాం హౌజ్‌కి ఎందుకు వెళ్లాడు? సుధీర్‌ను భయపెడుతున్న ఆ అమ్మాయి ఎవరు? బిందు ఏమైంది.? చివరకు సుధీర్ తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..? అన్నదే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
లవర్ బాయ్ ఇమేజ్‌తో మెప్పించిన సుమంత్ అశ్విన్ హారర్ కామెడీతో ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కాలేజ్ సీన్స్‌లో పరవాలేదనిపించినా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో సుమంత్ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. సిద్ధి ఇద్నాని తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పరవాలేనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందిత శ్వేత నిరాశపరిచింది. చాలా సన్నివేశాల్లో ఆమె నటన అతిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించిన కృష్ణతేజ(బబ్లూ), విధ్యుల్లేఖ రామన్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు హరికిషన్ ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. ద్వితీయార్థంలో కథనం రోలర్‌కోస్టర్‌లా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని మరింత పరీక్షిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నాలన్నీ నవ్వుతెప్పిస్తాయి. సంగీత దర్శకుడు జేబీ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది.
ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
విశ్లేషణ :
హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లుగా ‘ప్రేమకథాచిత్రమ్’ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ
దర్శకుడు రాసుకున్న కథా కథనాల్లో ప్లో లేకపోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా ఫ్రొం బిగినింగ్ స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది వేచి చూడాలి.