గొప్ప నిర్మాతగా ఎదగాలి: ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

Bekkam Venu Gopal Birthday Celebrations

ఘనంగా బెక్కెం వేణుగోపాల్‌ పుట్టిన రోజు వేడుకలు

సినిమారంగమన్నాక ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. అయితే విజయాలు వచ్చినపుడు పొంగిపోకుండా… అపజయాలు వచ్చినపుడు కుంగిపోకుండా ముందుకు సాగినపుడే చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం మనగడ వుండే అవకాశం ఉంటుందని దివంగత రామానాయుడు లాంటి అగ్ర నిర్మాత మొదలుకుని ఎందరో అనుభవజ్ఞులు అన్న మాటలు గుర్తుండే ఉంటాయి. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని…వారు చెప్పిన సినిమా సూత్రాలను ఆకళింపు చేసుకుని ముందుకు సాగుతున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌. 

చిత్ర పరిశ్రమలోనికి ఆయన అడుగుపెట్టి పదేళ్లకు పైగా పూర్తయింది. లక్కీ మీడియా అనే సంస్థను ప్రారంభించి 2006లో టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన ఆయన సత్యభామ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, సినిమాచూపిస్త మావ, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ వంటి పలు చిత్రాలను నిర్మించారు. దిల్‌రాజుతో కలిసి నేను లోకల్‌ చిత్రాన్ని అందించిన ఆయన తాజాగా రెండు చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. గురువారం ఆయన జన్మదినోత్సవం. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆయన కొద్దిసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. హీరో శివాజీ తనకు మంచి మిత్రుడని, ఆయన అందించిన సహకారం, తోడ్పాటుతోనే తాను నిర్మాతనయ్యానని అన్నారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరింపజేసే చిత్రాలను తమ సంస్థ నిర్మించిందని, వాటిలో వినోదానికి అత్యంత ప్రాధాన్య మిచ్చామని అన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో రెండు చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటి ద్వారా ఇద్దరు నూతన దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు, అందులో ఒక చిత్రానికి హర్ష, మరో చిత్రానికి నరేష్‌ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. లోగడ తమ సంస్థ నిర్మించిన సినిమాచూపిస్త మావ, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌ వంటి సినిమాలకు దర్శకత్వశాఖలో నరేష్‌ పనిచేశారని ఆయన చెప్పారు. ఈ రెండు చిత్రాలు కూడా తమ సంస్థ పేరును ఇనుమడింపజేసేవిధంగా ఉంటాయని అన్నారు.