రివ్యూ : రాజమౌళి ఇంటర్నేషనల్ విజువల్ వండర్ 'బాహుబలి 2'

Baahubali 2 Movie Review

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 4/5
బ్యానర్ : ఆర్కా మీడియా వర్క్స్,
నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్,నాస్సర్,సుబ్బరాజు తది తరులు...
సినిమాటోగ్రఫీ : కె కె సెంథిల్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్ రావు,
సంగీతం : యమ్ యమ్ కీరవాణి, కథ : కె . వి . విజయేంద్ర ప్రసాద్,
సమర్పణ : కె రాఘవేంద్ర రావు బి ఏ, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని,
స్క్రీన్ ప్లే, డైరేక్షన్ : యస్ యస్ రాజమౌళి
విడుదల తేదీ: 28.04.2017  

 

వందేళ్ల భారతీయ సినీ చరిత్రలో,  86 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో  బాహుబ‌లికి ముందు.. ఆ త‌ర‌వాత‌..  అని తెలుగు సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారంటే బాహుబ‌లి సినిమా  సృష్టించిన సంచలనం ఏ పాటిదిదో అర్థం చేసుకోవొచ్చు. పైరసీ ప్రింట్  లో వచ్చిన  సినిమాలు గాని   టీవీల‌కే అతుక్కుపోయిన ఓ వర్గం గాని, ఈ సినిమా చూడకపోతే జీవితం లో ఏదో మిస్ అవుతున్నామని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద వయోభేదం లేకుండా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగింది బాహుబ‌లి. ఓ సినిమా స్థాయి, సాంకేతిక‌త‌, బ‌డ్జెట్‌, మార్కెటింగ్ ఇలా ఏ రూపంలో చూసుకొన్నా.. మిగిలిన సినిమాల‌కంటే అంద‌నంత ఎత్తులో నిల‌బ‌డింది బాహుబ‌లి. అందుకే ఈ క‌థ‌కు ముగింపు కోసం రెండేళ్లుగా ఎదురుచూపుల్లో ప‌డిపోయారు సినీ అభిమానులు. రెండో భాగంలో రాజ‌మౌళి ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తాడా అంటూ గంపెడాశ‌ల‌తో ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ.. బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ విడుద‌లైంది. మ‌రి… జ‌క్క‌న్న చెక్కిన ఈ శిల్పం ఎలా వ‌చ్చింది? బాహుబ‌లి తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఎలా ఉంది?? ఈ క‌థ‌కు రాజ‌మౌళి స‌రైన ముగింపే ఇచ్చాడా, లేదా??  ప్రేక్షకుడు రెండేళ్లుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూదాం...

కథ:

బాహుబలి పార్ట్ 1 ఎక్కడ ఆపాడో అక్కడ నుండి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ ను గుర్తు చేస్తూ వచ్చే టైటిల్ బాగుంటాయి. రాజమాత శివగామిని కాపాడే క్రమంలో అమరేంద్ర బాహుబలి ఏనుగుతో ఫైట్ చేస్తాడు. మాహిష్మతి రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాబోయే తరుణం  లో అమరేంద్ర బాహుబలి (ప్ర‌భాస్)  కుంతల దేశ రాజకుమారి దేవసేన (అనుష్క)ను చూసి ఇష్టపడతాడు. ఈ విషయం వేగుల ద్వారా భళ్లాలదేవ (రానా) కు తెలుస్తుంది. కుటుంభ రాజకీయం నడుపుతాడు, దేవసేన ను ఇష్టపడ్డానని, ఎలాగైనా ఆమెను నీ  కోడలుగా చేసుకుకోవాలని తల్లి శివగామి(రమ్య కృష్ణ) వద్ద మాట తీసుకుంటాడు. దేవసేన ను అమరేంద్ర బాహుబలి ప్రేమిస్తున్నాడన్న విషయం తెలియక, కొడుకు భళ్లాలదేవ కు మాట ఇస్తుంది. చిన్న రాజ్యం అయినా  కుంతల దేశానికి భారీ ఎత్తున కానుకలు పంపుతుంది. దానికి దేవసేన యువరాణి తిరస్కరించి నీ కానుకలు నా కాలి గోటితో సమానం అంటూ  ఘాటుగా వర్తమానం పంపుతుంది. దానికి  ఆగ్రహించిన శివగామి కుంతల దేశ పరిసరాల్లో వున్నా అమరేంద్ర బాహుబలి కి  దేవసేనను బందించి తీసుకురమ్మని వర్తమానం పంపుతుంది.  ఎలాగైనా సరే దేవసేనను మాహిష్మతికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కుంతల రాజ్యంలోనే ఉండగా,  అమరేంద్ర బాహుబలి మీద ఉన్నవి లేనివి చెప్పిన  భళ్లాలదేవ ను రాజుగా ప్రకటిస్తుంది అమరేద్ర బాహుబలి ని సైన్యాధక్షుడిగా నియమిస్తుంది. శివగామి ఎందుకు అలా చేసింది..? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? శివుడు భళ్లాలదేవుడిని ఎలా ఎదుర్కున్నాడు..? అన్నది మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

ఒక నటుడికి అవకాశం రావాలె గానిపాత్ర‌లు గొప్ప‌గా ఉన్న‌ప్పుడు, పాత్ర‌ల‌కు సరిప‌డా న‌టీన‌టులు దొరికిన‌ప్పుడు ఇక చెప్ప‌డానికి ఏముంది?? జ‌క్క‌న్న చేతిలో శిల్పాల్లా మారిపోయారు న‌టీన‌టులు. ప్ర‌భాస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్ష‌త్రియ పుత్రుడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ప్ర‌భాస్ చూపించాడు. తాను ప‌డిన క‌ష్టం.. తెర‌పై క‌నిపిస్తూనే ఉంటుంది. అయితే ప్ర‌తీ డైలాగ్‌నీ ఒకే బేస్‌లో చెప్పాడు ప్ర‌భాస్. బ‌హుశా.. ఆ లెంగ్త్‌కి బాగా ట్యూన్ అయిపోయాడ‌నుకొంటా. పార్ట్ 1లో ప్ర‌భాస్, రానాల‌కు స‌మాన పాత్ర‌లు ప‌డ్డాయి. ఓ ద‌శ‌లో ప్ర‌భాస్‌ని కూడా రానా డామినేట్ చేశాడు. అయితే పార్ట్ 2లో మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. రానా పాత్ర బాగా త‌గ్గిపోయింది. అయితే రానా మాత్రం పాత్రలోని  క్రూర‌త్వాన్ని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించాడు. బిజ్జాల దేవుడిగా నాజ‌ర్ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది. శివ‌గామిగా రమ్య కృష్ణ  మ‌రోసారి విజృభించింది.  అనుష్క ప‌రిధి పార్ట్ 2లో సినిమా ఆద్యతం ఆకట్టుకుంది. త‌న స్థాయిలో ఆ పాత్ర‌కు వ‌న్నె తీసుకొచ్చింది. క‌ట్ట‌ప్ప‌.. మ‌రోసారి త‌న ట్రేడ్ మార్క్ విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కొత్త‌గా క‌నిపించే పాత్రల్లో సుబ్బ‌రాజు పాత్ర‌ పరవా లేదు అనిపిస్తుంది. త‌మ‌న్నాకు  పార్ట్ 1లో వున్నా ఇంపార్టెన్స్ పార్ట్ 2 లో ఏ మాత్రం లేదు నేనూ వున్నాను అన్నట్టు ఉంటుంది. పైగా ఆమెకు ఒక్క‌డైలాగ్ కూడా లేదు.

సాంకేతిక వర్గం:

రాజమౌళి ఐదేళ్ల కృషి బాహుబలి సినిమా.. ముఖ్యంగా బిగినింగ్ కన్నా సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ కష్టపడ్డాడని చెప్పొచ్చు. అయితే మొదటి భాగం మొత్తం తన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. తో నడిపిస్తే పార్ట్ 2 లో  రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాతో పాటుగా కుటుంబ రాజకీయాలతో నడిపించినట్టుగా ఉంటుంది. బాహుబలి 1 కన్నా ఇందులో విజువల్ పరంగా గ్రాండియర్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ సూపర్. కీరవాణి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. కెమెరా, సంగీతం, ఆర్ట్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌…దేనికవే హైలెట్స్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని పెంచ‌డానికి ప్ర‌తీ విభాగం బ‌లంగా ప‌నిచేసింది.. కష్ట‌ప‌డింది. అందుకే ప్ర‌తీ సీన్ విజువ‌ల్‌గా ఇంత గొప్ప‌గా వ‌చ్చింది. అందుకే అంద‌రికీ జ‌య‌హో అనాల్సిందే. రాజ‌మౌళి ఊహ‌కు సాంకేతిక నిపుణులు ప్రాణం పోశారు. రాజ‌మౌళి ఓ అంద‌మైన క‌ల కన్నాడు. ఆ క‌ల‌ని సాకారం చేసుకోవ‌డానికి ఐదేళ్లు శ్ర‌మించాడు. ముందు తరం వాళ్ళు ఈ సినిమా గురుంచి చెప్పుకునే విధంగా సినిమా ని రూపొందించాడు. రాజ‌మౌళికి ఏయే రంగాల్లో ప‌ట్టుందో.. అదంతా తెర‌పై క‌నిపిస్తూనే ఉంది. ఓ జాన‌ప‌ద క‌థని, చంద‌మామ పుస్త‌కంలో చ‌దువుకొన్న క‌థ‌ని, ఓ క‌ల‌లాంటి క‌థ‌ని అందంగా, అద్భుతంగా మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా తెర‌కెక్కించాడు. అందుకే ఆ క్రెడిట్ అంతా ఆయ‌న‌కే చెందాలి. సినిమా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తీశారని ఆ రిచ్ నెస్ ను చూస్తే అర్ధమవుతుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.

విశ్లేషణ:

బాహుబలి  పార్ట్ 2 ముగింపు లో కట్టప్ప  బాహుబ‌లిని ఎందుకు చంపాడు? ఈ ప్ర‌శ్న దేశం మొత్తం అల‌జ‌డి సృష్టించింది. దానికి రాజ‌మౌళి ఎలాంటి స‌మాధానం చెబుతాడా? అనే ఆస‌క్తిని రేకెత్తించింది. రాజ‌మౌళి కొత్త‌గా చూపించిందేం లేదు. జ‌నాలు అనుకొన్న‌దే తెర‌పై క‌నిపించింది. కానీ అక్క‌డా రాజ‌మౌళి మార్క్ తెలుస్తూనే ఉంది. క‌ట్ట‌ప్ప చంప‌డానికి కార‌ణం, చంపుతున్న‌ప్పుడు ప‌డుతున్న వేద‌న‌, చంపేశాక శివ‌గామితో చెప్పే మాట‌లు.. ఇవ‌న్నీ సినిమాని ఎమోష‌న్ ప‌రంగా నిల‌బెట్టాయి. ప్రీ క్లైమాక్స్‌లో క‌థ‌ని లేప‌డం రాజ‌మౌళికి బాగా తెలుసు. ఆ విద్య బాహుబ‌లి 2లోనూ క‌నిపించింది. ప‌తాక స‌న్నివేశాల‌న్నీ యుద్ద‌మ‌యం. బాహుబ‌లి యుద్దాలు ఏ స్థాయిలో ఉంటాయో పార్ట్ 1లో చూశాం. దాంతో పోలిస్తే.. క్లైమాక్స్ తేలిపోయిన‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా తాటి చెట్ల‌ను స్ప్రింగులుగా వాడుకొన్న విధానం లాజిక్‌కి అంద‌లేదు. ఓ చిన్న ఊరు.. ఓ రాజ్యంపై దండెత్తి రావ‌డం ఏమిటి? వంద‌డుగుల విగ్ర‌హం ఇద్ద‌రు కొట్టుకొంటే, ఆ ధాటికి నేల‌మ‌ట్టం అవ్వ‌డం ఏమిటి? రాజ‌మౌళి క‌ల‌లు ఊహ‌కు అంద‌నంత ఎత్తులో ఉంటాయి. మ‌నుషుల్ని మాన‌వాతీత శ‌క్తుల్లా చూపించ‌డం విడ్డూర‌మే. సుబ్బ‌రాజుతో చేయించిన కామెడీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. యుద్ద స‌న్నివేశాల్లో రక్త‌పాతం కూడా ఎక్కువ‌గా క‌నిపించింది.

క‌థ‌లో మలుపులు లేక‌పోవ‌డం, క‌ట్ట‌ప్ప ఎపిసోడ్‌లో ఆస‌క్తిర‌మైన అంశం క‌నిపించ‌క‌పోవ‌డం బాహుబ‌లి 2లో ప్ర‌ధాన‌మైన లోపాలు.క‌థ‌గా వింటే.. బాహుబ‌లి 2 కొత్త‌గా అనిపించ‌దు. మ‌న అంచ‌నాల‌కు భిన్నంగా ఏమీ ఉండ‌దు. కానీ… `చూస్తే` మాత్రం ఓ అంత‌ర్జాతీయ స్థాయిలో క‌నిపిస్తుంది. అదంతా రాజ‌మౌళి మాయ‌. ప్ర‌భాస్‌ని తెర‌పైకి ప‌రిచ‌యం చేసిన ఒక్క సీన్ చూస్తే చాలు. బాహుబ‌లి 2ని రాజ‌మౌళి ఇంకెంత కొత్త‌గా ఆవిష్క‌రించ‌బోతున్నాడో చెప్ప‌డానికి. విజువ‌ల్‌గా రాజ‌మౌళి ఎక్క‌డా త‌గ్గ‌లేదు. సీన్ సీన్‌కి డోస్ పెంచుకొంటూ పోయాడు. చాలా చిన్న సీనే అయినా.. భారీగా త‌న ఊహ‌ల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాడు. రాజ ద‌ర్బార్‌, ఏనుగుని క‌ట్ట‌డి చేయ‌డం, కుంత‌ల దేశాన్ని కాపాడే యుద్దం, అనుష్క‌తో క‌ల‌సి వేసిన బాణాలు.. ఇవ‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి ఉండి ఔరా అనిపిస్తాయి. రాజ‌మౌళి బ‌లం ఎమోష‌న‌ల్ సీన్స్‌. అవి బాహుబ‌లి 1లో మిస్స‌య్యాయి. కానీ పార్ట్ 2లో మాత్రం పుష్క‌లంగా క‌నిపించాయి. క‌ట్ట‌ప్ప బిజ్జాల దేవ భ‌ళ్లాల దేవ మ‌ధ్య తెర‌కెక్కించిన ఓ స‌న్నివేశంలో ఈ మూడు పాత్ర‌ల్నీ ఓ స్థాయిలో తీసుకెళ్లి ఎలివేట్ చేశాడు రాజ‌మౌళి. అక్క‌డే ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి పూర్తి స్థాయిలో మార్కులు ప‌డిపోతాయి.

సింహాస‌నం మీద కూర్చున్నాన‌న్న ఆనందం భ‌ళ్లాల‌దేవుడిలో అణువంత కూడా లేకుండా ఆవిరైపోయేలా ఇంట్ర‌వెల్ బ్యాంగ్ సీన్ డిజైన్ చేశాడు. అక్క‌డ భ‌ళ్లాల‌దేవుడి పాత్ర తాలుకూ స్వ‌భావాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్క‌రించాడు. ఇవే కాదు. దాదాపు ప్ర‌తీ పాత్ర‌నీ ఎమోష‌న్ ప‌రంగా పీక్స్‌కి తీసుకెళ్లాడు. మొత్తం మీద చెప్పాలంటే రాజమౌళి సృష్టించిన ఈ అద్భుత విజువల్ వండర్  అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడమేగాక ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి, తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.