25th May 2026

____________

- Saidulu

మొటిమలు, ఆయిలీ స్కిన్‌కు చెక్.. పటికతో సహజ స్కిన్ కేర్..

ఇటీవల కాలంలో కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ కంటే కూడా సహజసిద్ధమైన చర్మ సంరక్షణ పద్ధతులపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఇంటి చిట్కాల్లో పటిక కూడా ఒకటి.

చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో, కొన్ని సాధారణ సమస్యలను తగ్గించడంలో పటిక ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా పటికను ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు.

పటికలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో చర్మంపై ఉండే మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంతోపాటు మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది.

ముఖంపై అధిక ఆయిల్ ఉండే వారికి పటిక కొంత ఉపశమనం ఇవ్వవచ్చు. చర్మంపై ఉండే అదనపు తైలాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.

కొంతమంది షేవింగ్ చేసిన తర్వాత పటికను ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న యాంటిబ్యాక్టీరియల్ తత్వం చిన్న గాయాలు, చర్మ మంట తగ్గించడంలో ఉపయోగపడుతుందని భావిస్తారు.

మొటిమల సమస్య ఉన్నవారు కూడా పటిక నీటిని పరిమితంగా ఉపయోగిస్తుంటారు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించుకోవడం మంచిది.

పటికను నీటిలో కలిపి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. ఎక్కువసేపు ఉంచితే చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది.

చర్మంపై దుర్వాసన తగ్గించడంలో కూడా పటిక ఉపయోగపడుతుంది. అందుకే కొన్ని సహజ డియోడరెంట్ల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు.

అయితే పటికను ప్రతిరోజూ అధికంగా వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మం పొడిగా మారే ప్రమాదం ఉంటుంది.

ఏదైనా అలర్జీ లేదా చర్మ సమస్యలు ఉన్నవారు పటికను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సరైన విధంగా వాడితే చర్మ సంరక్షణలో పటిక మంచి సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది.