ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్‌ను (Gardening) హాబీగా మార్చుకున్నారు. కానీ శీతాకాలం (Winter) వచ్చిందంటే మొక్కలు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటాయి. చల్లని గాలి, తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు కారణంగా ఆకులు ఎండిపోవడం, మొక్క పెరుగుదల మందగించడం జరుగుతుంది.

నీటి అవసరం: ఈ సీజన్‌లో నేల తేమ ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల మొక్కలకు నీటి అవసరం తక్కువ అవుతుంది. అందుకే ప్రతిరోజూ నీరు పోయడం తప్పు. సాధారణంగా వారానికి ఒకసారి నీరు పెట్టడం చాలుతుంది. చాలా చల్లగా ఉన్న రోజుల్లో 10–12 రోజులకోసారి నీరు పెట్టినా సరిపోతుంది.

నీరు ఎప్పుడు పెట్టాలి? ఉదయం నేల చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు నీరు పెడితే వేర్లు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం (Afternoon) లేదా సాయంత్రం వేళ నీరు పెట్టడం ఉత్తమం. ఆ సమయానికి ఉష్ణోగ్రత కొంచెం పెరుగుతుంది కాబట్టి నీరు నేలలో బాగా కలిసిపోతుంది.

కుండీ ఎంపిక: కుండి దిగువన రంధ్రాలు లేకపోతే అదనపు నీరు నిల్వై వేరు కుళ్లిపోతుంది. అందుకే డ్రైనేజ్ హోల్స్ (drainage holes) ఉన్న కుండీలు మాత్రమే వాడాలి. ఇవి వేసిన నీరు బయటికి పోయేలా చేసి, నేలలో సరైన తేమను ఉంచుతాయి.

ఇండోర్ మొక్కలు: ఇంట్లో ఉంచిన మొక్కలకు బయట ఆరుబయట మొక్కల కంటే తక్కువ నీరు అవసరం. ప్రతి 3–4 రోజులకు కుండీలో తేమను తనిఖీ చేసి పొడిగా ఉంటేనే నీరు పెట్టాలి. కిటికీ దగ్గర ఉంచి సూర్యరశ్మి (Sunlight) అందేలా చూడాలి.

నీటి పరిమాణం: చాలా చల్లగా ఉన్న రోజుల్లో నీరు పెట్టకపోవడం మంచిది. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు మాత్రమే నీటి పరిమాణాన్ని పెంచాలి. మొక్క ఆరోగ్యం సీజన్‌ప్రకారం మారుతుంది కాబట్టి నీటిని కూడా పరిస్థితిని బట్టి వేయాలి.అలాగే అన్ని మొక్కలకి ఒకే మోతాదులో నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు .మొక్క వెరైటీని పట్టి జాగ్రత్తగా అవసరమైనంత నీరుని మాత్రమే అందించాలి.