చలికాలం (Winter) వచ్చాక చాలా మంది రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జనకు (Urination) వెళ్లాల్సి వస్తుంది. తక్కువ నీరు తాగినా కూడా ఈ సమస్య కనిపించడం వల్ల చాలామంది ఆందోళన చెందుతారు. అయితే ఇది పెద్ద ఆరోగ్య సమస్య కాదు. శరీరం చలికి ఎలా స్పందిస్తుందో దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది అని వైద్యులు అంటున్నారు.

తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో శరీరం వేడిని నిల్వచేసుకోవడానికి చర్మానికి రక్తప్రసరణ (Blood Circulation) తగ్గిస్తుంది. దీంతో మూత్రపిండాలకు రక్త ప్రవాహం పెరిగి మూత్రం ఎక్కువగా తయారవుతుంది. వేసవిలా చెమట రాకపోవడం కూడా దీనికి ఒక కారణం.

నిద్రాభంగం: రాత్రి సమయంలో మూడు–నాలుగు సార్లు మేల్కోవడం వల్ల అలసట, చిరాకు, మరుసటి రోజు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. చిన్న చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

గోరువెచ్చని నీరు: చలికాలంలో చల్లని నీరు తాగటం శరీర ఉష్ణోగ్రతను ఇంకా తగ్గిస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీరు (Lukewarm water) తాగాలి. పడుకునే రెండు గంటల ముందు నీరు అధిక మోతాదులో తీసుకోకూడదు.

టీ–కాఫీ పరిమితం: చాలామంది వేడి కోసం టీ, కాఫీ ఎక్కువగా తాగుతారు. కానీ ఇవి డీహైడ్రేషన్‌కు (Dehydration ) దారి తీస్తాయి. వాటి బదులు అల్లం హెర్బల్ టీ (Herbal tea) లేదా సూప్ తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.

పాదాల మసాజ్: సున్నితంగా పాదాలను మసాజ్ చేయడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల శరీరం వేడిగా ఉండి రాత్రిపూట మూత్ర విసర్జన తక్కువగా ఉంటుంది.

డైలీ రొటీన్ : చెవులు, చేతులు, కాళ్లు కప్పి ఉంచడం, పగలు కాసేపైనా ఎండలో ఉండడం, స్ట్రెస్ (Stress) తగ్గించేందుకు ధ్యానం (Meditation) చేయడం చాలా ఉపయోగకరం. ఇవన్నీ పాటిస్తే శీతాకాలంలో వచ్చే తరచు మూత్ర సమస్యకు మంచి ఉపశమనం కలుగుతుంది.