చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ఆహారాల్లో రాగి సూప్ (Ragi Soup) మొదటి స్థానంలో నిలుస్తుంది. శరీరాన్ని వేడిగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని (Immunity) పెంచే సహజ గుణాలు ఇందులో ఉన్నాయి.పిల్లల నుండి పెద్దల దాకా అందరికీ అనుకూలంగా ఉండే ఈ సూప్, చలి సమయంలో ఎదురయ్యే సాధారణ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
పోషకాలు: రాగి (Finger Millet) సూప్ లో ఉండే ఐరన్ (Iron) , కాల్షియం (Calcium) , ఫైబర్ (Fiber) వంటి పోషకాలు శరీరానికి సహజ రక్షణను అందిస్తాయి. ఇది జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎప్పుడు తీసుకోవాలి: చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గే సమస్య ఉంటుంది. రాగి సూప్ లో ఉండే సహజ వేడి గుణాలు శరీరాన్ని ఉష్ణంగా ఉంచి చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే ఇది రాత్రి భోజనంలో తీసుకుంటే మరింత మంచిది.
మెరుగైన జీర్ణక్రియ: రాగిలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చలికాలంలో సాధారణంగా జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. రాగి సూప్ ఈ సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు నియంత్రణ: రాగి సూప్ తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. చలికాలంలో జంక్ ఫుడ్ తినే అలవాటు పెరిగే సమయంలో ఇది బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.
బలమైన ఎముకలు: రాగి కాల్షియం తో సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకలు, కీళ్లకు బలం ఇస్తుంది. ఈ సీజన్లో పెద్దలకు,పిల్లలు, గర్భిణీలకు ఇది ప్రత్యేకంగా చాలా మంచిది.
డయాబెటిస్: రాగి లో గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic) తక్కువగా ఉంటుంది. చలికాలంలో షుగర్ స్థాయిలు మారే పరిస్థితుల్లో రాగి సూప్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మొత్తం మీద, రాగి సూప్ చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సంపూర్ణ పౌష్టికాహారం. రోజుకు ఒక్క గిన్నె రాగి సూప్ తీసుకోవడం చలి ప్రభావాన్ని తగ్గించి శరీరానికి సంపూర్ణ శక్తినిస్తుంది.