చలికాలం వస్తూనే జలుబు (Cold) , దగ్గు (Cough), కఫం (Phelum ) వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గొంతు, ఛాతీలో శ్లేష్మం పేరుకుపోవడం వల్ల శ్వాసలో ఇబ్బంది, నిరంతర దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో శరీరానికి సరైన ఉష్ణం అందే ఇంటి చిట్కాలు చాలా సహాయపడతాయి.
కఫం అంటే ఏమిటి? కఫం శరీరంలో దుమ్ము, బ్యాక్టీరియా (Bacteria) వంటి హానికరమైన పదార్థాలను ఆపేందుకు రక్షణగా పని చేస్తుంది. కానీ ఇది అధికంగా పేరుకుపోతే గాలి మార్గాలను అడ్డుకుని శ్వాస సమస్యలను పెంచుతుంది. అందుకే దాన్ని సమయానికి తగ్గించుకోవడం ముఖ్యం.
ఆయుర్వేద చిట్కా: ఆయుర్వేద నిపుణులు (Ayurvedic Experts) ఎప్పటినుంచో కఫం తగ్గించడానికి ఒక సులభమైన బెల్లం కషాయాన్ని (Jaggery Kashayam) సిఫారసు చేశారు. ఇది గొంతు, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని క్రమంగా తగ్గించే సహజ పరిష్కారం.
కావలసిన పదార్థాలు: చిన్న ముక్క బెల్లం (Jaggery), 1/4 అంగుళాల అల్లం (Ginger), 4–5 నల్ల మిరియాలు (Black Pepper), 5–7 తులసి ఆకులు (Holy Basil). ఇవన్నీ శరీర వేడి పెంచే, శ్లేష్మాన్ని కరిగించే లక్షణాలు కలిగినవి.
తయారీ విధానం: ముందుగా అల్లం, నల్ల మిరియాలు, తులసి ఆకులను రోకలితో దంచాలి. బెల్లాన్ని కూడా విడివిడిగా పొడిలా చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి మరిగించి సగానికి తగ్గిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి.
ఆరోగ్య ప్రయోజనాలు: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ కషాయం తాగితే గొంతు, ఛాతీ కఫం నెమ్మదిగా తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం, బెల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగివుండగా తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శీతాకాలంలో ఇది అత్యంత ప్రభావవంతమైన ఇంటి చిట్కాగా పనిచేస్తుంది.