పటిక (Alum) చర్మ సంరక్షణలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. మొటిమలు నుండి నోటి దుర్వాసన వరకు అనేక సమస్యలకు ఇది సులభమైన పరిష్కారం అందిస్తుంది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకునే వారికి పటిక ఒక బెస్ట్ నేచురల్ రిమెడీగా నిలుస్తుంది.
పటికలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజువారీ జీవితంలో మొటిమలు, నల్లమచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలతో ఇబ్బందిపడే వారికి పటిక ఒక సహజ పరిష్కారం.
మొటిమల నివారణ: పటికకు ఉన్న ఆస్ట్రింజెంట్ (Astringent) లక్షణాలు చర్మ రంధ్రాలను తొలగిస్తాయి. రంధ్రాలు విస్తరించినప్పుడు మొటిమలు ఎక్కువగా వచ్చేస్తాయి. పటికను కొద్దిగా నీటితో నూరి పేస్ట్ చేసి ముఖంపై పూయడం ద్వారా మొటిమలు తగ్గడమే కాకుండా చర్మపు రంగు కూడా మెరుగుపడుతుంది.
నోటి దుర్వాసన: మార్కెట్‌లో లభించే మౌత్ వాష్ (mouthwash) కంటే పటిక నీరు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. లూక్వార్మ్ వాటర్‌లో చిన్న పటిక ముక్కను నానబెట్టి..ఆ నీటితో పుక్కిలిస్తే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి దుర్వాసన నియంత్రణలోకి వస్తుంది. రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
స్కిన్ కేర్: పటికను పూర్తిగా కరిగించి.. ఆ నీటితో ముఖం కడుక్కుంటే మచ్చలు తగ్గి, చర్మం టోన్ మెరుగవుతుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా పటిక వేసి వాడితే చర్మం బిగుతుగా మారి తాజాగా కనిపిస్తుంది.
రోజ్‌వాటర్ ..పటిక మిశ్రమం: ఒక టీ స్పూన్ పటిక పొడిని రోజ్‌వాటర్‌తో (Rose Water) కలిపి పేస్ట్ చేసి వారానికి రెండు సార్లు వాడితే అవాంఛిత రోమాలు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ముఖం మీద నిగారింపు పెరుగుతుంది.
గాయాల నివారణ: చిన్న కోతలు, గాయాలు కలిగినప్పుడు పటిక నీరు మంచి చికిత్సలా పనిచేస్తుంది. ఇది రక్తస్రావాన్ని ఆపి గాయం త్వరగా నయమవ్వడానికి సహాయపడుతుంది. పటిక నీటిని దూదితో ప్రభావిత ప్రాంతంపై రాస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.