ఆయుర్వేదంలో మెంతులు (Fenugreek Seeds) ప్రత్యేక స్థానం పొందాయి. వంటల్లో రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఫైబర్ (Fiber) , ఐరన్ (Iron) , ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. న్యూట్రిషనిస్ట్లు సూచించినట్లుగా, మెంతుల నీరు లేదా టీ రూపంలో తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ: రోజువారీ జీవితంలో మధుమేహం (Diabetes) వేగంగా పెరుగుతోంది. మెంతుల్లో ఉన్న అమైనో ఆమ్లాలు (Amino acids) క్లోమ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా శరీరంలో కలుస్తాయి.
కొలెస్ట్రాల్ కంట్రోల్: చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) పెరుగుదల గుండె జబ్బులకు దారితీస్తుంది. మెంతుల్లోని సాపోనిన్లు, కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా మెంతుల నీరు తాగడం ఆర్టరీల్లో ఫలకం చేరకుండా నిరోధిస్తుంది.
వెయిట్ లాస్: మెంతుల్లో ఉండే గెలాక్టోమన్నన్ (Galactomannan ) మీకు ఎక్కువ సేపు కడుపు నిండిన భావాన్ని ఇస్తుంది. అదనపు తినుబండారాలు తగ్గిపోవడం వల్ల బరువు తగ్గడం సులభమవుతుంది. జీవక్రియను (Metabolism) పెంచి కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
జీర్ణ సమస్యలు: ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగడం జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పేగు మంటకూ ఇది మంచి ఉపశమనం.
హెయిర్,స్కిన్ కేర్: మెంతి టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో చర్మం మీద ఉండే మంట, మొటిమలు తగ్గిస్తుంది. నికోటినిక్ ఆమ్లం, సహజ ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి.