ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ సమస్య పెద్దలతో పాటు యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. శీతాకాలంలో చెమట తగ్గడం, దాహం తగ్గిపోవడం వల్ల చాలామంది నీరు తాగటాన్ని తగ్గిస్తారు. ఈ పరిస్థితి మూత్రపిండాల్లో ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

డీహైడ్రేషన్: నీరు తక్కువగా తాగితే మూత్రపిండాలు వ్యర్థాలను పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. దీంతో కాల్షియం (Calcium) , యూరిక్ యాసిడ్ (Uric Acid) వంటి పదార్థాలు స్ఫటికాల రూపంలో చేరి తర్వాత రాళ్లుగా మారుతాయి. ఇవే కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణం.

ప్రారంభ లక్షణాలు: రాళ్లు ఉన్నప్పుడు మూత్రం తరచూ రావాలనిపించడం కానీ పరిమాణం తక్కువగా ఉండడం జరుగుతుంది. యూరిన్ ముదురు రంగులో ఉండటం, బలమైన వాసన రావడం, లేదా యూరిన్ వెళ్లే సమయంలో మంట అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

తీవ్రమైన సూచనలు: అకస్మాత్తుగా నడుము, పక్క భాగంలో తీవ్రమైన నొప్పి రావడం కిడ్నీలో రాళ్లకు ముఖ్యమైన సంకేతం. రక్తపు మరకలు ఉన్న మూత్రం, వికారం, వాంతులు, అలాగే ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం, వణుకు కూడా రావచ్చు.

రోజువారీ జాగ్రత్తలు: రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ప్రాసెస్ చేసిన పదార్థాలు కాకుండా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. నింబకాయ, మోసంబి వంటి సిట్రస్ పండ్లు రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చల్లని పానీయాలు, అధిక చక్కెరపదార్థాలను తగ్గించడం మంచిది.

సర్జరీ అవసరమా? సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ మనం తీసుకునే జాగ్రత్తలు తోటే తగ్గిపోతాయి కానీ రాయి పరిమాణం 10 mm దాటితే చికిత్స అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన నొప్పి, జ్వరం, వాంతులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పనితీరుకు నష్టం కలగవచ్చు.