మహిళల దుస్తులలో పట్టు చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాల్లో పట్టు చీర ధరించడం రాయల్ లుక్‌ను ఇస్తుంది. కానీ, ఈ రోజుల్లో మార్కెట్లో నకిలీ పట్టు వస్త్రాలు కూడా ఎక్కువగా రావడంతో నిజమైన పట్టు గుర్తించడం చాలా ముఖ్యం.

Cream Section Separator

నకిలీ పట్టు ఎందుకు పెరిగింది: పట్టు తయారీకి ఎక్కువ ఖర్చు కావడం, డిమాండ్ అధికంగా ఉండటం వల్ల రేయాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ ఫైబర్లతో నకిలీ పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. వీటిని చూసిన వెంటనే అసలైనవిగా అనిపించినా, కొన్ని తేలికైన పద్ధతులతో తేడా తెలుసుకోవచ్చు.

కాల్చి పరీక్షించే పద్ధతి: ఫ్యాబ్రిక్ నుంచి చిన్న దారాన్ని తీసి కాల్చితే స్పష్టమైన తేడా తెలుస్తుంది. నిజమైన పట్టు కాలినప్పుడు జుట్టు లేదా ఉన్ని వాసన రావడంతో పాటు నెమ్మదిగా బూడిదగా మారుతుంది. నకిలీ పట్టు మాత్రం ప్లాస్టిక్ వాసన వస్తూ గట్టిగా మారుతుంది.

షైన్: అసలైన పట్టు చీరకు సహజమైన మెరుపు ఉంటుంది. ఇది మితమైనదిగా, మృదువుగా కనిపిస్తుంది. నకిలీ పట్టు మాత్రం ఒకే రకమైన కాంతితో జిగేల్‌మనేలా ఉంటుంది. వివిధ కోణాల్లో తేడా కనిపించదు.

స్పర్శతో తేడా తెలుసుకోవడం: నిజమైన పట్టు నునుపుగా, మృదువుగా ఉంటుంది. చేతికి చల్లగా అనిపిస్తుంది. కృత్రిమ పట్టు గట్టిగా, గరుకుగా ఉండి శరీరానికి అతుక్కుంటుంది.

ధర: పట్టు అనేది సహజంగా విలువైన ఫైబర్. కాబట్టి ఇది తక్కువ ధరకు దొరకడం కష్టమే. మార్కెట్లో చాలా తక్కువ ధరకు “పట్టు” పేరుతో అమ్మితే అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. పట్టు చీర కొనేటప్పుడు ఈ చిట్కాలు గుర్తుపెట్టుకుంటే మోసపోవాల్సిన అవసరం ఉండదు.