ఇంట్లో పండుగలు, శుభకార్యాలు జరిగేటప్పుడు బంతిపూల (Marigold Flowers) మాలలతో అలంకరించడం ఆనవాయితీ. వీటిని కడితే ఇంటికి ప్రత్యేక అందం వస్తుంది. అయితే పండుగల సమయంలో మార్కెట్లో వీటి ధరలు పెరుగుతాయి. పైగా మార్కెట్లో కొన్న పూల కంటే కూడా ఇంట్లో మన చేతులతో పెంచిన పువ్వులను అలంకరిస్తే ఆ అందం వేరుగా ఉంటుంది.
కుండీలో పెంచే విధానం: మొదట పెద్ద కుండీని (Pot) ఎంచుకుని దిగువ భాగంలో నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు చేయాలి. మట్టిలో ఆవు పేడ (Cowdung) లేదా కంపోస్ట్ (Compost) కలపండి. ఇది మొక్కలకు పోషకాలు అందిస్తుంది. మార్కెట్లో దొరికే విత్తనాలు లేదా ముందుగా సేకరించి పెట్టుకున్న విత్తనాలను నాటాలి. విత్తిన తర్వాత నీరు తగినంతగా పోయాలి.
నేలలో పెంచాలనుకునే వారికి ఇంట్లో స్థలం ఉంటే నేలలోనే బంతి చెట్లు పెంచుకోవచ్చు. ముందుగా నేలని శుభ్రం చేసి, కొద్దిగా ఇసుక , ఎరువుతో కలపాలి. విత్తనాలు వేస్తున్నప్పుడు చెట్ల మధ్య తగినంత దూరం ఉంచడం ముఖ్యం.
ఎండ, నీరు సమతుల్యత బంతిపూల మొక్కలకు ఎండ (Sunlight) చాలా అవసరం. రోజూ తగినంత నీరు పోయాలి కానీ అతిగా కాదు. ఎండ తగిలే ప్రదేశంలో పెంచితే మొక్కలు బాగా పెరుగుతాయి.
నారు ద్వారా పెంపకం: మార్కెట్లో లభించే బంతి నారును (Saplings) కూడా నాటవచ్చు. మొక్కలు పెరుగుతున్నప్పుడు వాటిని గమనిస్తూ ఉండాలి. వాడిపోయిన పూలు, ఆకులను తరచుగా తీసేస్తే చెట్టు పచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది.
సహజ ఎరువులు: ఇంట్లో మిగిలిన ఆహార వ్యర్థాలను చెట్ల వద్ద వేయండి. ఇవి సహజ ఎరువుల్లా పనిచేస్తాయి. ఇలా సులభంగా ఇంట్లోనే బంతిపూల చెట్లు పెంచి, పండుగల సమయంలో స్వయంగా పూలు కోసి అలంకరించుకోవచ్చు.