తల్లిదండ్రుల ప్రవర్తన: పిల్లలు రోజంతా చదువు ఆటలతో బిజీగా ఉండి, నిద్రపోయే సమయానికి చాలా అలసిపోతారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అన్నది పిల్లల మానసిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. పాజిటివ్ టోన్‌లో మాట్లాడడం, ప్రేమతో నిద్రపోమని చెప్పడం పిల్లల మనసుకు శాంతినిస్తుంది.
స్క్రీన్ టైమ్‌ని పూర్తిగా ఆపాలి: నిద్రకు ముందు ఫోన్ లేదా టీవీ చూడడం వల్ల పిల్లల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. స్క్రీన్ బ్లూ లైట్ (Blue Light) వల్ల మెలటానిన్ (Melatonin) హార్మోన్ విడుదల ఆగిపోతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుంది.
నిద్ర సమయం: పిల్లలకి ఒక నిర్దిష్ట నిద్రపోయే సమయం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోబెట్టడం, రాత్రి ఆలస్యంగా మెలకువతో ఉంచడం వంటివి స్లీప్ సైకిల్ని (Sleep Cycle) దెబ్బతీస్తాయి.
అతి డిసిప్లిన్ వద్దు: కొంతమంది తల్లిదండ్రులు బలవంతంగా పిల్లలను పడుకోబెడతారు. అలా చేయడం వల్ల వాళ్లలో నిద్రపై భయం లేదా చిరాకు పెరుగుతుంది. నిద్రను శిక్షలా భావించే పరిస్థితి వస్తుంది. ఇది ఆందోళన పెంచుతుంది.
ఒత్తిడి: పిల్లల రోజంతా షెడ్యూల్ బిజీగా ఉంటే, రాత్రికి మైండ్ రిలాక్స్ కావడం కష్టం అవుతుంది. అందుకే నిద్రకు ముందు కనీసం గంట సమయం విశ్రాంతిగా గడపే అవకాశం ఇవ్వాలి. పుస్తకం చదవడం లేదా కథ వినడం వంటివి సహాయపడతాయి.
సరైన నిద్ర – మంచి ఫలితాలు: పిల్లలు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి , సరైన నిద్రతో మెదడు పని తీరు మెరుగుపడుతుంది, ఫోకస్ పెరుగుతుంది, మూడ్ స్థిరంగా ఉంటుంది. నిద్రపోయే ముందు ప్రశాంత వాతావరణం సృష్టించడం పిల్లల ఎదుగుదలకి ఎంతో ఉపయోగకరం.