పాలనపై కేసీఆర్ ముద్ర

పాలనపై కేసీఆర్ ముద్ర

09-01-2019

పాలనపై కేసీఆర్ ముద్ర

సమీక్షలు...ఆదేశాలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత రెండో దఫా ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన కల్లకుంట్ల చంద్రశేఖర రావు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కెసిఆర్‌ వైఖరికి ఈ దఫా ఎన్నికల తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రత్యేక చర్చ జరుగుతున్నది. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, ఎన్నికల సంఘం ఏవైనా షరతులు విధిస్తే ఈ నెలాఖరు వరకు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండకపోవచ్చు, లేదా ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో అందరూ శాసనసభ్యులు పాలుపంచుకునేలా విస్తరణను వాయిదా వేస్తే కెసిఆర్‌ అంతా తానే నిర్ణయాలు తీసుకొని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విషయాలను ఆయనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని శాఖల వారీగా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగాన్ని పురమాయించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ముందస్తు ఎన్నికల తర్వాత కెసిఆర్‌ రాజకీయంగా, ప్రభుత్వపరంగా కూడా పంథాను మార్చుకున్నట్లుగా ఉంది.

ప్రభుత్వపరంగా మరింత స్పీడ్‌గా కార్యక్రమాల అమలుకు తీసుకోవాల్సిన చర్చలపై లోతైన కసరత్తచేస్తున్నారు. అందుకే ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను కూడా సరిదిద్దేలా వాటిని సమన్వయం చేసేలా కుదించాలనే నిర్ణయంతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసినట్లు స్వయంగా కెసిఆర్‌ ప్రకటించారు. క్యాబినెట్‌ కూర్పు మరింత ఆలస్యం అయితే అధికారులపై అధిక బాధ్యత ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల పర్యవేక్షణ కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కూడా అన్ని శాఖల ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ పాలనా వ్యవహారాల్లో ఎప్పటికప్పడు ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సలహాలు తీసుకోవాల్సి ఉంది. అయితే కెసిఆర్‌ ఇతర అన్ని శాఖల కంటే నీటిపారుదల రంగం పట్ల అధిక శ్రద్ధ తీసుకుంటూ, లక్ష్యం మేరకు ఆయా ప్రాజెక్టుల నుంచి సాగు నీరు విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలకాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన సిఎం రెండు రోజులుగా పర్యటిస్తూ, ఎక్కడికక్కడ నత్తనడకన సాగుతున్న పనుల పట్ల అసంత ప్తి వ్యక్తం చేస్తూ లక్ష్యాలను నిర్ధేశించారు.

శాఖల వారీగా మంత్రులు లేకపోవడంతో పూర్తి పర్యవేక్షణ బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉండటంతో ఆయా శాఖల వారీగా ఏ పథకం,కార్యక్రమం అమలులో ఇబ్బందులు కాకుండా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, వాటి సత్వర అమలుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా తెలంగాణలో కెసిఆర్‌ తన మంత్రివర్గ విస్తరణకు కొంత అధిక సమయమే తీసుకుంటున్నారు. దీనికి కెసిఆర్‌ ప్రత్యేక కారణాలను ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతున్నది. గత మంత్రివర్గంలో కొనసాగిన వారందరికీ తిరిగి క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తే కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలలో సీనియర్లు, సమర్థులకు బెర్తులు ఎలా ఉంటాయని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నందున మాజీ మంత్రుల్లో ఎవరెవరికి తిరిగి అవకాశం రాదో ఎవరిని కొత్తగా తీసుకుంటారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు లేకపోయినప్పటికీ కార్యక్రమాల అమలులో ఎలాంటి లోటుపాట్లు లేవనే ప్రచారం సాగుతున్నది. ముఖ్యమంత్రి,హోం మంత్రి తప్ప ఇతర శాఖలకు మంత్రులు లేని ప్రస్తుత పరిస్థితుల్లోకూడా ప్రభుత్వ కార్యక్రమాల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖా పరంగా మంత్రులు లేని లోటును అధికారుల ద్వారా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సలహాదారులు,ఉన్నతాధికారులే కీలకంగా మారుతున్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కెసిఆర్‌ మినహా ఇతరులెవరూ మాట్లాడే అవకాశం లేనందున ఎవరికి వారు గుసగుసలతోనే కాలం గడుపుతున్నారు. మంచి రోజులు లేవని సంక్రాతి తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఆశాభావంతో కొందరున్నారు.

కానీ పంచాయితీ ఎన్నికల్లో అన్ని గ్రామాలను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలని, ప్రత్యర్థిపార్టీ కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో మట్టిగరిపించినందున తిరిగి క్షేత్ర స్థాయి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యూహ రచన చేస్తున్నది. అందుకే శాసనసభ్యులందరికీ ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. జనవరి 30 తేదీతో గ్రామ పంచాయతి ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ తర్వాత మూడు నెలల్లోగానే సహకార ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ శాసనసభ్యుల్లో ఎలాంటి అసంతప్తి పెరగకుండా మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే పంచాయతి ఎన్నికల విషయం ఎలా ఉన్నప్పటికీ ముందుగా పరిమితంగానే మంత్రివర్గ విస్తరణ చేసి మిగిలిన వారిని లోక్‌సభ ఎన్నికల తర్వాతనే తీసుకుంటారని భావిస్తున్నారు. ఇదే విషయం సిఎం తనంతతానుగానే ప్రకటించారు.

సీనియర్లను లోక్‌సభకు..

మంత్రివర్గ విస్తరణ విషయంలో కెసిఆర్‌ వ్యవహరిస్తున్న తీరు ప్రత్యేక చర్చకు తావిస్తున్నది. ఈ మేరకు మంత్రివర్గంలో కొందరు సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా లోక్‌సభకు పోటీ చేయించేలా ఒప్పించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయనే విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నది. తిరిగి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ కేంద్రంలో అధికారంలోకి వస్తే టిఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యవహరించే తీరు ఒక విధంగా ఉంటుందని, లేదూ.. కాంగ్రెస్‌ నేతత్వంలోని మహాఘట్‌బంధన్‌ అధికారంలోకి వస్తే మరో విధంగా టిఆర్‌ఎస్‌ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ను జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు కెసిఆర్‌ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలలోనే కొన్ని మాత్రమే ఈ ఫ్రంట్‌ వైపు మొగ్గు చూపుతున్నందున కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానిక ఈ ఫ్రంట్‌ బలం సరిపోదు. ఎన్నికల తర్వాత అయినా..ఫెడరల్‌ ఫ్రంట్‌ జాతీయ స్థాయిలో ఇతర పార్టీల సహాయం తీసుకోక తప్పదు. ఫ్రంట్‌లో భాగస్వాములయ్యే పార్టీల సంఖ్య అవి ఆయా రాష్ట్రాల్లో గెలుచుకునే సీట్ల ప్రాతిపదికగా లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం మారుతుంది.ఈ మార్పు ప్రభావం తప్పనిసరిగా టిఆర్‌ఎస్‌ నాయకత్వంపై ఉంటుందని భావిస్తున్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌దే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కీలక పాత్రగా మారితే కెసిఆర్‌ కూడా కేంద్ర ప్రభుత్వం విషయంలో ప్రధానభూమిక నిర్వర్తిస్తారని, అప్పుడు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా ఉన్న కె.తారక రామారావు తెలంగాణలో ప్రముఖ పాత్రకు వస్తారనే ప్రచారం జోరుగా ఉంది. ఈ పరిస్థితుల్లో కెటిఆర్‌కు తెలంగాణలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి సీనియర్లందరినీ ఢిల్లీకి పంపుతారని అంటున్నారు. అందుకనుగుణంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఉంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. శాఖల పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినప్పటికీ లోక్‌సభ ఎన్నికల వరకు పూర్తి స్థాయి క్యాబినెట్‌ కూర్పు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.