చంద్రబాబుపై ప్రచారయుద్ధం ప్రారంభించిన మోడీ

చంద్రబాబుపై ప్రచారయుద్ధం ప్రారంభించిన మోడీ

07-01-2019

చంద్రబాబుపై ప్రచారయుద్ధం ప్రారంభించిన మోడీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారయుద్ధం చేపట్టారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోని మోదీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు చెక్‌ పెట్టెందుకు పావులను కదుపుతూనే, మరోవైపు ప్రచారయుద్ధాన్ని కూడా ప్రారంభించారు. దాంతోపాటు రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఓడించాలని ఆయన కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో బిజెపి బలపడేలా వారిని చైతన్యపరుస్తున్నారు.

ప్రత్యేక సభలు, సమావేశాల ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపడంతోపాటు ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారిని కార్యోన్ముఖులను చేసేందుకు మోడీ కసరత్తును ప్రారంభించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపైన, ప్రధాని మోడీపైన చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. దీనికితోడు బీజేపీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి ఆరోపణలు పెద్దగా పట్టించుకోకపోవడం, సరైన సమాధానం చెప్పకపోవడం వంటి కారణాలతో ఆ పార్టీ కేడర్‌లో కొంత నైరాశ్యం నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగనుండటంతో మంచి స్పందన లభిస్తుందని ఆ పార్టీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలకు స్వయంగా ప్రధానమంత్రే సమాధానం చెబుతుండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందని ఆపార్టీ సీనియర్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమేమి చేసిందో ప్రధానే స్వయంగా వివరిస్తారని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో 90 రోజుల్లో కనీసం 25 సమావేశాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటికే ప్రధాని కార్యకర్తలతో నమో యాప్‌ ద్వారా మాట్లాడిన సంగతి తెలిసిందే.  కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు ప్రధాని ప్రాధాన్యతనిచ్చారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా దుబారా చేసిందో కూడా ప్రదాని వివరిస్తున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌ పార్టీతో అనైతిక పొత్తుపైనా విరుచుకుపడ్డారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకున్నా తమ బలమేమిటో నిరూపించుకునేందుకు బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.

కేంద్రం నుండి తీసుకోవాల్సిన అన్నింటినీ తీసుకుని మోసం చేశారని చెబుతూ నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్షలు అన్యాయమన్న భావన ఇప్పటికే బీజేపీ నాయకత్వం వ్యక్తం చేసింది. దీనికితోడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ఇటీవల విడుదల చేసిన శ్వేత పత్రాలు, గత అసెంబ్లి సమావేశాల్లో ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకుని నిండు సభలో చంద్రబాబు చేసిన ప్రకటనలపై కూడా ఈ సమావేశాల సందఠంగా చర్చించడం జరిగిందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రధానితో కార్యకర్తల ముఖాముఖీ కార్యక్రమాన్ని 90 రోజుల్లో విరివిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బిజెపి నాయకులు  తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్ర నిధులను దుర్వినియోగం చేసి విడుదల చేసిన శ్వేతపత్రాలపై తాము ప్రతి పంచాయతీలోనూ వాటికి సమాధానం చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నాయకులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఏఏ కార్యక్రమానికి ఎంతెంత నిధులు సమకూర్చింది, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది అనే అంశాలను తీవ్రస్థాయిలో ప్రజలతో మమేకమై చర్చిస్తామన్నారు. ఈ విధానం కచ్చితంగా ఏపీలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విధానం, పెద్ద నోట్ల రద్దును ఆయన స్వాగతించి ఇప్పుడు ప్లేటు ఫిరాయించిన అంశం, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఆయన చేసిన తాత్సారం, రాజధానిలో శాశ్వత భవనాల స్థానంలో తాత్కాలిక భవనాలు నిర్మించిన తీరు, హైకోర్టు ఏపీకి వచ్చిన తీరు తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశాల్లో కార్యకర్తలకు మోదీనే స్వయంగా తెలియజేస్తున్నారు.