చూచువారలకు చూడముచ్చటగా... జయరామ్‌ కోమటి కూతురి కళ్యాణ వేడుకలు ప్రారంభం

చూచువారలకు చూడముచ్చటగా... జయరామ్‌ కోమటి కూతురి కళ్యాణ వేడుకలు ప్రారంభం

27-08-2018

చూచువారలకు చూడముచ్చటగా...  జయరామ్‌ కోమటి కూతురి కళ్యాణ వేడుకలు ప్రారంభం

అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి దగ్గరి బంధువు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూతురు మేఘన పెళ్ళి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

మేఘన ఇష్టపడిన మార్సెల్‌తో వివాహ వేడుకలను జరిపించాలని తల్లితండ్రులు కల్పన జయరామ్‌, జయరామ్‌ కోమటి నిర్ణయించారు. సంప్రదాయంగా పెళ్ళికుమారుని ఇంటికి వెళ్ళి పెళ్ళిని తమ ఊరిలో జరిపించనున్నట్లు తెలిపారు. వారి అంగీకారంతో విజయవాడలో పెళ్ళివేడుకలకు జయరామ్‌ కోమటి భారీ ఏర్పాట్లు చేశారు. 29వ తేదీన సికె కన్వెన్షన్‌ హాల్‌లో పెళ్లిని ఏర్పాటు చేశారు.

అమెరికా నుంచి వచ్చిన వరుడు మార్సెల్‌కు, వారి కుటుంబ బంధు మిత్రులకు జయరామ్‌ కోమటి, బంధుమిత్రులు ఏర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం పలికారు. వారిని సంప్రదాయరీతిలో పూలమాలలు వేసి, తలపాగా పెట్టి ఆహ్వానించారు. వరుడి తరపువారికి ఓ విల్లాలో, ఇతరులకు పెద్ద హోటళ్ళలో విడిదిని ఏర్పాటు చేశారు. దాదాపు 45 మంది వరుడి తరపువారు ఈ వేడుకలకోసం విజయవాడకు తరలివచ్చారు.

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌

పెళ్ళికొడుకు వారు విజయవాడ విమానాశ్రయంలో తమకు లభించిన స్వాగతం చూసి ఆనందపడిపోయారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసమంటూ సినిమా తారలు ఇతరచోట్లకు వెళ్ళినట్లు తాము ఈ ప్రాంతానికి వచ్చామని వారు పేర్కొన్నారు.

వెల్వడం నుంచి ప్రారంభమైన వేడుకలు

పెళ్ళి కార్యక్రమాల్లో భాగంగా 26వ తేదీన తన సొంతూరైన మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో పెళ్ళికూతురు వేడుకలను జయరాంకోమటి దంపతులు ఘనంగా జరిపించారు. దాదాపు 5వేలమంది ఈ వేడుకలకు హాజరయ్యారు. 27వ తేదీ ఉదయం నగరంలో కల్పన కోమటి గారి ఇంట్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం కృష్ణానది ఆనుకుని ఉన్న పాతూరి వారి విల్లాలో జరిగిన నౌకావిహార వేడుకల్లో ఎంతోమంది పాల్గొన్నారు. బే ఏరియా నుంచి వచ్చిన ఎన్నారైలు, తానా నాయకులు, జయరామ్‌ కోమటి బంధుమిత్రులు ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్ళికొడుకు, వారి బంధుమిత్రులు, జయరామ్‌ కోమటి, వారి బంధుమిత్రులు ఎపి టూరిజం శాఖ బోటులో కృష్ణానదిలో విహరించారు. రెండు గంటలపాటు సాగిన వారి బోట్‌ షికారులోనే ఆతిధ్యం, డిజె వంటి కార్యక్రమాలు జరిగాయి.

బోటు నుంచి తిరిగి కృష్ణానది తీరానికి వచ్చినప్పుడు మేళతాళాలు, మంత్రోచ్ఛారణల మధ్య బ్రాహ్మణులు కృష్ణానదికి హారతి ఇచ్చారు. బాణాసంచా కాల్చారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలను తిలకించి వరుని తరపువారు పులకించిపోయారు. అదే సమయంలో చిన్నపాటి వర్షం కురియడంతో వారు మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ ఇదేనంటూ వ్యాఖ్యానించారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు తానా నాయకులు, ఎన్నారైలు తరలివచ్చారు. తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కోశాధికారి రవి పొట్లూరి, తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ళ గంగాధర్‌, ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ చలపతి కొండ్రకుంటతోపాటు బే ఏరియా నుంచి వచ్చిన విజయ ఆసూరి, వెంకట్‌ కోగంటి, రామ్‌ తోట, వీరు ఉప్పల, కరుణ్‌ వెలిగేటి, వినయ్‌ పరుచూరి, శాస్త్రి వెనిగళ్ళ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Click here for Event Gallery