అధిక వేత‌నాలు పొందుతున్న ప్రొఫెష‌న‌ల్స్

అధిక వేత‌నాలు పొందుతున్న ప్రొఫెష‌న‌ల్స్

07-06-2017

అధిక వేత‌నాలు పొందుతున్న ప్రొఫెష‌న‌ల్స్

వాళ్ల‌బ్బాయి సాఫ్ట్‌వేర్ అంట‌. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంట అనే మాట‌ను మ‌నం అప్పుడ‌ప్పుడు వింటూ ఉంటాం. జీతం చాలా ఉంటుందిగా అని అవ‌త‌లి వ్య‌క్తి నుంచి మ‌ళ్లీ ప్ర‌శ్న‌. ఇలాంటి మాట‌లు మ‌న చుట్టు ప‌క్క‌ల ఇళ్లలో అడ‌పాద‌డ‌పా ఎదురయ్యే ఉంటాయి. అయితే దేశంలో కొన్ని వృత్తులు చేప‌ట్టేవారు మాత్ర‌మే అత్య‌ధిక వేత‌నాలు తీసుకుంటున్నారు. వారి వారి విద్యార్హ‌త‌, నాలెడ్జ్‌, చ‌దివిన కాలేజీ, అభ్య‌ర్థి న‌డ‌వ‌డిక‌, బృందంలో ప‌నిచేసే వైఖ‌రి వంటి వాటి ఆధారంగా జీతాల‌ను నిర్ణ‌యిస్తున్నారు. కొంత మంది ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే చాలా ఎక్కువ జీతాలు చెల్లించే కార్పొరేట్‌, పీఎస్‌యూ సంస్థ‌లు ఉన్నాయి. అలా కాకుండా మొత్తంగా ఏఏ వృత్తులు చేప‌ట్టిన‌వారు దేశంలో అత్య‌ధిక వేత‌నాలు అందుకుంటున్నారో ఇక్క‌డ చూడండి.

1) మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌

దేశంలో ఎంబీఏ పూర్తిచేయాలంటే ఐఐఎంల్లో చేయాల‌నే ఒక క‌ల చాలా మంది మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌కు ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో బీ స్కూల్స్ పేరుతో మేనేజ్‌మెంట్ కాలేజీలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌చ్చాయి. అలా కాకుండా ఐఐఎం, ఐఐటీలు, ఎక్స్ఎల్ఆర్‌ఐ, ఐఐఎఫ్‌టీ, సింబ‌యాసిస్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దువు పూర్తిచేసిన ప‌ట్ట‌భ‌ద్రుల‌కు కార్పొరేట్ సంస్థ‌లు ల‌క్ష‌ల నుంచి కోట్ల‌లో వేత‌నాలు ఆఫ‌ర్ చేస్తున్నాయి. వారు మొద‌ట మేనేజ్‌మెంట్ ట్రెయినీగా వృత్తి జీవితాల‌ను మొద‌లెడ‌తారు. క్యాంప‌స్‌ల్లో జ‌రిగే ప్లేస్‌మెంట్ల‌లోనే వారి వార్షిక ప్యాకేజీలు 20 నుంచి 24 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటున్నాయి. ఇలాంటి వారిని రిక్రూట్ చేసుకునే సంస్థ‌ల్లో ఆర్థిక సేవ‌ల‌ను అందించే కంపెనీలు, మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టింగ్ సంస్థ‌లు ముందుంటున్నాయి. ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల్లో అప్పుడే చ‌దువు పూర్తి చేసిన మేనేజ్‌మెంట్ ప్రొఫెష‌నల్స్‌కు అత్య‌ల్ప వేత‌నాలంటే 7 నుంచి 9 ల‌క్ష‌ల మ‌ధ్య ఉండొచ్చు.

2) ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్‌

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక‌ర్‌గా కెరీర్ మొద‌లెడితే అన‌లిస్ట్‌, అసోషియేట్, వైస్ ప్రెసిడెంట్‌, డైరెక్ట‌ర్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతారు. వార్షిక‌ వేత‌నాలు వివిధ స్థాయిల్లో వేర్వేరుగా ఉంటాయి. అన‌లిస్ట్‌ల‌కు 5-9 ల‌క్ష‌లు, అసోషియేట్ల‌కు 7-13 ల‌క్ష‌లు వైస్‌ప్రెసిడెంట్ల‌కు 10-40 ల‌క్ష‌ల మ‌ధ్య జీతాలు ఉన్నాయి. ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లైన గోల్డ్‌మ్యాన్ శ్యాచ్స్‌, జేపీ మోర్గాన్ చేస్‌, డ‌చ్ బ్యాంకు, హెచ్‌సీబీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్‌, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూపు వంటివి ఈ ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డంలో ముందున్నాయి.

3) ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌

ఇంజినీరింగ్ ఫ్రెష‌ర్‌కు వేత‌నాలు రూ. 1.5 లక్ష నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటున్నాయి. ఐఐటీలు, మెట్రో న‌గ‌రాల్లో పేరున్న కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారి ప్యాకేజీలు 3 నుంచి 9 ల‌క్ష‌ల రూపాయల మ‌ధ్య ఉంటున్నాయి. ఏ ద‌శ‌లో ఉద్యోగం మొద‌లెట్టినా(ఏ ప్యాకేజీతో) కెరీర్‌లో ఎదుగుతున్న కొద్దీ మూడు నాలుగేళ్ల‌లో 3 నుంచి 6 లక్ష‌ల మ‌ధ్య వేత‌నం పొందే వారు ల‌క్ష‌ల్లో ఉన్నారు.  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా ప్రొగ్రామ‌ర్ లేదా అన‌లిస్ట్ డిజిగ్నేష‌న్ క‌లిగిన వారికి మొద‌టి మూడేళ్లలో 3 నుంచి 5 ల‌క్ష‌ల మ‌ధ్య వేత‌నం ఉండొచ్చు. సీనియ‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేత‌నాలు రూ. 4.5 నుంచి రూ. 6 ల‌క్ష‌ల మ‌ధ్య; ప‌్రాజెక్టు లీడ్ లేదా టీమ్ లీడ్‌ల‌కు రూ. 6 నుంచి రూ. 13 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటున్నాయి. ప్రాగ్రామ్ మేనేజ‌ర్ స్థాయి క‌లిగిన వారు రూ. 8 నుంచి రూ. 25 ల‌క్ష‌ల మ‌ధ్య వార్షిక వేత‌నాన్ని పొందుతున్నారు. అత్య‌ధిక వేత‌నాలే కాకుండా ఇతర ఇంట‌ర్నేష‌న‌ల్ అసైన్‌మెంట్లు ఉంటాయి. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప‌ని మీద వివిధ దేశాలు తిర‌గాల్సి ఉంటుంది. వీరంతా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా వ‌చ్చే సాంకేతిక‌త‌ల‌పై అవ‌గాహ‌న‌ను పెంచుకుంటూ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

4. చార్టెర్డ్ అకౌంటెంట్స్

ఇంట‌ర్ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా మొగ్గు చూపేది ఇంజినీరింగ్, మెడిసిన్‌కే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కోవ‌లోకి చార్డెర్డ్ అకౌంటెంట్స్ కూడా వ‌చ్చి చేరుతోంది. ఒక్క‌సారి చార్టెర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తిచేసిన వారికి వివిధ ర‌కాలుగా ఉద్యోగ అవ‌కాశాలు అందుబాటులో ఉంటాయి. వీరు ఫైనాన్సియ‌ల్ అకౌంటింగ్‌, ట్యాక్స్ మేనేజ్‌మెంట్‌, ఆడిటింగ్‌, కాస్ట్ అకౌంటింగ్‌, బ్యాంకింగ్‌, క‌న్స‌ల్టెన్సీ వంటి వాటి మీద అవ‌గాహ‌న‌ను క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఆయా రంగాల్లో ఈ వృత్తి నిపుణుల అవ‌స‌రం ఉంటుంది. సీఏ పూర్తి చేసిన వారికి ఈ అండ్ వై(E&Y), డెలాయిట్‌, ప్రైస్ వాట‌ర్ కూప‌ర్స్‌, కేపీఎంజీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటివి డ్రీమ్ కంపెనీలుగా ఉంటాయి. కొంత మంది సొంత‌గా క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌ల‌ను నెల‌కొల్పుతూ ఉంటారు. ఏదైనా సంస్థ‌లో ఉద్యోగంలో చేరితే సీఏ ఫ్రెష‌ర్ వేత‌నాలు రూ. 4.5 లక్ష‌ల నుంచి రూ. 7 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటున్నాయి. వారి అనుభ‌వం పెరిగే కొద్దీ వార్షిక వేత‌నాలు రూ. 18 నుంచి రూ. 24 ల‌క్ష‌ల మ‌ధ్య వ‌ర‌కూ పెరుగుతున్నాయి. ఎంబీఏ అద‌నంగా ఉండ‌టం యాడెడ్ అడ్వాంటేజ్‌.

5. చ‌మురు, స‌హ‌జ‌వాయు రంగాల్లో వృత్తినిపుణులు (ఆయిల్ అండ్ న్యాచుర‌ల్ గ్యాస్ ఫ్రొఫెష‌న‌ల్స్‌)

ఈ రంగాల్లో ప్ర‌వేశంతోటే రూ. 3.5 నుంచి 6 లక్ష‌ల ప్యాకేజీలు ఉంటాయి. మ‌న దేశంలో ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్‌, భార‌త్ పెట్రోలియం వంటి వాటిల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ప్ర‌యివేటు రంగంలో సైతం కొన్ని సంస్థ‌లు ఉపాధి క‌ల్పిస్తున్నాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ పే క‌మీష‌న్ సూచించిన విధంగా జీతాల‌ను అందిస్తాయి. వీటితో పాటు ప్ర‌యివేటు రంగానికి దీటుగా అద‌న‌పు సౌక‌ర్యాలు, ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ప్ర‌యివేటు రంగంలో ఉద్యోగాలు క‌ల్పించే సంస్థ‌ల్లో బ్రిటీష్ గ్యాస్‌, రిల‌యన్స్ ఎన‌ర్జీ, షెల్ వంటివి కొన్ని పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌లు. ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌ల్లో చ‌దువు పూర్తి చేసుకుని ఫ్రెష‌ర్‌గా ఉద్యోగం మొద‌లుపెట్టి 5 నుంచి 6 ఏళ్ల అనుభ‌వం గ‌డిస్తే వార్షిక ప్యాకేజీలు 15 నుంచి 20 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ పొందే వీలుంది.

6. మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌

ఇండియాలో డాక్ట‌ర్ లాంటి వైద్య వృత్తిలో ఉన్న నిపుణుల‌కు చాలా డిమాండ్ ఉంది. కొన్నింటిలో స్పెష‌లైజేష‌న్ ఉన్న వాళ్ల‌కు మ‌రీ డిమాండ్ ఉంది. డాక్ట‌ర్లు ప్రైవేటు ప్రాక్టీసు, స‌ర్జ‌రీల ద్వారా ఎక్కువ సంపాదిస్తారు. స‌ర్జ‌న్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. స‌ర్జ‌న్‌కు చేసే ఉద్యోగంలో వ‌చ్చే డ‌బ్బుతో పాటు స‌ర్జ‌రీ ఫీజు కూడా అద‌నంగా వ‌స్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం కొన్ని ఆసుప‌త్రుల్లో డెంటిస్ట్‌ల‌కు సైతం ప్ర‌త్యేక ఫీజు రూపంలో డ‌బ్బు చెల్లిస్తున్నారు. ప్ర‌ముఖ ఆస్పత్రుల్లో ఉద్యోగం పొందిన డాక్ట‌రుకు రూ. 4.5 నుంచి 6 లక్ష‌ల వ‌ర‌కూ జీతం వ‌స్తూ ఉంటుంది. స్పెష‌లైజేష‌న్ క‌లిగిన స‌ర్జ‌న్‌కు దీనికి రెండింత‌ల ఆదాయం వ‌స్తుంది. సాధార‌ణంగా మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌లో జ‌న‌ర‌ల్, థొరాసిక్‌(thoracic), సైక్రియాట్రిస్ట్‌, గైన‌గాలజిస్టులు ఎక్కువ‌గా ఆర్జిస్తుంటారు.

7) ఏవియేష‌న్ ప్రొఫెష‌న‌ల్స్‌

గ‌త కొన్నేళ్ల‌లో ప్రైవేటు ఎయిర్‌లైన్స్ రాక‌తో విమాన‌యాన రంగం పోటీతో వృద్ది చెందుతోంది. వాణిజ్య ప‌ర‌మైన ఎయిర్‌లైన్ సెక్టార్ ఉద్యోగాల‌ను సృష్టిస్తోంది. క్వాలిఫైడ్ పైల‌ట్లు, గ్రౌండ్ స్టాఫ్‌, స్టీవార్డ్స్‌, ఎయిర్‌హోస్టెస్ వంటి ఆ రంగానికి సంబంధించిన‌ ఉద్యోగాల‌కు నిత్యం డిమాండ్ ఉంటూ వ‌స్తోంది. జంబో పైల‌ట్లు, రెగ్యుల‌ర్ పైల‌ట్లు(కార్గో లేదా ప్యాసెంజ‌ర్ ఎయిర్‌లైన్స్‌) రూ. 7 నుంచి 9.5 ల‌క్ష‌ల మ‌ధ్య వేత‌నాల‌ను అందుకుంటున్నారు. ఎయిర్‌లైన్ స్టీవార్డ్స్‌, ఎయిర్‌హోస్టెస్ వేత‌నాలు రూ. 4 నుంచి 6 లక్ష‌ల వ‌ర‌కూ ఉంటున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్లు(ఏటీసీ) రూ. 5- 6 ల‌క్ష‌ల జీతాలు తీసుకుంటున్నారు.

8) మోడ‌లింగ్ అండ్ యాక్టింగ్‌

మెట్రో న‌గ‌రాల్లో యువ‌త‌కు మోడ‌లింగ్, న‌ట‌న‌పై మోజు ఎక్కువ ఉంటుంది. న‌టించే పాత్ర‌ను బ‌ట్టి ఎపిసోడ్‌కు కొత్త‌వారికి రూ.1000 నుంచి రూ. 10వేల వ‌ర‌కూ, అనుభ‌వం ఉన్న వారికి రూ. 10 వేల నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ టీవీ షోల్లో పారితోష‌కం ఇస్తారు. సినిమా ప‌రిశ్ర‌మ‌ల్లో కొంత నిలదొక్కుకున్న వారికి రూ. 5 లక్ష‌ల నుంచి రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ కూడా రెమ్యున‌రేష‌న్ ఇస్తారు. ఇది సినిమా బ‌డ్జెట్‌ను బ‌ట్టి వారు పోషించే పాత్ర‌ను బ‌ట్టి ఉంటుంది. ఫ్యాష‌న్ షో, ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్‌ల ప్ర‌క‌ట‌న‌ల ఆధారంగా మోడ‌లింగ్ అసైన్‌మెంట్లు ఉంటాయి. డిమాండ్-ఆదాయం ఆధారంగా చెల్లింపులు జ‌రుగుతుంటాయి. టీవీ క‌మ‌ర్సియ‌ల్స్‌, బిల్‌బోర్డ్ అడ్వ‌ర్టైజ్‌మెంట్ల‌లో అనూహ్యంగా వ‌చ్చిన మోడ‌ళ్లు ఒక్కోసారి సినిమా న‌టుల‌తో స‌మానంగా ఆర్జించ‌డాన్ని మ‌నం చూస్తుంటాం. దేశంలో హిందీ, త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉన్న న‌టీన‌టులు, తారాగ‌ణం బాగా ఆర్జిస్తున్నారు. ఇది కూడా చ‌ద‌వండి ఆశ్చర్యం! ఐదేళ్ల యాపిల్ ఆధిప‌త్యానికి గూగుల్ గండి కొట్టిందా....

9) న్యాయవాద వృత్తి చేప‌ట్టిన‌వారు (లా ప్రొఫెష‌న‌ల్స్‌)

న్యాయ‌వాద వృత్తిలో ఉండేవారికి ఉద్యోగం ఇచ్చిన సంస్థ‌ను, ఆ వ్య‌క్తి ట్రాక్ రికార్డు ఆధారంగా వేత‌నాన్ని చెల్లిస్తారు. ప్ర‌భుత్వ రంగంలో అయితే వేత‌నాలు ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా ఉంటాయి. ప్ర‌వేటు న్యాయ సంస్థ‌ల్లో(లా ఫ‌ర్మ్స్‌) ఉద్యోగాలు చేసే వారు రూ. 6 నుంచి 9 ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదించే అవ‌కాశం ఉంది. నేష‌న‌ల్ లా స్కూల్స్ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఫ్రెషర్‌గానే బాగా డిమాండ్ ఉంటుంది. మొద‌ట 5 ల‌క్ష‌ల పైబ‌డి వేత‌నాల‌తో మొద‌లుపెట్టి 4 నుంచి 6 సంవ‌త్స‌రాల అనుభ‌వం గడించిన త‌ర్వాత రూ. 10 నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కూ వేత‌నాల‌ను పొందుతున్నారు. అలా కాకుండా ప్ర‌యివేటు అడ్వ‌కేట్ లేదా క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేసేవారు క్ల‌యింట్ల సంఖ్య‌, కేసు తీవ్ర‌త ఆధారంగా డ‌బ్బు సంపాదిస్తారు. ఏజ‌డ్‌డీ అండ్ పార్ట్‌న‌ర్స్, లుథ్రా అండ్ లుథ్రా, అమ‌ర్‌చంద్ మంగ‌ల్‌దాస్ వంటివి పేరెన్నిక‌న్న లా ఫ‌ర్మ్స్‌. కంపెనీల్లో లీగ‌ల్ అడ్వైజ‌ర్లుగా సైతం ప‌నిచేసే వారికి మంచి గౌర‌వం, హోదాతో పాటు వేత‌నాలు బాగా ఉంటాయి. కార్పొరేట్ లా అంశంలో ఆస‌క్తి కలిగిన వారు బ‌హుళ జాతి సంస్థ‌(ఎమ్ఎన్‌సీ)ల్లో ఎక్కువ జీతాల‌ను అందుకోవ‌చ్చు. ఇది కూడా చ‌ద‌వండి హెచ్‌1-బీ కొత్త బిల్లేంటో... ఐటీ కంపెనీల గుబులేంటో....

10) బిజినెస్ క‌న్స‌ల్టెంట్‌

బిజినెస్ క‌న్స‌ల్టెంట్ ప‌ని క్ల‌యింట్ అవ‌స‌రాల‌ను అర్థం చేసుకుని, క్లయింట్ల పోటీ కంపెనీల ప‌నితీరు అధ్య‌యనం చేసి, బిజినెస్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా నివేదిక‌లు త‌యారు చేయ‌డం ; క్ల‌యింట్ వ్యాపారానికి త‌గ్గ‌ట్లు స్థానిక స‌మ‌చారాన్ని సేక‌రించ‌డం; మార్కెట్ విశ్లేష‌ణ‌; డాక్యుమెంటేష‌న్ మొద‌లైన‌వి. వ్యాపార స‌మావేశాల‌ను ఏర్పాటు చేయ‌డం కూడా వీరు చేయాల్సి ఉంటుంది. బిజినెస్ కన్స‌ల్టెంట్ల కెరీర్ అన‌లిస్ట్‌లు, క‌న్స‌ల్టెంట్‌, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, మేనేజ‌ర్ లేదా ప్రాజెక్ట్ లీడ్ వంటి పోజిష‌న్ల‌తో కొన‌సాగుతుంది. దాని త‌ర్వాత పార్ట‌న‌ర్‌, ప్రెసిడెంట్ లేదా డైరెక్ట‌ర్ అయ్యేందుకు సైతం ఆస్కారం ఉంటుంది. ఏడాది కన్నా త‌క్కువ అనుభ‌వం క‌లిగిన వారికి రూ. 4 నుంచి రూ. 6 లక్ష‌ల వ‌ర‌కూ వేత‌నం ఇస్తారు. అనుభ‌వం పెరిగే కొద్దీ ఇది రూ. 12 నుంచి 18 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెరుగుతుంది. పెద్ద పెద్ద క‌న్స‌ల్టింగ్ సంస్థ‌లు జీవిత బీమా, వైక‌ల్య బీమా, పెయిడ్ సిక్ లీవ్‌, రిలోకేష‌న్ ఖ‌ర్చులు, ప్ర‌పంచ వ్యాప్తంగా పెయిడ్ ట్రిప్‌లు, ఉచిత హెల్త్ క్ల‌బ్ మెంబ‌ర్ షిప్ వంటి అద‌న‌పు సౌక‌ర్యాలను క‌ల్పిస్తున్నాయి. ఎక్కువ మంది క‌న్స‌ల్టెంట్‌లు మెక‌న్సీ, యాక్సెంచ‌ర్‌, బీసీజీ, కేపీఎంజీ వంటి వాటిలో ఒక్క‌సారైనా ప‌నిచేయాల‌ని అనుకుంటారు. ఇవి కాకుండా రాజ‌కీయాలు, స్పోర్ట్స్‌, సినిమా న‌టులు, జాతీయ మీడియాలో ఎడిట‌ర్లు, ఫీల్డ్ రిపోర్ట‌ర్లు సైతం అత్య‌ధిక వేత‌నాలు పొందుతున్నారు. ఇవ‌న్నీ వేర్వేరు వెబ్‌సైట్లు రెఫ‌ర్ చేసి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా రూపొందించిన‌వి. వీటి ఆధారంగా నిర్ణ‌యం తీసుకోజాల‌రు. 

by:రిపోర్టరు : సుబ్రహ్మణ్యం .................