అగ్ర పార్టీలకు ప్రాంతీయ పార్టీల సెగ
Sailaja Reddy Alluddu

అగ్ర పార్టీలకు ప్రాంతీయ పార్టీల సెగ

08-08-2018

అగ్ర పార్టీలకు ప్రాంతీయ పార్టీల సెగ

దేశంలో ప్రధానమైన అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తామే అధికారంలో రావడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుంటోంది.  2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, త ణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కర్నాటక ముఖ్యమంత్రి డి.కుమారస్వామి, మాజీ కేంద్ర మంత్రి, ఎస్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, సీపీఎం, డీఎంకే తదితర పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోకుండా వరుస ఓటములతో ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోవటంతో మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నోట్ల రద్దు, డిఫెన్స్‌ కుంభకోణాలు గట్టి దెబ్బగా తగిలేటట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలపై ద ష్టి కేంద్రీకరిస్తున్నాయి.  లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఈ పార్టీలు అత్యంత కీలక పాత్ర నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్నాటక తదితర ఏడెనిమిది రాష్ట్రాల్లో ఈ పార్టీలు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.  ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ  ఎన్నికల అనంతరం ఫ్రంట్‌గా మారుతాయా లేక జాతీయ పార్టీలతో ఒప్పందం చేసుకుంటాయా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి ఉండాల్సిందే. రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ద ష్టా జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయటం సాధ్యం కావటం లేదు, అందుకే వీరు ఆయా రాష్ట్రాల స్థానిక రాజకీయ పరిస్థితులను ద ష్టిలో పెట్టుకుని రెండు, మూడు ప్రాంతీయ పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించనున్నాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం కావటంతోపాటు ఎనభై మంది లోక్‌సభ సభ్యులను పార్లమెంటుకు పంపిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బీఎస్పీ ఆర్‌.ఎల్‌.డీలు సీట్ల సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. మొత్తం ఎనభై లోక్‌సభ సీట్ల నుండి నలభై నుండి నలభై ఐదు సీట్లను బీఎస్పీకి ఇచ్చేందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అంగీకరించటం గమనార్హం. బీఎస్పీ, ఎస్పీ, అజిత్‌ సింగ్‌ నాయకత్వంలోని ఆర్‌జేడీ సీట్ల సర్దుబాటు జరిగితే ఈ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకోవటం ఖాయం. ఇలాంటి చోట్ల అధికార బిజెపి, కాంగ్రెస్‌ సీట్లకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

కాకపోతే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ అధికారం చేతిలోకి వచ్చేంతవరకు కలిసి ఉంటాయో లేవో చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలో జరిగిన పరిణామాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఏదీ ఏమైనా ఈసారి మాత్రం లోక్‌సభ ఎన్నికలు రెండు పార్టీల మధ్యనే కాకుండా జాతీయ ప్రాంతీయ పార్టీల మధ్యగానే జరుగుతున్నట్లు చెప్పవచ్చు.

- గోవింద్‌