'నీది నాది ఒకే కథ' కాదు.... ఇది మనందరి కథ
Sailaja Reddy Alluddu

'నీది నాది ఒకే కథ' కాదు.... ఇది మనందరి కథ

30-03-2018

'నీది నాది ఒకే కథ' కాదు.... ఇది మనందరి కథ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5 
నటీనటులు : శ్రీవిష్ణు, దేవి శ్రీ ప్రసాద్, సాట్నా టిటస్, పోసాని కృష్ణ మురళి తది తరులు...
సంగీతం : సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫర్ : రాజు తోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి, నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
స్క్రీన్ ప్లే : వేణు ఊడుగుల, దర్శకత్వం : వేణు ఊడుగుల


యంగ్ హీరో శ్రీవిష్ణు, సాట్నా టిటస్ లు జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అలరించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఉత్తమ ఉపాధ్యాయుడైన రుద్రరాజు దేవి ప్రసాద్ (దేవి ప్రసాద్) తనయుడైన సాగర్ (శ్రీవిష్ణు) చదువంటే అంత ఆసక్తి కనబరచడు. డిగ్రీ పాస్ అవ్వడానికి నానా తంటాలు పడే సాగర్ తండ్రిని మెప్పించే ప్రయత్నం చేస్తాడు. జీవితంలో పైకి రావడం కోసం వ్యక్తిత్వ వికాసం బుక్స్ చదువుతుంటాడు. ఇలా తండ్రి కొడుల మధ్య సాగే కథే ఈ సినిమా. ఫైనల్ గా సాగర్ తండ్రిని మెప్పించాడా..? వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలే నీదీ నాదీ ఒకే కథ సినిమా.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

శ్రీవిష్ణు హీరోగా సాగర్ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సినిమా చూస్తున్నత సేపు ఆ పాత్రలో అతన్ని కాకుండా వేరొకరిని ఊహించుకోలేం. అంతగా ఒదిగిపోయాడు. ఇక సాట్నా టిటస్ కూడా మంచి పాత్రలోనే నటించింది. ఇక సినిమాలో తండ్రి పాత్ర చేసిన కామెడీ చిత్రాల  దర్శకుడు దేవి ప్రసాద్ కూడా హీరోకి సమానమైన రోల్ చేశాడు. అతను కూడా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం :

దర్శకుడు వేణు ఊడుగుల...  ఇది  మొదటి సినిమానే అయినా అతను తీసుకున్న పాయింట్ అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా చక్కగా రాసుకున్నాడు. దర్శకుడు చాలా మంది యువకుల జీవితాల్లో ఉండే ఒక కీలకమైన దశనే తన సినిమా కథగా ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని కథలో ఇనుమడింపజేసి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈరోజుల్లో తల్లి దండ్రులు తమ పరువు కోసం పిల్లలపై ఎలాంటి ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు, అది పిల్లల్ని ఎలా ఇబ్బందిపెడుతోంది, తమ ఆశల కోసం పిల్లల ఇష్టాల్ని, కోరికల్ని తల్లిదండ్రులు, టీచర్లు ఎలా చిదిమేస్తున్నారు అనే అంశాలని బలంగా చూపాడు. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు తగినట్టుగా ఉంటుంది. సాహిత్యం కూడా అందుకు సహకరిస్తుంది. రాజ్ తోడ, పర్వాజ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. అయితే అక్కడక్క కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టేశారు.

విశ్లేషణ :

నీదీ నాదీ ఒకే కథ. టీజర్ వచ్చినప్పుడే మళ్లీ శ్రీవిష్ణు కొత్త కథతో వస్తున్నాడని అనుకున్నారు. ఇక ట్రైలర్ చూశాక ఆ భావన మరింత బలపడింది. సినిమా అంతా ఓ చదువంటే ఆసక్తి లేని వ్యక్తి జీవితంలో ఎలా పైకి రావలన్న కథతో నడుస్తుంది. చిన్నప్పటి నుండి కష్టపడి మంచి జాబ్ వచ్చాక సుఖ పడొచ్చు అన్న కాన్సెప్ట్ ను కళ్లకు కట్టినట్టు చూపించారు.సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా.. మన పక్కన జరిగే వ్యక్తి కథగా.. మన కథగా అనిపిస్తుంది. అలా స్క్రీన్ ప్రెజెన్స్ రావడంలో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాలి. అక్కడక్కడ కొన్ని కమర్షియల్ అంశాలను టచ్ చేసినా సినిమా మెయిన్ కంటెంట్ బాగా రాసుకున్నాడు. ఆర్టిస్టు పర్ఫార్మెన్స్, బేస్ లైన్ మీదే సినిమా అంతా నడిపించడం సినిమాకు బలాలని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా అంతా ఎమోషనల్ గా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.   మొదటి భాగం స్పీడ్ గా లాగించేసినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పటికి 121 నిమిషాల డ్యూరేషన్ సినిమాకు కలిసి వచ్చే అంశమే. నేటి యువత ఆలోచించే విధానాలకు దగ్గరగా ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా యూత్ ఎంటర్టైనర్ గా అవుతుందనడంలో సందేహం లేదు.