రివ్యూ : అభిమానులకు విందు భోజనం 'కాటమరాయుడు'

రివ్యూ : అభిమానులకు విందు భోజనం 'కాటమరాయుడు'

24-03-2017

రివ్యూ : అభిమానులకు విందు భోజనం 'కాటమరాయుడు'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3.5/5

బ్యానర్ : నార్త్ స్టార్ ఎంటెర్టైమెంట్ ప్రవేట్ లిమిటెడ్,
నటీనటులు : పవన్ కళ్యాణ్, శృతి హాసన్, రావు రమేష్ ,అలీ,అజయ్, శివ బాలాజీ,కమల్ కామరాజు,
చైతన్య కృష్ణ, నాజర్, అయ్యప్ప ఫై శర్మ, తరుణ్ అరోరా, ప్రిథ్వి రాజ్, పవిత్ర లోకేష్ మరియు ప్రదీప్ రావత్ తది తరులు.... 

కథ : శివ 'వీరం' ఒరిజినల్, మాటలు : ఆకుల శివ, వేమా రెడ్డి, శ్రీనివాస రెడ్డి,  తిమ్మా రెడ్డి,
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కరభట్ల రవి కుమార్, అనంత్ శ్రీ రామ్, వరికుప్పల యాదగిరి,
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మురెళ్ళ, సంగీతం : అనూప్ రూబెన్స్, ఎడిటర్ : గౌతమ్ రాజు,
స్క్రీన్ ప్లే : వాసు వర్మ, దీపక్ రాజ్, నిర్మాత : శరత్ మరార్, డైరెక్టర్ : కిశోర్ కుమార్ పార్ధసాని (డాలి)

విడుదల తేదీ : 24.03.2017


కాటమరాయుడా...కదిరి నరసింహుడా...అంటూ అత్తారింటికి దారేది..? సినిమా పవన్ కళ్యాణ్ పాడిన పాట అది ఈ రోజు నుండి ఈ టైటిల్ పై వున్నా మమకారంతో... భారీ అంచనాల్ని మూటగట్టుకుని ప్రతి దశలోనూ పాటలు, టీజర్, ట్రైలర్లతో అభిమానుల్ని అలరిస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’ ఈరోజే భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని (డాలి)  డైరెక్ట్ చేశారు. నార్త్ స్టార్ ఎంటెర్టైమెంట్ ప్రవేట్ లిమిటెడ్ పతాకం పై శరత్ మరార్ నిర్మించిన  ఈ చిత్రం అశేషాభిమానుల ఆశలను ఎంతవరకు నిలబెడుతుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

ఏళ్లు పైబడినా సరే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడు కాటమరాయుడు (పవన్ కళ్యాన్). తన నలుగురు తమ్ముళ్ల కోసం తాను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు. అంతేకాదు ఆడవాళ్ల మీద ఓ రకమైన అయిష్టతతో ఉంటాడు కాటమరాయుడు. కాని తమ్ముళ్లు మాత్రం కాటమరాయుడు చెప్పిన మాటలేవి పట్టించుకోకుండా ప్రేమలో పడతారు. తమ ప్రేమని గెలిపించుకోవాలంటే అన్నయ్య కాటమరాయుడిని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో తన చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కాటమరాయుడు ఇష్టపడే అవంతిక (శృతి హాసన్) ను కాటమరాయుడు ప్రేమలో పడేలా చేస్తారు. శృతి హాసన్ మాత్రం తనకు ఎప్పుడు  గొడవలు పెట్టుకునే వాళ్లు నచ్చరని చెప్పేస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్.. శృతి హాసన్ ఫ్యామిలీ ఆపదలో ఉంటుంది. విలన్ శృతి ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అప్పుడు కాటమరాయుడు ఆ విలన్ ను ఢీ కొడతాడు. అసలు శృతి హాసన్ ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి..? కాటమరాయుడు విలన్ ను ఎలా ఢీ కొట్టాడు..? కాటమరాయుడు లవ్ స్టోరీ ఏమైంది అన్నది అసలు కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

పవర్ స్టార్ సినిమా అంటే అందులో పవన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షోగా ఉంటుంది. కాటమరాయుడులో కూడా అంతే.. ఉండటానికి కాస్టింగ్ చాలా పెద్దదిగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే అందరికి కనిపిస్తాడు. ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచే ఎన్నో సన్నివేశాలు సినిమాలో ఉండటం విశేషం. పవర్ స్టార్ స్పెషల్ గా పంచె కట్టుతో కనిపించిన తీరు అద్భుతం. ఇక సినిమాలో శృతి హాసన్ చాలా గ్లామర్ గా కనిపించింది. పాత్రకు తగ్గట్టు చక్కనైనా కట్టు బొట్టుతో అమ్మడు అదరగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ల పెయిర్ కాటమరాయుడు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక కాటమరాయుడు తమ్ముళ్లుగా నటించిన నలుగురు తమ్ముళ్లు గా శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజ్, కృష్ణ చైతన్యలు తమ పాత్రల మేరకు బాగానే నటించారు.  ఆలి కామెడీ బాగుంది. విలన్ గా నటించిన తరుణ్ అరోరా కూడా బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం :

ఇక కాటమరాయుడు టెక్నికల్ టీం విషయానికొస్తే.. కోలీవుడ్ మూవీ 'వీరం' రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు కిశోర్ పార్ధసాని డైరక్షన్ లో వచ్చింది. పవర్ స్టార్ ను కొత్తగా చూపించడంలో డాలి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్, ఫైట్స్ లో కెమెరా వర్క్ చాలా బాగుందనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఓకే. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడంలో అనూప్ ఫెయిల్ అయ్యాడు. మిర మిరా మీసం సాంగ్ తప్ప మిగతావన్ని మాములుగానే అనిపిస్తాయి. గౌతం రాజు ఎడిటింగ్ ఓకే. రామ్ లక్ష్మన్ ఫైట్స్ బాగున్నాయి. శరత్ మరార్ నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ నెస్ తీసుకువచ్చాయి. 

విశ్లేషణ :

సినిమాలోని మొదటి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది అనుమానం లేకుండా పవన్ కళ్యాణే. పవన్ తన చరీష్మతో అభిమానుల్ని ఉర్రూతలూపాడు. అచ్చమైన చేనేత పంచెకట్టులో, మిరా మిరా కోర మీసంతో పవన్ స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తున్నంతసేపు ఫ్యాన్స్ కు పండుగనే చెప్పాలి. పవన్ ఫైట్స్ లో, పంచ్ డైలాగుల్లో, డ్యాన్సుల్లో అభిమానులకు, ప్రేక్షకులకు ఎంజాయ్ చేసేందుకు కావాల్సినంత కంటెంట్ దొరికింది. ఇక శృతి హాసన్ తో నడిచే రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించి థియేటర్ మారుమోగిపోయేలా చేశాడు. ఫస్టాఫ్లో తమ్ముళ్లు రాయుడిని ప్రేమలోకి దించే ట్రాక్లో అలీ జనరేట్ చేసిన బోలెడంత కామెడీ బాగా నవ్వించింది. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ దర్శకుడు డాలి అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని వాటిని కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చుకుని సినిమాను చాలా వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా నడిపాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా పవన్ పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలతో, ఫ్రెష్ కామెడీతో, రొమాన్స్ తో నిండి సరదాగా సాగిపోయింది.

సెకండాఫ్ లో ఆరంభంలో కూడా అభిమానుల్ని మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గి రొటీన్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో చూసినట్టు ఒకటే రొటీన్ కథనం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించవచ్చు. ఒక పాట, ఆ తర్వాత ఒక ఫైట్ అన్నట్టు సాగే ఆఖరి 40 నిముషాల సినిమా అప్పటి వరకు పొందిన ఉత్సాహాన్ని కాస్త దెబ్బతీసింది. ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. దర్శకుడు డాలి ఇక్కడ పాత ఫార్ములానే ఉపయోగించాడు. పైగా ఈ ఎపిసోడ్ టేకింగ్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.. అంటే పవన్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో లేదు. ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనూప్ రూబెన్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి చల్లబడిపోయాడు. అలాగే రావు రమేష్ పాత్ర ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అనుకునేలోపు దాన్ని కాస్త ఫన్నీగా ముగించడం అంత సంతృప్తికరంగా లేదు. ఈ ప్రతికూల అంశాలన్నీ కలిసి సెకండాఫ్ ను సాధారణంగానే మిగిల్చాయి. అలా కాకుండా సెకండాఫ్ కాస్త కొత్తగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంకొంచెం బలంగా ఉండి ఉంటే సినిమా ఫలితం వేరే స్థాయిలో ఉండేది.మొత్తం మీద చెప్పాలంటే ‘కాటమరాయుడు’ అభిమానులకు పండుగను, మిగిలిన ప్రేక్షకులకు మంచి సినిమాను చూసిన అనుభవాన్ని ఇస్తుంది.