రివ్యూ : 'భరత్ అనే నేను' అంటూ హామీ నిలబెట్టుకున్నాడు

రివ్యూ : 'భరత్ అనే నేను' అంటూ హామీ నిలబెట్టుకున్నాడు

20-04-2018

రివ్యూ : 'భరత్ అనే నేను' అంటూ హామీ నిలబెట్టుకున్నాడు

(నిజాయితితో కూడిన అద్భుత విజయం)

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5

బ్యానర్ : డి వి వి ఎంటర్టైన్మెంట్స్,

నటి నటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మాజీ,దేవ్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ప్రిథ్వి రాజ్, రావు రమేష్, పి. రవి కుమార్, జీవా, యశపాల్ శర్మ,అజయ్ సితార, ఆమని తది తరులు

సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, యస్.తిరునవుక్కరసు
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వ రాఘవన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, పాటలు: రామ జోగయ్య శాస్ట్రీ
నిర్మాత: డి వి వి దానయ్య
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ

విడుదల తేదీ:20.04.2018

శ్రీ మంతుడు చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు  కొరటాల శివ హిట్ కాంబినేషన్ లో  రూపొందిన చిత్రం ‘భరత్ అనే నేను’. నిజాయితీ, ధైర్యం దమ్మున్న యువ ముఖ్య మంత్రి గా ఈ చిత్రం లో మహేష్ నటించారు. ప్రజలు   ప్రిన్స్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో డి వి వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య నిర్మించారు. మరి ముఖ్యమంత్రిగా మహేష్  ఏ మాత్రం  ఆకట్టుకున్నాడో కొరటాల శివ తన కథ తో ప్రజలను ఈ మాత్రం చైతన్య పరిచాడో  సమీక్షలో తెలుసుకుందాం. 

కథ:

కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో కొత్త కొత్త డిగ్రీలను  లండన్ ఆక్సఫర్డ్ యూనివర్సిటీ  నుండి అందుకున్న ఇంటెలిజెంట్  కుర్రాడు భరత్ రామ్  (మహేష్ బాబు) ఉమ్మడి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి తండ్రి ప్రాణ స్నేహితుడైన ప్రకాష్ రాజ్   బలవంతం మీద ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరిస్తాడు. అలా రాజకీయాలు గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏమాత్రం అవగాహన లేని భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు? ప్రమాణస్వీకారంలో అంతః కరణ సుద్ధి గా  ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా ఎలా తపించాడు ? రాష్ట్రాన్ని బాగుచేయడంలో ఎలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ? హీరోయిన్ వసుమతి (కైరా అధ్వాని) పాత్రా ఏమిటి  అనేదే తెరపై నడిచే కథ. 

ఆర్టిస్ట్స్ పెర్ఫఫార్మన్స్:

సినిమాలో  ఏ తో జడ్ మహేష్ నటనే ప్రధాన ఆకర్షణ భరత్ రామ్ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. కథ పరంగా చెప్తే సినిమా చాలా సింపుల్ గానే ఉంటుంది. కానీ దానికి మహేష్ పెర్ఫార్మెన్స్ ను యాడ్ చేసి చూస్తే మాత్రం గొప్పగా ఉంటుంది. అంతలా సినిమాను నిలబెట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్. విదేశాల్లో చదువుకున్న కుర్రాడు  రాజకీయాల గురించి ఓనమాలు తెలియని భరత్ రామ్  ముఖ్యమంత్రి అయితే ఎలా నడుచుకుంటాడు, పరిపాలన ఎలా సాగిస్తాడు, వ్యవస్థలో అందరికీ జవాబుదారీతనం ఉండాలని ఎలా పనిచేస్తాడు అనే సున్నితమైన అంశాల్ని మహేష్ తెర మీద పలికించిన విధానం చాలా బాగుంది. హీరోయిన్ కైరా అధ్వాని పాత్ర పరంగా చిన్నదైనా సెకండ్ హాఫ్ లో కథ మలుపు తిరగటానికి దోహద పడింది. ప్రకాష్ రాజ్, పోసాని, రావు రమేష్, బ్రహ్మాజీ తమ పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు:

దర్శకుడు కొరటాల శివ ఒక స్టార్ హీరో నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయి సినిమానైతే ఆశిస్తారో అలాంటి సినిమానే అందించారు. శ్రీ మంతుడు చిత్రం లో చెప్పిన సోషల్ మెసేజ్ ను మరో కోణం లో భరత్ అనే నేను లో చెప్పాడు. అయితే  కమర్షియల్ విలువల్ని వదిలిపెట్టకూడదనే తన ప్రాథమిక సూత్రాన్ని పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన సినిమాను రూపొందించారు. ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్ర చేస్తున్నాడంటే అందులో రియల్ లైఫ్ రాజకీయనాయకుల ఛాయలు మొత్తంగా కాకపోయినా కొంతైనా కనబడతాయి…కానీ కొరటాల మాత్రం సిఎం భరత్ పాత్ర ఏ ప్రాంత నాయకుడ్ని అనుసరించకుండా జాగ్రత్తపడ్డారు. కేవలం  ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని ఆయన రాసిన సన్నివేశాలు, వాటికి చూపిన పరిష్కారాలు ప్రేక్షకులకి బాగా కనెక్టవుతాయి.  మహేష్ ఇమేజ్ కు తగిన కథ, కథనాల్ని రాసుకున్న ఆయన ప్రతి 5 నిముషాలకి ఒక మంచి సన్నివేశంతో, డైలాగులతో చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటరటైనర్ గా రూపొందించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. .రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సందర్భానుసారమైన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను రెట్టింపు చేశాయి. సినిమాటోగ్రఫర్స్ రవి కె.చంద్రన్,యస్. తిరునవుక్కరసుల కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఫైట్స్, పాటలు, ఎలివేషన్ సన్నివేశాలను కెమెరాలో గొప్పగా బంధించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాఘవన్ వేసిన అసెంబ్లీ సెట్, దండాలయ్యా సామి పాటలో దేవాలయం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాణపు విలువలు అద్భుతంగా వున్నాయి. 

విశ్లేషణ :

మహేష్ బాబు, కొరటాల శివల కాంబినేషన్  అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని ఈ సినిమా ప్రేక్షకులను అభిమానులను అందుకునేలా ఉంది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ అసామాన్య నటన, హీరోయిజం తారా స్థాయిలో పండేలా కొరటాల శివ రాసిన ఎలివేషన్ సీన్లు, మంచి టేకింగ్, ఆసక్తిగా అనిపించే కీలకమైన సన్నివేశాలు, హెవీ యాక్షన్ సీన్స్, అదనపు బోనస్ అన్నట్టు ఉన్న పాటలు, రొమాంటిక్ ట్రాక్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా నెమ్మదించిన సెండాఫ్, కొంత ఎక్కువైన రన్ టైమ్ కొంత నిరుత్సాహానికి గురిచేస్తాయి. ఇక ఫస్టాఫ్లో వచ్చే మహేష్, కైరా అద్వానీల లవ్ ట్రాక్, మహేష్ సిఎం అవ్వడం, ప్రజల సమస్యల్ని తీర్చడం, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎపిసోడ్, ఫైట్ సీన్స్ హీరో పాత్రకి గట్టి ఎలివేషన్ ఇచ్చి ప్రేక్షకులను ఎమోషనల్ గా సినిమాతో పాటే జర్నీ చేసేలా చేశాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలను చిత్రీకరించిన తీరు, ఫైట్స్, కొరటాల శివ రాసిన అర్థవంతమైన డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నాయి. మొత్తం మీద అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకునేలా ఉన్న ఈ ‘భరత్ అనే నేను’ చిత్రంతో మహేష్ ఆడియో వేడుకలో చెప్పినట్టు మంచి సినిమాను అందించి తన హామీ ని  నిలబెట్టుకున్నాడు.