రివ్యూ : నాని పెర్ఫామెన్స్ హైలెట్ గా 'కృష్ణార్జున యుద్ధం'

రివ్యూ : నాని పెర్ఫామెన్స్ హైలెట్ గా 'కృష్ణార్జున యుద్ధం'

12-04-2018

రివ్యూ : నాని పెర్ఫామెన్స్ హైలెట్ గా 'కృష్ణార్జున యుద్ధం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్ :షైన్ స్క్రీన్స్, పంపిణి దారులు: శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ (దిల్ రాజు) 
నటీనటులు : నాని + నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్స‌ర్ మీర్, రవి అవన, బ్రహ్మాజీ తది తరులు...
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్ : సత్య. జి
మ్యూజిక్ :హిప్ హాప్ తమిజ, పాటలు : శ్రీజో, పెంచల్ దాస్, శ్రీ మణి, కె కె, హిప్ హాప్ తమిజ
సమర్పణ : వెంకట్ బోయన పల్లి
నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : మేర్లపాక గాంధీ

విడుదల తేదీ: 12.04.2018.

 

1963 లో వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' లో మహా నటులు యన్టీఆర్, ఏయన్నార్ కృష్ణార్జునులు గా నటించి మెప్పించారు. మళ్ళి1982 లో  'కృష్ణార్జునులు'  గా  సూపర్ స్టార్ కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు కలిసి నటించారు ఆ చిత్రం కూడా హిట్. పదేళ్ల క్రితం 2008 లో కింగ్ నాగార్జున, మంచు విష్ణు కలిసి చేసిన చిత్రం 'కృష్ణార్జున' ఇలా మూడు తరాల నటులు చేసిన టైటిల్ అది.  ఇప్పుడు నాని ద్విపాత్రాభినయం తో వచ్చిన చిత్రం కూడా `కృష్ణార్జున యుద్ధం`  పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు క‌లిసి మ‌హాభార‌త యుద్ధంలో శ‌త్రువుల‌ను జ‌యించారు. ఇప్పుడు మ‌రోసారి కృష్ణ‌, అర్జున్ క‌లిసి ఓ మంచి ప‌ని కోసం వేసే అడుగే మా `కృష్ణార్జున యుద్ధం` అని అంటున్నారు నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది. తన అద్భుత‌మైన న‌ట‌న‌తో నేచుర‌ల్ స్టార్‌గా రాణిస్తూ ఎనిమిది వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న నాని.. ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం ఈ రోజే  ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన చిత్రం  'కృష్ణార్జున య‌ద్ధం'  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. మరి ఈ చిత్రం కూడా గత చిత్రాలవలె ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం. 

కథ:

కృష్ణ(నాని) ఇక్కడ చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి గ్రామంలో చిన్నా చితకా పనులు చేస్తూ సరదాగా ఉంటాడు.  ఏ అమ్మాయి కనిపించినా ఇంప్రెస్‌ చెయ్యాలని ట్రై చేస్తుంటాడు, అప్పుడప్పుడు  చివాట్లు తింటూ వుంటాడు. అలాంటి కృష్ణకి సిటీ నుంచి వచ్చిన రియా(రుక్సర్‌ మీర్‌) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక రాక్‌స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్‌(నాని) అక్కడ యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో  మ్యూజిక్ షోస్ ఇస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంటాడు. ఏ అమ్మాయినైనా రెండే రెండు నిమిషాల్లో  లైన్‌లో పెట్టగల లవర్‌బోయ్‌. అయితే ఏ అమ్మాయినీ అతను ప్రేమించలేదు, ఎవర్నీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అయితే అతనికి తారసపడ్డ అమ్మాయి  సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్‌)ని మాత్రమే సిన్సియర్‌గా లవ్‌ చేస్తాడు. కానీ, అర్జున్‌ గురించి తెలుసుకున్న సుబ్బలక్ష్మి అతను ఎన్ని విధాలుగా ప్రపోజ్‌ చేసినా రిజెక్ట్‌ చేస్తుంది. ఇక్కడ కొన్ని కారణాల వల్ల విల్లెజ్ నుండి  కృష్ణకు చెప్పకుండా హైదరాబాద్‌ వచ్చేస్తుంది రియా. అదే టైం లో అక్కడ యూరప్‌లో అర్జున్‌ వల్ల ఇబ్బంది పడుతున్న సుబ్బలక్ష్మి కూడా అతనికి తెలియకుండా హైదరాబాద్‌ వచ్చేస్తుంది. హీరోయిన్లను  వెతుక్కుంటూ కృష్ణ, అర్జున్‌ కూడా హైదరాబాద్‌ వస్తారు. కానీ, ఇద్దరూ ఇంటికి చేరుకోరు. వారిద్దరూ ఏమయ్యారు? వారి ఆచూకీ తెలుసుకోవడానికి కృష్ణ, అర్జున్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందా? కృష్ణార్జునులుద్దరు కలిసి ఎవరిమీదైనా యుద్ధం ప్రకటిస్తారా అనేది మిగతా కథ. 

ఆర్టిస్ట్స్ పెర్ఫామెన్స్:

సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ కథలోని కృష్ణ పాత్ర, అందులో నాని నటించిన తీరు అద్భుతం. కృష్ణ పాత్రలో సాహసం, నిజాయితీ, ప్రేమ, హాస్యం వంటి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. . చిత్తూరు జిల్లా యాస మాట్లాడుతూ, పంచె కట్టులో కనిపిస్తూ, కామెడీ మంచి టైమింగ్ తో ఆయన కనబర్చిన పెర్ఫార్మెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా కృష్ణ పాత్రను కథలో, కథనంలో ఎక్కువ భాగం ఉపయోగించుకుని సినిమాను బోర్ లేకుండా  ముందుకు నడిపే ప్రయత్నం చేసిన దర్శకుడు గాంధీ. సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్, రియా పాత్రలో రుక్సార్ మీర్ ఇద్దరు మంచి గ్లామర్ గా కనిపిస్తూ పెర్ఫామెన్స్ సైడ్ కూడా  చిత్రానికి ప్లస్ అయ్యారు. ఫస్టాఫ్ మొత్తాన్ని కాసేపు కృష్ణ, ఇంకాసేపు అర్జున్ పాత్రల మీద, వాళ్ళ ప్రేమ కథల మీద నడిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే ప్రధాన పాత్రల లవ్ ట్రాక్స్ కూడ బాగానే ఉన్నాయి. ఇక నటుడు బ్రహ్మాజీ తన హాస్యంతో ఫస్టాఫ్లో పలు చోట్ల నవ్వించాడు.

సాంకేతిక వర్గం:

కృష్ణ, అర్జున్  లాంటి మంచి పాత్రల్ని సృష్టించిన దర్శకుడు మేర్లపాక గాంధీ రెండు సమాంతర ప్రేమ కథల్ని హాస్యంతో మిక్స్ చేసి నాని నటనను బేస్ చేసుకుని ఫస్టాఫ్ ను సరదగా నడపి ఆకట్టుకున్నారు కానీ ద్వితీయార్థాన్ని మాత్రం రొటీన్, కొన్ని బలహీనమైన అంశాలతో, కథనంతో నింపేసి కొంత నిరుత్సాహాపరిచారు. పాత్రలకు ఆయన రాసిన డైలాగ్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయి. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కుర్తి గ్రామంలో షూట్ చేసిన ప్రతి సన్నివేశం బాగుంది. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజ దారి చూడు...ఐ వన్నా ఫ్లై  పాటలు ఆకట్టుకున్నాయి మంచి  సంగీతాన్ని ఇవ్వడమే గాక మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ సెకండాఫ్ ను కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కొత్త నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి..

విశ్లేషణ:

ప్రధమార్థం మొత్తం కొత్తదైన కథనం, హాస్యం, నాని నటనతో సరదాగా సాగిపోగా కానీ  సెకండాఫ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రొటీన్ ట్రాక్లోకి మారిపోయి నిరుత్సాహానికి గురిచేస్తుంది. హీరోయిన్లు మాయమైపోవడం వెనకున్న కారణం కూడ రొటీన్ గా, చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఇక ఇద్దరు నానిలు కలిసి తమ తమ హీరోయిన్లను వెతికే ప్రయత్నాల్లో కూడ తీవ్రత కనిపించదు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణ పాత్రలో ఆయన కనబర్చిన నటన ఆయన అభిమానులను గొప్పగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తయారుచేసుకున్న ఫస్టాఫ్ కథనం, పాత్రల ద్వారా ఆయన పండించిన హాస్యం, పాటలు, ముఖ్య తారాగణం నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే అంశాలు కాగా మొత్తం మీద నాని నటనను, మంచి హాస్యాన్ని కోరుకునేవారిని, కొంత రెగ్యులర్ సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగినవారిని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.