ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే : గవర్నర్

ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే : గవర్నర్

05-03-2018

ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే : గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ సరసింహన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌  సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని సృష్టం చేశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. విభజన సమస్యల పరిష్కారానికి ఓ అవకాశం వచ్చినా వదిలి పెట్టేదిలేదని అన్నారు. ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడటంతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయామని తెలిపారు. ఆదాయం, ఆస్తుల పంపిణీలో హేతుబద్ధత లేని విభజన జరిగిందని విమర్శించారు. 9, 10 షెడ్యూల్‌ ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

విభజన హామీల అమలు  కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఏపీలో 11.31 శాతం వృద్ధిరేటు సాధించామని, వ్వవసాయరంగంలో 17.44 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేశామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. స్థానిక సమస్యలకు జన్మభూమి- మా ఊరు ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేక హోదా, ఆర్థికలోటు రైల్వేజోన్‌, గ్రీన్‌ఫీల్డ్‌ క్రూడాయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, రాజధానికి ఆర్థికసాయం నేటికి నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, దుగరాజుపట్నం పోర్టు, కడపస్టీల్‌, విశాఖ -చెన్నై కారిడార్‌, విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌, అమరాతికి ర్యాపిడ్‌ రైలు-రోడ్డు అనుసంధానం వంటివి నెరవేర్చాల్సి ఉందని అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా పోరాడుతున్నామన్న ఆయన ప్రజల డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయంలో ఏపీ వెనుకబడి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రూ.35వేలు వెనుకబడి ఉన్నామని చెప్పారు. పొరుగురాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం సాయమందించాలని కోరారు.