కొత్త ఆశలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

కొత్త ఆశలు

13-03-2017

కొత్త ఆశలు

నియోజకవర్గాల పునర్విభజన అంశం మరో మారు తెర పైకి రావడంతో రాజకీయ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఎదురు చూస్తున్న వారికి నియోజకవర్గాల పునర్విభజన వరంగా మారనుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణలోనూ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని రెండు రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పలు మార్లు సంకేతాలు కూడా కేంద్రం ఇచ్చినప్పటికీ,  2019 ఎన్నికల నాటికి పునర్విభజన జరుగుతుందా లేదా అనే మీ మాంసం ఉంది. ప్రస్తుతం ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో రాజకీయ వర్గాలతో పాటు, ప్రజల్లో కూడా చర్చనీయంశమైంది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఎస్సీ నియోజకవర్గాల పెంపు పై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనువుగా భౌగోళిక, ఇతర గణాంకాలు పాలనా యూనిట్లలో మార్పులు, చేర్పులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్‌ రిపోర్టు పంపాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ద్వారా ఉభయ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను పునర్విభజించి కొత్త సంఖ్యమేరకు సరికొత్త ప్రతిపాదనలను రెండు ప్రభుత్వాలు పంపాలి. తెలంగాణకు కొత్త జిల్లాల ఆదారంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముసాయిదాను ఆ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో డీలిమిటేషన్‌ ముసాయిదాను రూపొందించాల్సి ఉంది. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయిన సమయంలో కొత్త నియోజకవర్గాల అంశాన్ని సూచన ప్రాయంగా తెలియజేశారు. ఇప్పటి నుంచే పలువురు ఆశవహులు ఆయా నియోజకవర్గాల పై దృష్టి సారించారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు.