ఏపీలో కొరియన్‌ సిటీ

ఏపీలో కొరియన్‌ సిటీ

10-11-2017

ఏపీలో కొరియన్‌ సిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉందని, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలపై సృష్టతను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చేస్తామని దక్షిణ కొరియాకు చెందిన జపాన్‌ పారిశ్రామికవేత్తలు సృష్టం చేశారు. బుసాన్‌ నుంచి 200 కంపెనీలు తక్షణమే రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్లు ఉంటుందని వివరించారు. తాము మాత్రమే కాకుండా మరో 800 మంది పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.

బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌తో పాటు 30 మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందం విజయవాడకు వచ్చింది. వీరు పరిశ్రమల మంత్రి ఎన్‌.అమరనాథ్‌ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్‌ బాబు, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.

రాష్ట్రాన్ని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలను స్థాపించాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. బుసాన్‌ తరహాలో అమరావతిలో గానీ, రాష్ట్రంలో అన్ని అనుకూలతలూ కలిగిన మరో ప్రాంతంలో గానీ కొరియన్‌ సిటీని ఏర్పాటు చేస్తామని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి పార్కును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. డిజైన్‌, ఇతర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలతో వస్తే అవగాహనా ఒప్పందాలు చేసుకుందామన్నారు. నిర్దుష్ట ప్రతిపాదనలతో ముందుకొచ్చిన పెట్టుబడిదారులకు, పరిశ్రమల ఏర్పాటుకు సత్వరం, సులభతరంగా అనుమతిలిస్తామని, భూమి, నీరు నిరంతర విద్యుత్‌ తదితర రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఓడరేవుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారమందించాలని కొరియా బృందానికి విజ్ఞప్తి చేశారు.