ఆంధ్ర ప్రదేశ్ లో జపాన్ పరిశ్రమ
MarinaSkies
Kizen

ఆంధ్ర ప్రదేశ్ లో జపాన్ పరిశ్రమ

11-08-2017

ఆంధ్ర ప్రదేశ్ లో జపాన్ పరిశ్రమ

నవ్యాంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివద్ధికి పెట్టుబడులు వెల్లువలా తాకుతున్నాయి. రాష్ట్రంలో రూ.1540 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జపాన్ కంపెనీ టోరే రూ.1000 కోట్లు హీరో మోటార్ కార్పోరేషన్ కంపెనీ అయిన రాక్‌మెన్ ఇండస్ట్రీస్ రూ. 540 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. 


ప్రధాని నరేంద్రమోడీ మేడిన్ ఇండియా పిలుపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మేకిన్ ఆంధ్రప్రదేశ్ పిలుపు తర్వాత పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు టోరే కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపుతో శ్రీసిటీని తాము తమ పెట్టుబడికి, వ్యాపార విస్తరణకు గమ్య స్థానంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు. శ్రీసిటీలో టెక్నికల్ టెక్స్‌టైల్ ఉత్పాదక పరిశ్రమను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 300 నుంచి 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి టోరే గ్రూప్ ఆఫ్ కంపెనీ వార్షిక టర్నోవరు $20.3 బిలియన్ డాలర్లని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాల్లో తమ సంస్థకు పరిశ్రమలు ఉన్నాయని, ఓవర్సీస్ నెట్ సేల్స్ $ 9.5 బిలియన్ డాలర్లని తెలిపారు. తమ సంస్థల్లో 46,248 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.


టోరే గ్రూప్ ఫైబర్ టెక్స్ టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సైన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాలలో వ్యాపారం చేస్తోందని వివరించారు. భారత్ లో తన వ్యాపార విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసిన టోరే కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో టోరే ఇండియా విభాగం కంపెనీ ప్రతినిధులు, రాక్‌మెన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. టోరే ఇండియా గ్రూప్ కంపెనీ శ్రీసిటీలో తన యూనిట్‌కు వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసి 2020 కి ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించనున్నది. 


చిత్తూరు జిల్లా దక్షిణ భారతదేశానికే లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అటు చెన్నయ్ నగరానికి, ఇటు కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉందని వివరించారు. రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల సంస్థ నుంచి శ్రీసిటీకి భూమిని బదలాయిస్తుందన్నారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.