దేశం లో తొలిసారి గా రెండు పరిశ్రమల కు లైసెన్స్ లు ఇచ్చిన బిఐఎస్ హైదరాబాద్ శాఖ కార్యాలయం

దేశం లో తొలిసారి గా రెండు పరిశ్రమల కు లైసెన్స్ లు ఇచ్చిన బిఐఎస్ హైదరాబాద్ శాఖ కార్యాలయం

17-07-2019

దేశం లో తొలిసారి గా రెండు పరిశ్రమల కు లైసెన్స్ లు ఇచ్చిన బిఐఎస్ హైదరాబాద్ శాఖ కార్యాలయం

భారతదేశం లో మొట్ట మొదటి సారి గా రెండు వివిధ పరిశ్రమల కు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు భారతీయ ప్రమాణాల మండలి (బిఐఎస్) హైదరాబాద్ శాఖ కార్యాలయం తెలిపింది. ఈ పరిశ్రమల లో తాడిపత్రి లోని అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ తో పాటు హైదరాబాద్ లోని విక్టరీ మాట్రెసెస్ ప్రయివేట్ లిమిటెడ్ లు ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ కు గ్రౌండ్ గ్యాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ అనే ఉత్పాదన తయారీ కి, అలాగే విక్టరీ మాట్రెసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కు బెడ్ మాట్రెస్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ 13489: 2000 అనే ఉత్పత్తి కి ఈ లైసెన్సులను ఇచ్చినట్లు బిఐఎస్ వెల్లడించింది.

గ్రౌండ్ గ్యాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ ను సిమెంట్, మార్టర్, ఇంకా కాంక్రీట్ లలో ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించినందువల్ల కాంక్రీట్ యొక్క సంపీడన సంబంధిత శక్తి (కంప్రెసివ్ స్ట్రెంథ్) పెరుగుతుంది. అంతే కాక వాడవలసిన సిమెంట్ ను తక్కువ మోతాదు లో వాడితే సరిపోతుంది కూడా.  కార్బన్ డయాక్సైడ్  ఉద్గారాలు దాదాపుగా 40 శాతం వరకు తగ్గుతాయి. సున్నపురాయి, శిలాజ జనిత ఇంధనాల వంటి సంప్రదాయేతర వనరుల ఆదా సైతం సాధ్యపడుతుంది. దీనిని సిమెంట్ పరిశ్రమ లలో వాడటం వల్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. ఫలితంగా సిమెంట్ తుది ధర కూడా చౌక అవుతుంది. మౌలాలి లో గల బిఐఎస్ హైదరాబాద్ శాఖ కార్యాలయం లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో బిఐఎస్ డైరెక్టర్ జనరల్ సురీన రాజన్ ఈ లైసెన్సు లను ఇచ్చారు. బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (స్టాండర్డైజేషన్) డాక్టర్ ఆర్.కె. బజాజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వినియోగదారుల పరిరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తూ ప్రమాణీకరణ, ధ్రువపత్రాల జారీ ప్రక్రియల ద్వారా స్వచ్ఛ్ భారత్, ఇంకా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన లో బిఐఎస్ ఏ విధంగా తోడ్పాటు ను అందిస్తున్నదీ బిఐఎస్ డైరెక్టర్ జనరల్ సురీన రాజన్ సభ లో వివరించారు. పరిశ్రమలు, పరిశోధకులు, వినియోగదారులు తదితర వర్గాల ఉమ్మడి కృషి తో ప్రమాణీకరణ అనే బృహత్ కార్యం సాగుతోందని బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె. బజాజ్ అన్నారు.