విజయవాడలో హ్యాపీ సిటీస్ సమ్మిట్

విజయవాడలో హ్యాపీ సిటీస్ సమ్మిట్

14-02-2018

విజయవాడలో హ్యాపీ సిటీస్ సమ్మిట్

వచ్చే ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే హ్యాపీ సిటీస్ సమ్మిట్-2018 సదస్పుకు విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్ ను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో హ్యాపీ సిటీస్ సమ్మిట్ కు సన్నాహక ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. సదస్సులో అతిథులకు ఆర్గానిక్ వంటకాలను వడ్డించాలని, అతిథుల భద్రతకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచనలు చేశారు. హ్యాపీ సిటీస్ సమ్మిట్ అమరావతి-2018 కి లోగో రూపకల్పనపై చర్చించారు. ముఖ్యమంత్రి కొన్ని నమూనాలు పరిశీలించారు. మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించాలని, కూచిపూడి డ్యాన్స్ ఐకాన్ ను ఉంచాలని సూచించారు. హ్యాపీ సిటీస్ సమ్మిట్ లోగో ఇంకా అసెంబ్లీ భవనం, హరిత, జల రాజధాని ఇతివృత్తాన్ని ప్రతిబింబించాలన్నారు. సదస్సులో వివిధ అంశాలపై చర్చలకు వేదికలను రూపొందించాలని కోరారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనంగా సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ను వినియోగించవచ్చని సీఆర్డీఏ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి పరిశీలిద్దామన్నారు. రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందని సీసీడీ ఎంసీ ఎండీ లక్ష్మీ పార్ధసారథిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వర్షాకాలం వచ్చేలోగా రహదారుల నిర్మాణం పూర్తికావాలని చంద్రబాబు ఆదేశించారు.