విజయ్ ప్రకాశ్ పాటలతో పరవశించిన బే ఏరియా

విజయ్ ప్రకాశ్ పాటలతో పరవశించిన బే ఏరియా

16-05-2018

విజయ్ ప్రకాశ్ పాటలతో పరవశించిన బే ఏరియా

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ఆధ్వర్యంలో సిపిఎ సంజయ్‌ నిర్వహించిన విజయ్‌ ప్రకాశ్‌ సంగీత విభావరి ఉల్లాసంగా సాగింది. ఏప్రిల్‌ 28వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 1000మందికిపైగా శ్రోతలు తరలివచ్చారు. దాదాపు 3 గంటలపాటు సూపర్‌, డూపర్‌ హిట్టయిన పాటలను ప్రకాశ్‌ పాడి అందరినీ పరవశింపజేశారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్‌ స్పాన్సర్‌గా సన్నివేల్‌ పీకాక్‌, ఇతర స్పాన్సర్లుగా అపెక్స్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, మీడియా పార్టనర్‌గా విరిజల్లు రేడియో వ్యవహరించింది. గాయని అనూరాధ భట్‌తో కలిసి విజయ్‌ పాటలను పాడారు.

బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత విజయ్‌ తదితరులను వేదికపైకి ఆహ్వానించారు. ఓం నమశ్శివాయ, ఈ హృదయం, లలిత ప్రియ కమలం, నిన్నుకోరి, కన్నానులే, రాసలీల, గురువారం, హల్లో రమ్మంటే, దిల్‌ క్యా కరే వంటి పాటలను పాడారు. పాత-కొత్త పాటల కలయికతో ఓహో గులాబీ బాలా, ప్రేమ ఎంత మధురం, సిరిమల్లెపువ్వా వంటి పాటలను పాడారు. శాస్త్రీయ కీర్తనలతోపాటు విజయ్‌కు పేరు తెచ్చిన ఓమ్‌ శివోహం పాటను అద్భుతంగా పాడి మరోసారి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఓ పిల్లా, ఆరడుగుల బుల్లెట్‌, అందం హిందోళం, పక్కా లోకల్‌, లెట్స్‌ డూ కుమ్ముడు, రింగ రింగ వంటి పాటలను పాడి చివరన జయహో పాటతో తన సంగీత విభావరిని విజయ్‌ ప్రకాశ్‌ ముగించాడు.

విజయ్‌ ప్రకాశ్‌, అనూరాధ భట్‌తోపాటు అరుణ్‌కుమార్‌, వేణుగోపాల్‌, వెంకీ, హర్షవర్థన్‌, భృతువా కలెబ్‌తోపాటు బాటా కరవోకె టీమ్‌ సభ్యులు కృష్ణ కాంత్‌, విజయ్‌, మేఘదీప్‌, మాధవ్‌, మానస, ఈషా, నవ్య, సంజన, శరణ్య కూడా కోరస్‌లో పాలుపంచుకున్నారు. బాటా ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి విజయ్‌ ప్రకాశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. బాటా టీమ్‌ను ఆయన పరిచయం చేశారు. హరినాథ్‌ చికోటి (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), కొండల్‌రావు (ట్రెజరర్‌), అరుణ్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కళ్యాణ్‌ కట్టమూరి, రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, కల్చరల్‌ డైరెక్టర్‌లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌ చింత, వరుణ్‌ ముక్క, అపర్ణ, హరి సన్నిదిని పరిచయం చేశారు. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు బాటా అడ్వయిజరీ నాయకులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ బాటా టీమ్‌ను అభినందించారు.

Click here for Event Gallery