అమెరికా వ్యక్తుల సమూహంకాదు. అది ఒక సంఘటిత శక్తి - డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, ఎండి
APEDB

అమెరికా వ్యక్తుల సమూహంకాదు. అది ఒక సంఘటిత శక్తి - డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, ఎండి

13-03-2017

అమెరికా వ్యక్తుల సమూహంకాదు. అది ఒక సంఘటిత శక్తి - డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, ఎండి

ఆర్. కె. ఎడిటోరియల్ కు తెలుగులో సమాధానం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కేవలం అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్యన, కెనడా,మెక్సికో మధ్యన వున్న ఒక భూభాగం మాత్రమే కాదు. యిది ప్రజల వారి జన్మస్థలానికి, రంగు, భాషకూ, మతానికీ అతీతంగా వారు, వారి సంపూర్ణ సామర్థ్యాన్ని పొందే అవకాశాన్ని కలిపించే శక్తి. యిది వారికి క్రమశిక్షణ, సమయపాలన - ఆలోచనా మనో నియంత్ర్రణా పరిధినిదాటి సృజనాత్మకతను వెలికి తీసుకొనివచ్చి - స్వేశ్ఛాయుత వాతావరణంలో గురువుల సత్సంగంలో విద్యనేర్చి - సంఘంలో ప్రతి పౌరుడూ హక్కులకు ముందు బాధ్యతలను గుర్తించేలా చేసి - సంఘంలోని వైవిధ్యాన్ని దేశానికి వరంగా గ్రహించగలిగేటట్లు చేసి - ప్రజలు ధైర్యంగా, సాహసోపేతంగా దుస్సాధ్యాన్ని సుసాధ్యం చేయునటులచేసి - సమ దృష్టి, సమానత్వం, సత్వర సమ న్యాయం భాగస్వామ్య పాలన, స్వేచ్ఛ జీవినావకాశాలతో, ఒకే సంఘటితశక్తిగామారి – ఆశక్తినే ఆధారంగా చేసుకునే ఒకానొక దేశం అమెరికా.

అమెరికా ఒక సమాజ సంఘటిత ఐక్యశక్తి. యిది ఒక త్యాగ భూమి, జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్, ఫ్రాక్లిన్.డి. రూజ్వెల్ట్, కెన్నెడీ, రీగన్, క్లింటన్, ఒబామాల కర్మభూమి. ప్రవాస శ్వేత జాతీయులు మరోశ్వేత జాతి వలసవాద బ్రిటన్ను పోరాటంలో తన రక్తాన్ని చిందించి గెలిచిన దేశం. నల్లజాతి బానిసత్వవిముక్తికై తెలుపు నలుపు తేడాలేకుండా, శ్వేత జాతి అధ్యక్షుడు అబ్రహం లింకన్ నాయకత్వంతో, అందరూకలసి పోరాడి సివిల్ వార్లో గెలిచిన దేశం.

మంచి, చెడు అనేది దేశ, జాతి, మతం, భాషలకతీతంగాఉంటుంది. ప్రతివారిలోను మంచి, చెడు వివిధ పాళ్ళలో వుంటుంది. అబ్రహం లింకన్ లాంటి నాయకులు ప్రజలలోని మంచిని ప్రేరేపించి అమెరికా లో నల్ల జాతివారి బానిసత్వాన్ని నిర్మూలించగలిగారు. వేరొక రీతిన హిట్లరు ప్రజలలోని చెడుని ప్రేరేపించి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైనాడు.

కాన్సాస్ సిటీ కాల్పుల సంఘటనలోనూ మనం యీరెండు రకాల వారినిచూశాం. యిద్దరూ శ్వేత జాతీయులే. యిద్దరూ విద్యావంతులే. యిద్దరూ ప్రపంచ జ్ఞానం వున్నవారే. నిందుతుడు ఒక రాజకీయ అవకాశవాది ద్వారా తనలోని చెడు రెచ్చగొట్టబడి యీ దురదృష్టకరమైన నీచమైనకార్యం చేసాడు. యింకొక శ్వేత జాతీయుడు తన ప్రాణాన్ని సైతం లెక్కించక ధైర్యంగా ఎదురునిలచి గాయపడ్డాడు.

అమెరికా యిప్పటికంటే అతిక్లిష్టమైన 1929-39లో “ద గ్రేట్ డిప్రషన్” లోనూ కూడాతన ఓర్మిని నిరూపించింది. 24 శాతం నిరుద్యోగం, 14 శాతం జి.డి.పి తరుగుదలతో, ప్రభుత్వఖజానా జీతాలుకూడాయివ్వలేనిపరిస్థితులలో, బాంకులు దివాలాతీసి చేతులెత్తిన సమయంలోనూ, యీ సమాజ సంఘటిత ఐక్యశక్తి, ఫ్రాక్లిన్.డి. రూజ్వెల్ట్ ను 1933లో అద్యక్షునిగా ఎన్నుకొని “భయాన్ని గురించే భయ పడండి”, అభయం ధీరలక్షణం అని నినదించి ధీరతతో, ఓరిమితో బయటపడి ఎదిగిన ఆదర్శ దేశం. అటువంటి అతిక్లిష్టమైన సమయంలోనూ వారు తమ ఇబ్బందులకు వలసవారు కారణమని ఆరోపించలేదు. నా స్వంత అనుభవాల ఆధారంగాకూడా శ్వేతజాతీయులందరూ జాత్యంకారులు అని అనలేను. అందరిలో లాగునే వారిలో కూడానూ, మంచివారూ, చెడ్డవారూవున్నారు. మంచితనం, బలహీనతలూ వున్నాయి.

వారిలో నాకు అమెరికా నౌకాదళంలో పని చేసిననాటి నుండి నేటికీ మంచి స్నేహితులుగా నిలచినవారూవున్నారు. అలాంటి ఒక ఉదాహరణ: కెప్టెన్ హాడ్జ్, నావల్ ఎయిర్ స్టేషన్ బ్రన్స్ విక్, మైన్ వద్ద నేవీ మెడికల్ క్లినిక్కు కమాండింగ్ ఆఫీసర్. అతను నేను నేవీలోచేరి బ్రన్సవిక్ వచ్చినప్పుడు నా కుటుంబానికి అతను నేవీ లాడ్జ్ లో మా బస ఏర్పాటుచేస, తనే స్వయంగా వచ్చి పట్టణంలో జరగబోయే ఇంద్రాణి రెహ్మాన్ ఇండియన్ డాన్స్ కార్యక్రమ వివరాలను మాకు తెప్పించి అందజేసి, తన ఇంట్లో విందుకు ఆహ్వానించాడు. అతడే స్వయంగా మాట్లాడి తన యింటిపక్కనే నాకు కెప్టెన్ హోదాకు సరిపడే ఫర్నిషడ్ క్వార్టర్సును యిప్పించాడు. నాకు క్రాస్ కంట్రీ స్కీయింగ్ నేర్పాడు. గోర్మేక్లబ్, ప్రోగ్రసివ్ డిన్నర్ క్లబ్బుల లోకి మమ్మలను చేర్పించాడు. ఈ రోజు కూడా ప్రతి కొత్త సంవత్సరంలోనూ గడిచిన సంవత్సర విశేషాలతో తన చేతితో స్వయంగా వ్రాసిన మొదటి శుభాకాంక్షల ఉత్తరమే మాకుచేరే మొదటి గ్రీటింగ్స్.

మరొక స్నేహితుడు దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష గురించి జరిగిన చర్చ సందర్భంగా ఆశ్చర్యకరంగా "దక్షిణఆఫ్రికాలో శ్వేతజాతీయులు ఎంతో భయంతో జీవిస్తున్నారు పాపం" అని వివక్ష కుకారణమైన శ్వేతజాతి పై తన సానుభూతిని చూపించటం ద్వారా ఒకసారి తన బలహీనతను ప్రదర్శించాడు. యితడు అమెరికా నౌకాదళంలో సైకాలజిస్టు, మంచి మనిషి మరియు స్నేహితుడు. కానీ యితడికి జాతి వివత్స దాగి వున్న ఒకబలహీనత. మంచి, చెడు రెండూ అతనిలోనే వున్నాయి. రెచ్చ గొట్టబడినప్పుడు మాత్రమే యీ అదృశ్య కోణం జాతి వివత్స రూపంలో బయటకు వచ్చిదర్శనమిస్తుంది. మనకు కుల వివక్షరోగం ఎలానో వీళ్ళకు జాతివివక్షరోగం అలాగనే.

ప్రపంచ చరిత్ర చూడండి. తెల్లవాడు తన సొంత దేశంలో వున్నా, లేక యితర దేశాలకు వ్యాపార లేదా తదితర కారణాల వలన వలస వచ్చినా అతడే ఎల్లప్పుడూ పరిపాలించాడు, పరిపాలింపబడలేదు. యిండియా, దక్షిణాఫ్రికా, రోడీషియా, అమెరికా సహా దీనికి ఉదాహరణలు. వ్యాపారం కోసం. వారు భారతదేశం వచ్చినప్పుడు, ఆర్కె గారు చెప్పినట్లు జీవనోపాధికివచ్చేముకదాఅని అణిగిమణిగి వుండలేదు. స్థానిక భారతీయులు వారికి అవకాశం యిచ్చేదాకా వేచివుండ లేదు. వారే లాక్కున్నారు. మనలను తక్కువజాతిగా వివక్షతో పాలించారు. అధికారం మారింది. స్వయం పాలన వచ్చిన 67 సంవత్సరాల తరువాత కూడా, మనం ఇప్పటికీ యిదేఆత్మన్యూనతను మన మనస్సునుండి వదిలించుకోలేకపోతున్నాం. ఆనాటి యీమేధో బానిసత్వం ఇప్పటికీ కూడామనమనసులలో వేలాడుతోంది. దీనికి ఆర్కె గారిసూక్తులే ఉదాహరణ. దీనినేమానసిక దాస్యం అంటారు.

భారతీయ డయాస్పోరాలో భాగంగా, అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి కంటే, "జీవనోపాధికి వచ్చినవారు తక్కువగా, అణకువగా ఉండాలి" అనే ఆర్కెగారి సూక్తులు మనలను పాలించిన ఆ బ్రిటన్లకు చెబితే ప్రయోజనం వుండేదేమో. యన్. ఆర్.ఐ లు భారతదేశం ప్రతిఫలం చెల్లించని, ఆశించని సాంస్కృతిక రాయబారులు. భారతీయ సంస్కృతిని హృదయంలోపదిలపరచుకొని, అమెరికాకు జేబులో 8 డాలర్లతోచాలాకాలంక్రితంవచ్చి, అమెరికాలోని మంచి విద్యావిధానాన్ని వుపయోగించుకొని, అమెరికాలోని శ్రమ, కృషి, క్రమశిక్షశ్రణ లాంటి మంచివిలువలను గ్రహించి మంచిపౌరులుగావుండి, "ఐడియల్ యిమ్మిగ్రంట్స్" అనే బిరుదును సంపాదించుకొన్నారు.

అధ్యక్షుడు క్లింటన్, అధ్యక్షుడు ఒబామా అనేక సార్లు తమ అధ్యక్ష వుపన్యాసాలలో భారతీయ అమెరికన్లు చాలావిద్యావంతులని, అత్యంత స్వయంకృషితోఎదిగిన సంపన్నులని, అత్యంత వినయశీలురని, అత్యంత క్రమశిక్షణతో కూడిన పౌరులని ప్రశంసించారు. అందరు భారతీయులు లేదా అందరు తెలుగువారు యీ ప్రశంసలకు అర్హులని నేననటంలేదు. సంపద దురహంకారులు, సంపద ప్రదర్శకులు, అన్ని దేశాలలో, అన్నిజాతులలోలాగానే వీరిలోకూడా కొంతమంది ఉండవచ్చు. అందరిని యిదేగాటిలోచేర్చటం, అదే యీసంఘటనలకుకారణంఅని విశ్లేషించటం సరైనదికాదు. స్థానికులు మమ్మల్ని అంగీకరిస్తున్నారు. అనుకరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆర్కె గారు దయచేసి మీరు తెలుసుకోవలసినసత్యం స్థానికులు మమ్మలని ద్వేషించటంలేదు, గౌరవంగాచూస్తున్నారని.

రెండు అత్యుత్తమ సంస్కృతుల, భారతదేశ సాంస్కృతిక విలువలు, అమెరికా వృత్తి నీతి, కృషి క్రమశిక్షణల మేళవింపు మేమనీ, స్థానికులు దీనిని గుర్తించే "ఐడియల్ యిమ్మిగ్రంట్స్" ఆదర్శ వలస వారని ప్ర్రశంసిస్తారని తెలియండి. . మాలో పెద్ద సంఖ్యలో భారతదేశంలోనూ, అమెరికాలోనూ సేవలు చేసేవారు కోకొల్లలు. మీసానుభూతి, దండింపుల,ఈసడింపులకంటే,.వారిని, వారిలోని సేవానిరతిని గుర్తించి వారిని చూచి మన యువత స్పందించి మేల్కొనేలాచేయండి.

నేను వ్యక్తిగతంగా అమెరికాలోనూ, అలాగే భారతదేశంలోనూ, అనేక వైద్య సేవా శిబిరాలు చేసాను. నేను అమెరికా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో క్లింటన్ ప్రతినిధిగా ఎన్నికయ్యాను. మేము పేదల కోసం డల్లాస్ లో ఒక ఉచిత వైద్య క్లినికును నడుపుతున్నాం. నాకు మూడు సంవత్సరాల క్రితం పార్కిన్సన్ వ్యాధి నిర్ధారణ అయి దేహం పూర్తిగా సహకరించనప్పటికీ, రిటైర్మెంట్ తీసుకొని, రెండు దేశాల్లో నూ: 6 నెలలు భారతదేశం లో, 6 నెలలు అమెరికాలో వుంటూ సేవాకార్యక్రమాలు చేస్తూవున్నాను.

ఆర్కె గారు మా సంస్థల గురించి మాట్లాడుతూ కులం, ప్రాంతం ఆధారంగా విడిపోయాం అని, స్వలాభాపరులేయిందులోఎక్కువగావున్నారన్నట్లుగా చిత్రీకరించారు. మా సంస్థ తానా (నేను 5 వ ప్రెసిడెంట్) రెండు గొప్ప మానవతావాదులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు, శ్రీ రవీంద్రనాథ్ గుత్తికొండ గారిచే స్థాపించబడింది. మీరు గమనించిన మైనారిటీ చెదురుమదురు చర్యలతో ఈ సంస్థను, యీ సంస్థను పెంచి పెద్దదిగాచేసిన నిస్వార్ధులను కించపరిచే కంటే, వారిని గుర్తించి, వారిజీవితం, పదుగురి యువతకు ఆదర్శం అయేలాకార్యక్రమాలుచేయండి. సహజంగా వచ్చే చిన్నచిన్న కలతలే యీసంస్థ ల ధ్యేయం అని ప్రచారంచేయకండి.

మా యువత గురించి మీరుచేసిన వ్యాఖ్యానాలు అసమంజసం, సత్యదూరం. దీనిని బట్టివారిని గురించి మీకు పూర్తి అవగాహనలేనట్లే. వారి భవిష్యత్తు కోసం, భారతదేశ భవిష్యత్ తరాల కోసం మేమెంతోశ్రమించాం,యిక్కడా, అక్కడాయిప్పటికీ చాలాకష్టపడుతున్నాం. సత్ఫలితాలు సత్కార్యాలకు నిదర్శనం.. మాయువత యిప్పుడు ప్రతి రంగంలోనూ ముందున్నారు, చదువులలోనూ, , క్రీడలలోనూ, సంగీతంలోనూ, నాట్యంలోనూ ప్రముఖులై, అమెరికాలో ఇక్కడ దేశమంతా అసూయ పడేటట్లు అందరికీ ఆదర్శంగావున్నారని చెప్పటానికి గర్విస్తున్నాను. . ఇప్పటికే మా ప్రవాసులలో యిద్దరు రిపబ్లికన్ గవర్నర్లు, ఒక ఐక్యరాజ్యసమితి రాయబారి, సర్జన్ జనరల్, చాలామంది కాంగ్రెస్ మెన్ వున్నారు. భవిష్యత్తులో సెనెటర్లుగా, జడ్జీలుగానూ వస్తారు. చాలా తొందరగానే మన యిండో అమెరికన్ యువత అమెరికా అధ్యక్షపదవి చేపట్టి, యావత్ ప్రపంచ గౌరవ ప్రశంసలను అందుకుంటాడనేది మానమ్మకం. వారి ద్వారా భారత్ ప్రపంచానికి “వసుధైక కుటుంబం” అనేదానికి నిజమైన అర్థంతెలియచేస్తుంది.

కులం అమెరికా ప్రవాసుల జాడ్యమని మీబాధ నాకు సంతోషంగావుంది. ఎందుకంటే యిండియాలో నా శేవా కార్యక్రమాలలో ఒకటి కులవివక్షను నిర్మూలించటం. దీనిగురించే పలుమార్లు మీ “ఓపెన్ హార్టు విత్ ఆర్కె” లో చర్చకు అవకాశంకల్పించమని అడగటం జరిగింది. ప్రజాకర్షణవున్న టాలీవుడ్ యింటర్వూలవత్తిడితో మునిగి తేలుతున్న మీరు, దీనికి చోటులేదని అనటంజరిగింది. మీమనసుమారి వుంటే నేనెప్పుడూరెడీ.

మీరు అమెరికా సంఘటనలకూ తెలంగాణ పోరాటానికీ పోలిక ఉందని అనటం మాకు విస్మయాన్ని కలిగించింది. నా గత 47 సంవత్సరాల సమయంలో ప్రవాసులకు వ్యతిరేకంగా ఏ విధమైన ఆందోళనా చూడలేదు.యింతవరకూజరుగలేదు. మీరూ, యితరులూ అమెరికా ప్రవాసులను గో హోమ్ అంటుదనేప్రచారం అవాస్తవికం. ఎప్పుడూజరగనిది. జరిగినది ఒక సంఘటనమాత్రమే. స్థానికులు అత్యధికంగా దీనిని నిరసించారు. జరిగిన ప్రదర్శనలూ,, నిరసనలన్నీ యీసంఘటనకూ, ట్రంపుకూ వ్యతిరేకంగానే. ఇప్పుడు యిక్కడ జరుగుతున్న ర్యాలీలు రిపబ్లికన్ టౌన్ హాల్ సమావేశాలకు వ్యతిరేకంగానూ, అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇతర విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి.

అమెరికా, తెలంగాణా, యీరెండిటికీ సామ్యం ఏదయినా వున్నదంటే అది కె.సి.ఆర్ , ట్రంప్ యిద్దరూ ఒకే ఆలోచనతోటి, పదవే ధ్యేయంగా ఏది చెపితే ప్రజలకిష్టమో అదేచెప్పి, స్వార్ధంతోప్రజలలోని సహజవ్యతిరేక భావాలకు ఆజ్యంపోసి, పదవే ధ్యేయంగా, పదవినిపొందారు. యిదే సామ్యం రెండిటికీ. కానితెలంగాణాలో జరిగింది, ప్రపంచంలోఎక్కడా జరుగ కూడనిది. ఒకేరాష్ట్రంలోని ప్రజలు అదే రాష్ట్రంలో వేరొక ప్రాంతంలోని పౌరులను వెళ్ళిపొమ్మనటం అరాచకం. విజ్ఞులు దీనికి మద్దత్తు యివ్వరు. ఒక దేశప్రజలు ఆదేశంలో వారికి నచ్చినచోట నిర్భయంగా జీవించే స్వేశ్ఛ లేని దేశం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఉద్యోగం పోటీ ఆధారాలపై మీ లాంటి ప్రముఖ పాత్రికేయులు నుండి వెలువడిన మీ సమర్థన మాకందరికీ ఆశ్ర్ఛర్యకరం. వినయం విద్యలక్షణంగా వుంటే అది మానవీయవిలువ, అలాకాకుండా బ్రతుకుతెరువుకు వచ్చావుకాబట్టి, బ్రతుకుతెరువుకు వచ్చినవారే వినయంగావుండాలి అనేది బానిసత్వలక్షణం. “నీకాలుమొక్కుతాన్దొరా” అనటం వినయంకానేరదు. యిది దాశ్యం. సహజంగా వచ్చే వినయం ఓ మానవీయ విలువ, బలవంతంగా వచ్చేవినయం ఒక మనోదాశ్యం, బానిసత్వలక్షణం. గౌరవంగా, ఆత్మగౌరవంతోబ్రతుకున్నమమ్మల్ని మాసహజమైన విజ్ఞతకు వదలి వేయండి.

నేడు ఏదో అమెరికా ఆర్థికంగా కష్టాలలోవుండి, ప్రజలకుఉద్యోగాలులేక, వలస వచ్చినవారిని గోహోమ్ అని అంటున్నారాని చేసే ప్రచారంలో నిజం లేదు. అమెరికాలో ఉద్యోగ పరిస్థితి యిప్పుడేబాగుంది, నిరుద్యోగం కేవలం 4% మాత్రమే. ఆ 4 శాతంలో కూడానూ కొంతమంది వుద్యోగం చేయకుండానే ఆహార స్టాంపులు, నెలసరి నిరుద్యోగభృతి తీసుకొనాలనుకొనేవారు వున్నారు. కొన్ని మినహాయింపులు ఉండవచ్చు కానీ యిది సాధారణంగా నిజం. పని కోరుకునే వారందరికీ పని ఉంది.

12 మిలియన్ ల నమోదిత అక్రమ వలసదారులు స్థానిక అమెరికన్లు నుండి వుద్యోగాలు తీసుకొని పోవటంలేదు. స్థానికులు చేయుటకు యిష్టపడని వ్యవసాయ, గృహ నిర్మాణ పనులు మాత్రమే వీరుచేసి దేశసంపదకు పరోక్షంగాదోహదంచేస్తున్నారు. మెక్సికో నుండి యీవలస కార్మికులను ఆపివేస్తే, కాలిఫోర్నియా, టెక్సాస్ మరియు ఇతర వ్యవసాయ రాష్ట్రాల్లో వ్యవసాయం ఆగిపోతుంది. అదేవిధంగా ఇప్పటికే గ్రామీణ అమెరికాలో చాలా కొద్ది మంది వైద్యులు మాత్రమే వున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చేవలస వైద్యులను ఆపివేస్తే, ఆస్పత్రులలో 25%, గ్రామీణ ఆసుపత్రులలో బహుశా 50% మూతపడుతాయి. ఇతర దేశాల నుంచి వచ్చే ఐటీ నిపుణులను ఆపివేస్తే, అమెరికన్ ఉత్పత్తి మరియు వ్యాపార ఆధిపత్యం నష్టపోవచ్చు.

సారాంశం అమెరికాకు వలసలు చాలా అవుసరం. అదిలేని అమెరికాఊహంచనలవికానిది. యిదే జరిగితే, వారి పేటెంట్లు, రాయల్టీస్ దానిమీద ఆధారపడిన దేశసంపద కొండెక్కినట్లే. యిండో అమెరికన్లను వివిధ కంపెనీల సారధులగానియమించటం వారిప్రతిభకూ, నిరాడంబరతకూ, వారి కలుపుగోలుతనానికీ నిదర్శనం.

యిప్పుడు జరిగిన జరగరాని సంఘటనలు, వాటిని ప్రేరేపించి లాభపడినవారి పదవులుకూడా తాత్కాలికం. అమెరికాకు ముఖ్యమైన రక్షణ వారిసైనికశక్తికాదు, మనలా, బ్రిటీషురాజ్యాంగాన్నియధా తధంగా కాపీచేయకుండా వారు విజ్ఞతతో కల్పించిన ”చెక్స్ అండ్ బాలెన్స్ స్.” యీ చెక్స్ అండ్ బాలెన్స్ స్ వలన రెండుసంవత్సరాలలోపునే, అక్రమమార్గంద్వారా లబ్ధిపొందిన వారంతా శ్రీకృష్ణ జన్మ స్థానికివెళ్తారనేది నిస్సందేహం.

అమెరికాలో వున్న మంచి, దానిశక్తి ద్వారా మార్చబడలేని ఏచెడు అమెరికాలో లేనేలేదు. అందరి పౌరులకు మాదిరి, యీదేశం మాదికూడాను. ఏకత్వం, ఐక్యత దీనివూపిరి. యిందులో స్థానికపౌరులనీ, వలసపౌరులనీ తేరతమ్యాలు లేక, అందరూ ఒకేఅమెరికాలోభాగస్వాములమనీ, అదేయునైటెడ్ స్టేట్స ఆఫ్ అమెరికాఅని, ఐక్యత దీని అదృశ్య అనంతశక్తిఅని, యీ విడదీయరాని శక్తిద్వారానే, సమ దృష్టి, సమానత్వం, సత్వర సమ న్యాయం, స్వేచ్ఛ, జీవినావకాశాలను నిత్యజీవితంలో అందరికీ అనుభవానికి వస్తాయని, యీ శక్తి భౌగోళిక స్వరూపమే మేం నివసించే గౌరవించే, మావలస దేశం, ”ద యునైటెడ్ స్టేట్స ఆఫ్ అమెరికా” అనితెలియండి. –దానిలో భాగస్వామిగా – మీ రాఘవేంద్రప్రసాద్.