కాలిఫోర్నియాలో కాల్పులు

కాలిఫోర్నియాలో కాల్పులు

10-03-2018

కాలిఫోర్నియాలో కాల్పులు

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అతిపెద్ద వెటరన్స్‌ హోంలో సాయుధుడైన దుండగుడు ముగ్గురు మహిళలు కాల్చి చంపాడు. దుండగుడు కూడా చనిపోయి కనిపించాడని కాలిఫోర్నియా హైవే గస్తీ పోలీసులు వెల్లడించారు. తొలుత దుండగుడు ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు భావించారు. పోలీసులకు, దుండగుడికి మద్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. తర్వాత హోంలో పరిశీలించి చూడగా దుండగుడు సహా నలుగురు మరణించి కనిపించారు. అయితే వెటరన్స్‌ హోం ఉన్న ఆ ముగ్గురు మహిళలనే దుండగుడు ఎందుకు చంపాడనే విషయం తెలియరాలేదు. వారితో దుండగుడికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం సృష్టం కాలేదు. దుండగుడి వివరాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు మహిళలు వెటరన్స్‌ హోంలోని పాత్‌వే హోం ఉద్యోగులని గుర్తించారు. పలు యుద్ధాల్లో పాల్గొని మానసిక ఒత్తిడితో బాధపడుతున్న సైనికులకు పాత్‌వే హోంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు.

అమెరికాలోనే అతి పెద్ద వెటరన్స్‌ హోం ఇది. దీన్ని 1984లో ప్రారంభించారు. ఇందులో వృద్ధులు, వికలాంగులు దాదాపు వెయ్యి మంది ఉంటారని అక్కడి వెటరన్స్‌ అఫైర్స్‌ విభాగం వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఇరాకీ ఆపరేషన్స్‌ తదితర వాటిల్లో పాల్గొన్న వారు ఈ వెటరన్స్‌ హోంలో ఉంటున్నారు. ఇందులో 1200 సీట్లతో థియేటర్‌, గోల్ఫ్‌ కోర్స్‌, బేస్‌బాల్‌ స్టేడియం, బౌలింగ్‌ లేన్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌ తదితర ఎన్నో సదుపాయాలు ఉంటాయి.