ట్రంప్ టీమ్ నుంచి మరో వికెట్ ఔట్

ట్రంప్ టీమ్ నుంచి మరో వికెట్ ఔట్

01-03-2018

ట్రంప్ టీమ్ నుంచి మరో వికెట్ ఔట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌లో మరో వికెట్‌ పడింది. వైట్‌హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ డైరక్టర్‌గా ఉన్న హోప్‌ హిక్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలంగా ఆమె ట్రంప్‌ సలహాదారుగా ఉన్నారు. 29 ఏళ్ల మాజీ మోడల్‌ అయిన హోప్‌ హిక్స్‌, ట్రంప్‌ సంస్థలో చాన్నాళ్లుగా పనిచేశారు. వైట్‌హౌజ్‌లో తన పాత్ర ముగిసినట్లు ఆమె తన సన్నిహితులతో వెల్లడించినట్లు తెలుస్తోంది. గత మూడేళ్లలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వైట్‌హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌గా పనిచేసిన నాలుగవ వ్యక్తి. అయితే హోప్‌ హిక్స్‌ ఎప్పుడు వైట్‌హౌజ్‌ను వదలి వెళ్తుందన్న విషయం సృష్టంగా తెలియదని వైట్‌హౌజ్‌ ప్రతినిధి సారా శాండర్స్‌ తెలిపారు.

అమెరికా ఎన్నికల సమయంలో రష్యా జోక్యం చేసుకుందన్న కేసులో ప్రస్తుతం హౌజ్‌ కమిటీ విచారణ చేపడుతున్నది. ఆ కేసులో హౌజ్‌ కమిటీకి కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ప్రెసిడెంట్‌ అబద్ధాలు చెప్పినట్లు ఆమె ఆ విచారణ సమయంలో అంగీకరించారు. కానీ రష్యా జోక్యం గురించి మాత్రం తానేమీ చెప్పలేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్‌కు ప్రెస్‌ సెక్రటరీగా హిక్స్‌ పనిచేశారు. గత ఏడాది ఆందోనీ స్కారాముకీని తొలగించిన తర్వాత, వైట్‌హౌజ్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌గా హోప్‌ హిక్స్‌ బాధ్యతలు స్వీకరించారు. అంతకన్నా ముందు ఆ హోదాలో సీన్‌ స్పైసర్‌, మైక్‌ డుబ్కేలు చేశారు.