వైట్ హౌస్ వద్ద ఎన్నారైల భారీ ర్యాలీ

వైట్ హౌస్ వద్ద ఎన్నారైల భారీ ర్యాలీ

05-02-2018

వైట్ హౌస్ వద్ద ఎన్నారైల భారీ ర్యాలీ

ప్రతిభను గుర్తించి గ్రీన్‌ కార్డులను జారీ చేయాలని కోరుతూ, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో వైట్‌హౌస్‌ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలువురు భారతీయులు పాల్గొన్నారు. తానా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లాటరీ పద్ధతివల్ల తెలుగువాళ్ళు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

'ద హిందూ అండ్‌ ఇండియన్‌ కమ్యూనిటీ' నేత త్వంలో చేపట్టిన భారీ ర్యాలీలో.. దాదాపు వెయ్యి మంది భారతీయులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. తానా, రిపబ్లికన్‌ హిందూ కమిటీ తదితర సంస్థలు స్వరం కలిపాయి. అమెరికా వలస విధానంలో ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి. మెరిట్‌తో సంబంధం లేకుండా దేశాలకు ప్రత్యేక కోటా పెట్టడం వల్ల ప్రతిభగల వారికి అన్యాయం జరుగుతోందని నినదించాయి. వైట్‌హౌస్‌ ఎదుట భారతీయులు ర్యాలీ చేపట్టడం ఇదే మొదటిసారి. వీరిలో హెచ్‌1బీ వీసా కలిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, టెక్నికల్‌ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. గ్రీన్‌ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడం వల్ల తమ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. తమ పిల్లలు ఇక్కడికి రావాలని కోరుకోలేదని, కానీ వారికి ఇక్కడ మంచి జీవితం ఇవ్వాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ ర్యాలీలో తానా తరఫున యశ్వంత్‌ బొడ్డులూరి, రామ్‌చౌదరి ఉప్పుటూరి, సతీష్‌ వేమన, శలభ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.