ట్రంప్! మా గతేంటి?

ట్రంప్! మా గతేంటి?

05-02-2018

ట్రంప్! మా గతేంటి?

నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడే మా అమ్మానాన్నలతో కలిసి అమెరికా వచ్చాను. పుట్టింది భారత్‌తోనే అయినా, ఊహ తెలిసినప్పటి నుంచి అమెరికాయే నా ఇల్లు. అంత మాత్రాన, నాకు 21 ఏళ్ళు వచ్చాక భారత్‌కు తిప్పి పంపుతారా? కాదు గ్రీన్‌ కార్డు తీసుకుని, ఇక్కడే ఉందామంటే అందుకు 70 ఏళ్లకు పైగా వేచిచూడాలా? ఇదెక్కడి న్యాయం ఇది వర్జీనియాలోని రోనాల్డ్‌ రీగన్‌ స్కూల్లో చదువుతున్న 13 ఏళ్ల అక్షిత రమేశ్‌ ప్రశ్న. తమిళనాడులోని తంజావూర్‌లో పుట్టిన అక్షిత తండ్రి సాప్ట్‌వేర్‌ నిపుణుడు. ఆయన హెచ్‌1 బీ వీసాపై వారి కుటుంబ అమెరికాలో ఉంటోంది. అక్షిత ఒక్కరే కాదు, పలువురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థులు ట్రంప్‌ సర్కారును ప్రశ్నించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ వద్ద ద హిందూ అండ్‌ ఇండియన్‌ కమ్యూనిటీ నేతృత్వంలో చేపట్టిన భారీ ర్యాలీలో దాదాపు వెయ్యి మంది భారతీయులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.

 తానా, రిపబ్లికన్‌ హిందూ కమిటీ తదితర సంస్థలు స్వరం కలిపాయి. అమెరికా వలస విధానంలో ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి. మెరిట్‌తో సంబంధం లేకుండా దేశాలకు ప్రత్యేక కోటా పెట్టడం వల్ల ప్రతిభగల వారికి అన్యాయం జరుగుతోందని నినదించాయి. వైట్‌హౌస్‌ ఎదుట భారతీయులు ర్యాలీ చేపట్టడం ఇదే మొదటిసారి. వీరిలో హెచ్‌1బీ వీసా కలిగిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు, టెక్నికల్‌ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. గ్రీన్‌ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడం వల్ల తమ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఇక్కడికి రావాలని కోరుకోలేదని, కానీ వారికి ఇక్కడ మంచి జీవితం ఇవ్వాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా ఈ ర్యాలీలో తానా తరపున యాష్‌ బొడ్డులూరి, రామ్‌చౌదరి ఉప్పుటూరి, సతీష్‌ వేమన తదితరులు పాల్గొన్నారు.