సాహిత్యం పై సోషల్ మీడియా ప్రభావం

సాహిత్యం పై సోషల్ మీడియా ప్రభావం

04-02-2018

సాహిత్యం పై సోషల్ మీడియా ప్రభావం

టాంటెక్స్‌ 126వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు

ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) సాహిత్య వేదిక సమర్పించు ''నెల నెలా తెలుగు వెన్నెల'' సాహిత్య సదస్సు ఆదివారం, జనవరి 21 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 126 నెలలుపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.

కార్యక్రమంలో ముందుగా శ్రీమతి స్వాతి శిష్యులు చిన్నారి శీలంశెట్టి శ్రీవల్లి, రాకం దర్షిత, గాలి దీప్తి మృదుమధురంగా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి ''మన తెలుగు సిరిసంపదలు'' శీర్షికన జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ కార్యక్రమంలో ప్రేక్షకులను కూడా పాల్గొనేట్టు చేసి ఎంతో ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. చిన్నారులు వేముల సాహితీప్రియ, వేముల సింధూర, తడుముకోకుండా, చూడకుండా ''జయతి జయతి'' మరియు '' జయ జయ ప్రియ భారత'' గీతాలను చక్కగా పాడి ప్రశంసలు అందుకున్నారు.

వేముల లెనిన్‌ ''గుర్రం జాషువా'' కొన్ని పద్యాలను ఒక శీర్షికగా ప్రతినెలా పరిచయం చేయాలని ఉందని తెలియచేస్తూ, తనదైన వాగ్ధాటితో ''రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలందు'' వంటి ఉదాహరణలను సభతో పంచుకున్నారు. శ్రీ మద్దుకూరి చంద్రహాస్‌ గతంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బల్లూరి ఉమాదేవి రచించిన ''శ్రీ రామ దూత శతకం'' పుస్తక పరిచయం చేసారు. పుస్తకం ముందుమాట చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అని, వాయుదేవుడి అంశగా రచయిత్రి ఆంజనేయుడు, భీముడు మరియు మద్వాచార్యుడు ముగ్గురి పై కలిపి 115 పద్యాలు ఈ శతకంలో వ్రాసారు అని ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేసారు. శ్రీ కన్నెగంటి చంద్ర స్వీయ కవిత ''ఒకప్పుడు'' మరియు స్వీయ కథ ''యుద్దం'' చదివి వినిపించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి కర్ర విజయ సాహిత్యం పై సోషల్‌ మీడియ ప్రభావం అనే అంశంపై ప్రసంగించారు. స్పందన, అభిప్రాయం వేరు వేరు అంటూ, నాటి పత్రికలలో స్పందన శీర్షికన వారాల తరబడి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఎలా స్పందిచేవారో ఉదాహరణలతో గుర్తుచేసారు. నేటి సోషల్‌ మీడియా లో స్పందన, విమర్శ లు అప్పుడప్పుడూ వెళ్ళే రైలు బండి అయితే , కామెంట్ల బండి మాత్రం పాసెంజరు ట్రైన్లలా వెళ్తూనే ఉంటాయి అన్నారు. అందమైన తెలుగుభాష రచనలో అందంగా ఒదుగుతుంది, అదే మాటల్లో చెప్తే తేలిపోతుంది అంటూ ఉదాహరణలు చెప్పారు. నాటి నేతి సాహిత్య పోకడలపై ఆసక్తికరంగా ప్రసంగించారు.

ముఖ్య అతిథిని సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్త సింగిరెడ్డి శారద పుష్పగుచ్ఛంతో సత్కరించి సభకు పరిచయం చేయగా, ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి క ష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర దుశ్శలువా, మరియు సాహిత్యవేదిక బంద సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) అధ్యక్షులు శీలం క్రిష?వేణి, తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కష్ణారెడ్డి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, పాలకమందలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, బండారు సతిష్‌, పార్నపల్లి ఉమామహేష్‌, మరియు సాహిత్య వేదిక బందం సభ్యులు డా. కలవగుంట సుధ, మాడ దయాకర్‌, అట్లూరి స్వర్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) అధ్యక్షులు శీలం క్రిష్ణవేణి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో తాము చేయనున్న అన్ని కార్యక్రమాలకు సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరారు. సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్త సింగిరెడ్డి శారద గత సంవత్సరమంతా కార్యక్రమానికి విచ్చేసిన సహకరించిన అందరికీ కత్ఞతలు తెలియజేస్తూ, ముందు ముందుకూడా మంచి అతిథులను వేదికకు పరిచయం చేసే బాధ్యత సాహితీప్రియులందరిదీ అని అన్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

Click here for Event Gallery