ముప్పైఐదు సంవత్సరాలు కూచిపూడి కళా సేవలో డాక్టర్ రమణ వాసిలి!
MarinaSkies
Kizen

ముప్పైఐదు సంవత్సరాలు కూచిపూడి కళా సేవలో డాక్టర్ రమణ వాసిలి!

31-12-2017

ముప్పైఐదు సంవత్సరాలు కూచిపూడి కళా సేవలో డాక్టర్ రమణ వాసిలి!

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి. భారతీయులు అందునా హిందూ మతాన్ని అవలంభిస్తూ సనాతన ధర్మానికి కట్టుబడ్డ వారికి ఆయువుపట్టు ఈ శ్రీనివాస క్షేత్రం.అన్నమయ్య ఆదిగా ఏం ఎస్ సుబ్బలక్ష్మి వరకు ఎందరెందరో వాగ్గేయకారులు, సంగీత శిరోమణులు వేంకటేశ్వరునికి సమారాధనులు చేసిన వారే. మంగళంపల్లి బాల మురళీకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసుడిగా, వెంపటి చిన సత్యం ఆస్థాన నృత్య విద్వాంసుడిగా గతంలో అలరించారు. డాక్టర్ రమణ వాసిలి ప్రముఖ కూచిపూడి నృత్య కోవిదుడు పద్మ విభూషణ్ శ్రీ వెంపటి శిష్యుడు.  శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో రసాయన శాస్త్రంలో ఎమ్. ఎస్ మరియు పిహెచ్. డి విద్యార్థిగా శ్రీ రమణ1982 తిరుపతి పట్టణంలో Indian Ballet Theater, కూచిపూడి నృత్య శిక్షణాలయాన్ని ప్రారంభించారు.  

కొన్ని వందలమందికి కూచిపూడి నృత్యం లో శిక్షణ ఇవ్వడమే కాదు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో, తాళ్లపాకలో అన్నయ్య వర్ధంతి మరియు జయంతి వేడుకల్లో అనేకసంవత్సరాలు అద్భుతమయిన నృత్య ప్రదర్శనలు చేసారు. డాక్టర్ రమణ కొన్ని వందల అన్నమయ్య పదాలకు నృత్య రచన చేసారు అంటే ఆశ్చర్యం లేదు. ఇండియన్ బాలేథియేటర్ బృందం డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ ఆధ్వర్యంలో శ్రీ కాళహస్తి, శ్రీ హరికోట, నెల్లూరు, బళ్లారి, విశాఖపట్నం, విజయనగరం, సింహాచలం, తెనాలి,చిత్తూర్, నందలూరు, కుప్పం, విజయవాడ, గుంటూరు ఇలాగ అనేక పట్టణాల్లో కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు.

1987లో పదమూడేళ్ల చిన్నారి కుమారి వసుమతి24గంటలపాటు అవిరామంగా తిరుపతి త్యాగరాజ మండపంలో చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన, 1982లో ఆరు సంవత్సరాల మాస్టర్ ఆదిత్ అన్నమాచార్యకళామందిరంలో చేసిన అన్నమయ్య నృత్యభిషేకం డాక్టర్ రమణ నృత్యశిక్షణకి, నైపుణ్యానికి నిదర్శనాలు.

1993లో తొలిసారిగా అమెరికాకు వచ్చిన డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్రప్రభ వాసిలి కొంతకాలం సౌత్ కరోలినా రాష్ట్రంలోని రాక్ హిల్ పట్టణంలో ఉన్నపటికీ 1995లోటేనస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ పట్టణాన్ని స్థిరనివాసంగా మార్చుకున్నారు. డాక్టర్ వాసిలి దంపతులు ఇద్దరు నృత్య శిక్షకులు కావడం, జంటగా ప్రదర్శనలివ్వడం విశేషం. డాక్టర్ప్రసాద్ మరియు డాక్టర్ విజయలక్ష్మి దుగ్గిరాల నిర్దేశికత్వంలో గత పాతిక సంవత్సరాలుగా "అమెరికా వైకుంఠం"గా ప్రసిద్ధి చెందిన ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ (ICCT) లో డాక్టర్ వాసిలి దంపతులు కూచిపూడి నృత్యశిక్షణా తరగతులు నిర్వహించడం ఎంతైనా ముదావహం.

డాక్టర్ రమణ బృందం సయింట్ లూయిస్ పట్టణంలో జరిగిన 2017 తానా సంబరాల్లో, చికాగో పట్టణంలో జరిగిన 2017 నాట్స్ సంబరాల్లో నృత్య ప్రదర్శన చేసారు. అలాగేమెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయ ద్వితీయ జీర్ణోధారణ ఉత్సవాల్లో, మెంఫిస్ తెలుగు సమితి సంక్రాంతి మరియు ఉగాది వేడుకల్లో ప్రదర్శనలిచ్చారు.

డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి వృత్తి పరంగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాని సాహిత్యం, లలితకళల పట్ల ఉన్న ఆసక్తితో, ముందుతరాల వారికి మన సంస్కృతిని అందించాలనే ఆలోచనతో స్పిరిట్యువల్ ఫౌండేషన్ అనే ధార్మిక సంస్థని స్థాపించారు. ఈ ఫౌండేషన్ నిర్వహించే కూచిపూడి నృత్య శిక్షణ తరగతులికి ఆర్థికంగా టెన్నీస్సీ రాష్ట్ర ప్రభుత్వం టేనస్సీ ఆర్ట్స్ కమిషన్ ద్వారా సహాయం చేయడం ఎంతో ప్రోత్సాహకరం. గత రెండు సంవత్సరాలుగా టేనస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్  బాలే థియేటర్ డాన్స్ ప్రాజెక్ట్స్  ముఖ్యంగా కూచిపూడి నృత్యాన్ని భారతీయ శాస్త్రీయ నృత్యంగా గుర్తించి ఆదరించడం అమెరికాలోని తెలుగు వారందరు గర్వించదగ్గ విషయం అన్నారు డాక్టర్ రమణ వాసిలి.

For more details visit: http://www.spiritualfoundation.us/ and  https://icctmemphis.org/