ఎపిలో సాంకేతిక ప్రగతికి ఎన్నారైల చేయూత - జయరామ్‌ కోమటి

ఎపిలో సాంకేతిక ప్రగతికి ఎన్నారైల చేయూత - జయరామ్‌ కోమటి

27-12-2017

ఎపిలో సాంకేతిక ప్రగతికి ఎన్నారైల చేయూత - జయరామ్‌ కోమటి

ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో ముఖ్యంగా సాంకేతికంగా అభివృద్ధిపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా అమెరికాలోని ఎన్నారైలు నిలుస్తున్నారని, అందులో భాగంగానే పాఠశాలల్లో డిజిటల్‌ విద్యకు వారు చేయూతను ఇస్తున్నారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి అన్నారు. ఎపి జన్మభూమి పనుల ప్రగతిని సమీక్షించేందుకు విజయవాడ వచ్చిన జయరామ్‌ కోమటి తెలుగు టైమ్స్‌ న్యూస్‌ ఎడిటర్‌ గోవిందరాజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

ఎపి జన్మభూమి ఇంతవరకు చేపట్టిన పనుల ప్రగతి ఏమిటి?

ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 2400 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశాము. 100 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్‌ను, వివిధ చోట్ల 50 శ్మశానవాటికలను ఇప్పటివరకు అభివృద్ధిపరిచాము.

ఇంకా ఎన్ని చోట్ల డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేయనున్నారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మా ఎన్నారైల తరపున 5,000 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తామని చెప్పాము. అందుకు అనుగుణంగా విడతలవారీగా పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం పూర్తయ్యేలోగా దాదాపు 5,000 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాము.

ఎన్నారైల నుంచి మీకు వస్తున్న స్పందన ఎలా ఉంది?

అమెరికాలో స్థిరపడిన ప్రతి తెలుగు ఎన్నారై మాతృరాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా సాయపడుతున్నారు. డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు ఎంతోమంది ఎన్నారైలు చేయూతను ఇస్తున్నారు. ఈ డిజిటల్‌ తరగతుల ఏర్పాటులో ఎన్నారై 30శాతం విరాళమిస్తే, మిగిలిన  70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో మాతృరాష్ట్రంలో పనులను చేపడుతామని నిధులు ఇమ్మంటే తాము ఇచ్చే నిధులు ఎలా సద్వినియోగం అవుతాయో లేదోనన్న సందేహం దాతల్లో కలిగేది. కాని ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావడం వల్ల నిధులను ఇచ్చేందుకు ఎన్నారై దాతలు వెనుకాడటం లేదు. ఎన్నారైలు మాతృరాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయా పాఠశాలలను సందర్శించి తాము ఇచ్చిన విరాళాలు సద్వినియోగమయ్యాయన్న సంతృప్తితో వెళుతున్నారు.

డిజిటల్‌ తరగతుల ఏర్పాటు వల్ల సత్ఫలితాలు ఏవైనా వచ్చాయా?

మేము ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతుల వల్ల ఆయా పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం బాగా పెరిగిందని రిపోర్టులు వచ్చాయి. దానికితోడు విద్యార్థులకు ఇది ఎంతో మేలుగా ఉందని పాఠశాల టీచర్లు చెప్పడం కూడా మాకు సంతృప్తిని కలిగించింది. విద్యార్థినీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికే కాకుండా పాఠశాల విద్య నాణ్యతను కూడా గణనీయంగా పెంచేందుకు ఈ తరగతులు దోహదపడుతున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాలు, శ్మశానవాటికల పనుల వివరాలు చెప్పండి?

దాదాపుగా 100కిపైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిచాము. ఈ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాము. వివిధ చోట్ల ఉన్న దాదాపు 50 శ్మశానవాటికలను ఎన్నారైల నిధులతో అభివృద్ధిపరిచాము. మరిన్ని చోట్ల చేస్తున్నాము.

ప్రభుత్వం నుంచి మీకు లభిస్తున్న ప్రోత్సాహం ఎలా ఉంది?

చాలా బాగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపి జన్మభూమి ప్రోగ్రెస్‌పై సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు ఎన్నారైలు మరింతగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చూడాలని, ఇందుకు తమవంతుగా చేయూతను కూడా ఇస్తామని చెప్పారు.

అలాగే మంత్రి నారా లోకేష్‌ కూడా ఎపి జన్మభూమి కార్యక్రమాలను మెచ్చుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివద్ధి మరియు సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా సమీక్షించేలా ప్రత్యేక డ్యాష్‌ బోర్డ్‌ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐలు నిధులు ఇచ్చిన నాటి నుండి 30 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని,  మహాప్రస్థానాల అభివృద్ధికి ఎన్నారైల నుంచి వచ్చిన నిధులతో పనులను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు.